అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘బ్రహ్మాస్త్ర’. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున కీలక పాత్రలు పోషించారు. ‘బ్రహ్మాస్త్ర 1 శివ’ పేరుతో విడుదలైన ఈ సినిమా మేకర్స్ ఊహించిన దానికంటే పెద్ద విజయాన్నే సాధించింది. దీంతో రెండో భాగం కోసం ఉత్సాహంగా పనులు మొదలుపెట్టబోతున్నారు. ‘బ్రహ్మాస్త్ర 2, దేవ్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో దేవ్ క్యారెక్టర్లో ఏ స్టార్ నటించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.
హృతిక్ రోషన్ దేవ్‌గా కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హృతిక్ రోషన్‌ను ప్రశ్నించగా..‘ఇప్పుడైతే ఆ ప్రాజెక్ట్ నా దగ్గరకు రాలేదు. అయితే ఏదైనా జరగొచ్చు. అవకాశం వస్తుందనే ఆశిస్తున్నా’ అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం హృతిక్ తన కొత్త సినిమా ‘విక్రమ్ వేద’ ప్రచార కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ నెల 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన మరో సినిమా ‘ఫైటర్’ కూడా విడుదలకు సిద్ధమవుతున్నది.