Today History: చంద్రుడిపై గోల్ఫ్ ఆడటం అంటే మజాకా.. కానీ, నాసాకు చెందిన వ్యోమగామి 1971 లో సరిగ్గా ఇదే రోజున చంద్రుడిపై గోల్ఫ్ ఆడి చరిత్ర సృష్టించారు. నాసా మూన్ మిషన్ అపోలో-14 వ్యోమగామి అలాన్ షెఫర్డ్ చంద్రునిపై గోల్ఫ్ ఆడారు. ఆ సమయంలో అలాన్ షెఫర్డ్ చంద్రుడిపై రెండు గోల్ఫ్ బంతులను కొట్టాడు. ఈ ఘటన జరిగిన 50 ఏండ్ల తర్వాత 2021 లో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. చంద్రుడిపై ఆడిన గోల్ఫ్ బంతులను కనుగొన్నట్లు ప్రకటించింది.
గోల్ఫ్ ఆడిన చిత్రాలను తన ట్విట్టర్ హ్యాండిల్లో నాసా పంచుకున్నది. అలాగే, చంద్రునిపై ఆడిన బంతుల స్థానాలను గుర్తించింది. వ్యోమగామి అలాన్ షెఫర్డ్ తన గోల్ఫ్ స్టిక్‌తో కొట్టిన బంతులను ఇమేజింగ్ నిపుణుడు ఆండీ సాండర్స్ సహాయంతో నాసా గుర్తించింది. గోల్ఫ్ స్టిక్‌తో కొట్టిన బంతి చంద్రుడి ఉపరితలంపై ఎంత దూరంలో పడిందో కూడా నాసా శాస్త్రవేత్తలు చెప్పగలిగారు. నాసా తెలిపిన వివరాల ప్రకారం, మొదటి బంతి 24 గజాల దూరంలో.. రెండో బంతి 40 గజాల దూరంలో పడింది.
నాసా తన 8 వ మూన్ మిషన్ అపోలో-14ను 1971 జనవరి 31 న ప్రారంభించింది. అపోలో-14 ప్రయోగించిన వారం తర్వాత.. అంటే ఫిబ్రవరి 06 న చంద్రుడిపై దిగింది. ఈ మిషన్‌లో చంద్రుడిపైకి అలాన్ షెఫర్డ్ తోపాటు స్టువర్ట్ రౌసా, ఎడ్గార్ మిచెల్ కూడా వెళ్లారు. ఈ ముగ్గురిలో అలాన్ షెఫర్డ్ గోల్ఫ్ క్రీడాకారుడు కావడంతో అతను తన గోల్ఫ్ స్టిక్, గోల్ఫ్ బాల్‌ను తన స్పేస్ సూట్లో తీసుకెళ్లాడు. చంద్రుడిపై దిగిన తర్వాత అక్కడ గోల్ఫ్ ఆడుతూ రెండు బంతులు కొట్టాడు. దీంతో చంద్రుడిపై గోల్ఫ్ ఆడిన తొలి వ్యక్తిగా అలాన్ షెఫర్డ్ నిలిచాడు.
2007: అమెరికాలోని ఎమోరీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా నియమితులైన దలైలామా
1999: దేశంలో మొట్టమొదటి పేస్‌మేకర్ బ్యాంక్ కోల్‌కతాలో ప్రారంభం
1994: పాకిస్తాన్లో బహిరంగ మరణశిక్షలపై నిషేధం విధింపు
1987: ఆస్ట్రేలియా హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులై తొలి మహిళ జస్టిస్ మేరీ గోడ్రాన్
1983: భారత క్రికెట్ ఆటగాడు శ్రీశాంత్ కేరళలోని కొచ్చిలో జననం
1959: కేరళ హైకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ అన్నా చాందీ
1918: 30 ఏండ్ల వయసు పైబడిన మహిళలకు లభించిన ఓటు హక్కు