కెరీర్ ఆరంభం నుంచి కథాంశాల ఎంపికలో నవ్యతకు ప్రాధాన్యతనిస్తారు తమిళ హీరో విష్ణువిశాల్.
‘వెన్నిల కబడ్డీ కుజు’, ‘రాక్షసన్’ (తెలుగులో భీమిలీ కబడ్డీ జట్టు, రాక్షసుడు) వంటి సినిమాలు ఆయన ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఎఫ్.ఐ.ఆర్’ మను ఆనంద్ దర్శకుడు. తమిళ, తెలుగు భాషల్లో నెల 11న ప్రేక్షకులముందుకు రానుంది. ఈ చిత్రానికి తెలుగులో అగ్ర హీరో రవితేజ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా.. నిర్మాత అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర హీరో విష్ణు విశాల్ శనివారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో సంభాషించారు. ఆ విశేషాలివి..
ఈ సినిమాలో నేను ఇర్ఫాన్ అహ్మద్ అనే యువకుడిగా కనిపిస్తాను. టెర్రరిస్ట్‌గా ముద్రవేయబడ్డ అతని జీవితంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలు..వాటి నుంచి బయటపడటానికి అతను చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా కథ చెప్పినప్పుడు నా బాల్యం నుంచి విన్న కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి. అందుకే ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యాను. నాకు సయ్యద్ మహమ్మద్ అనే ఓ మిత్రుడున్నాడు. ఇరవైఐదేళ్ల స్నేహం మాది. ఓ వర్గానికి చెందిన వ్యక్తిగా తాను జీవితంలోని వివిధ దశల్లో, సందర్భాల్లో ఎదుర్కొన్న వివక్షాపూరిత సంఘటనల గురించి సయ్యద్ నాకు ఎప్పుడూ చెబుతుండేవాడు. ఈ సినిమా కథ వినగానే నా స్నేహితుడు చెప్పిన సంఘటనలు కళ్లముందు కదలాడాయి.
రవితేజకు బాగా నచ్చింది
మతం, కులం, జాతి ప్రాతిపదికన మనుషుల పట్ల వివక్ష చూపించే ధోరణిని నేను ఏమాత్రం సమర్థించను. విశ్వమానవ సౌహార్థ్రం, శాంతి, సౌభాగ్యం విలసిల్లాలని ఈ సినిమా ద్వారా తెలియజెప్పాం. అన్ని విలువల కంటే మానవత్వమే గొప్పదనే సందేశాన్ని అందించాం. నా భార్య గుత్తా జ్వాల కామన్‌ఫ్రెండ్స్ ద్వారా నాకు రవితేజతో పరిచయం ఏర్పడింది. ఈ సినిమా తమిళ వెర్షన్‌ను ఆయనకు చూపించగా బాగా ఇంప్రెస్ అయ్యారు. తెలుగులో సమర్పకుడిగా వ్యవహరిస్తానని ముందుకొచ్చాడు.
కొత్తదనానికే పెద్దపీట
ఈ సినిమాలో నా అభిమాన దర్శకుడు గౌతమ్‌మీనన్ కీలక పాత్రలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. నా వ్యక్తిగత జీవితం సంఘర్షణలో ఉన్నప్పుడు గౌతమ్‌మీనన్ ‘వారణమ్ ఆయిరమ్’ (తెలుగులో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’) చిత్రం ఎంతగానో స్ఫూర్తినిచ్చింది. ‘ఎఫ్.ఐ.ఆర్’లో బలమైన సందేశంతో పాటు ఊహించని మలుపులు థ్రిల్‌ను పంచుతాయి. నా కెరీర్లో అత్యధిక బిజినెస్ ఈ సినిమాకే జరిగింది. కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నా. కథలో కొత్తదనం లేకుంటే సినిమాల్ని అస్సలు అంగీకరించను. తొలి నుంచి ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తూ కెరీర్‌ను తీర్చిదిద్దుకుంటున్నా.