e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home News రైతు ఆదాయం రెట్టింపు ఎలా?

రైతు ఆదాయం రెట్టింపు ఎలా?

వ్యవసాయ రంగానికి 2021- 22 కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించిన తీరుకు- రైతుల ఆదాయం పెరుగు దలకు ఏమాత్రం పొంతన కనబడటంలేదు. వ్యవసాయరంగానికి కేటాయించిన బడ్జెట్‌ గత సంవత్సరంతో పోలిస్తే 8శాతం తగ్గింది. వ్యవసాయరంగ అభివృద్ధికి ఏ ప్రత్యేక పథకాలను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌ రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడంలో సహాయపడగలదా?

రైతు ఆదాయం రెట్టింపు ఎలా?

దేశంలోని మొత్తం శ్రామికుల్లో దాదాపు 45 శాతం మంది వ్యవసాయరంగంలో పనిచేస్తున్నప్పటికీ ఇది ఉత్పాదకత అతి తక్కువగా ఉన్న రంగాలలో ఒకటి. మన దేశపు రైతులు ప్రధానంగా నైరుతి రుతుపవనాలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. దేశంలో వ్యవసాయయోగ్యమైన భూమిలో 49 శాతానికే నీటి వసతి ఉంది. ఇలాంటి స్థితిలోనూ దేశ సామాజిక, ఆర్థిక అభివృద్ధిలో వ్యవసాయానిదే కీలకపాత్ర. భారీ అనిశ్చితులు, నష్టాలతో వ్యవసాయం, అనుబంధ రంగాల జి.వి.ఎ. (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌- స్థూలవిలువ) వృద్ధి అస్థిరంగా మారింది. అయినప్పటికీ 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం.. దేశ ఆర్థికరంగం మొత్తం జి.వి.ఎ. 7.2 శాతం తగ్గగా వ్యవసాయరంగం జి.వి.ఎ. స్వల్ప పురోగతిని సాధించింది. అయితే ఈ వృద్ధి రైతుల ఆదాయాలు పెంచేందుకు దోహదపడే అవకాశం ఏమాత్రంలేదు.

స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి.)లో వ్యవసాయం వాటా 20 శాతం దాటడం గత పదిహేడేండ్లలో ఇదే మొదటిసారి. 2020-21 ఆర్థిక సర్వే ప్రకారం ఈ ఏడాది జి.డి.పి. పనితీరులో వ్యవసాయ రంగం ఒక్కటే ఆశావహమైన రంగంగా నిలిచింది. 2020-21లో ఇతర అన్ని రంగాలూ దారుణమైన నష్టాలను చవిచూసినప్పటికీ ఎటువంటి కష్టనష్టాలకైనా ఎదురొడ్డి నిలిచే రైతుసోదరుల నిబ్బరమే వ్యవసాయరంగం 3.4 శాతం పురోగతి సాధించేలా చేసింది. 2021-22 బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపుల అంచనా రూ.1.23 లక్షల కోట్లు. 2020-21లో ప్రాధమిక బడ్జెట్‌ అంచనా రూ.1.34 లక్షల కోట్లు కాగా సవరణ అనంతరం అంచనా రూ.1.16 లక్షల కోట్లు. అంటే గత సంవత్సరం సవరించిన బడ్జెట్‌తో పోలిస్తే కేవలం ఒక ఐదు శాతం బడ్జెట్‌ అంచనా పెరుగగా.. ఫిబ్రవరి 2020లో ప్రకటించిన ప్రాథమిక బడ్జెట్‌ అంచనా కంటే ఎనిమిది శాతం తక్కువగా ఉంది.

అసలే కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్‌ ఊతమివ్వకపోగా మరింత కుంటుపరుస్తుంది. స్థూలంగా చూస్తే ఈ బడ్జెట్‌ రైతుల ఆదాయాలను రెట్టింపు చేయగలదనే హామీ ఇవ్వడంలో, భరోసా కలిగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. నినాదాలు ఇవ్వడమే తప్ప ఈ లక్ష్యం సాధ్యపడేది కాదని ప్రభుత్వం సూచిస్తున్నదా? 

2022లో దేశం 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకొనే నాటికి రైతుల వార్షిక ఆదాయాలు రెట్టింపుచేయాలని ప్రధాని నరేంద్రమోదీ 2016 ఫిబ్రవరి 28న పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే ఉన్నా రైతుల ఆదాయం పెరిగిన దాఖలాలు కనిపించడంలేదు. తాజా కేంద్ర బడ్జెట్‌లో ఈ అత్యున్నత లక్ష్యాన్ని సాధించడానికి మార్గదర్శకాలు, ప్రణాళికలను సూచించలేదు. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖ, మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వశాఖల ఉమ్మడి వ్యయం మొత్తం మూలవ్యయంలో కేవలం ఐదు శాతమే. ఈ కేటాయింపుల శాతాన్ని కొంచెం లోతుగా గమనిస్తే రైతుల ఆదాయాల రెట్టింపు లక్ష్యం ప ట్ల చిత్తశుద్ధిలేమి స్పష్టంగా కనపడుతుంది.

పంటల, పాడిపరిశ్రమ ఉత్పాదకతను మెరుగుపరచేందుకు తీసుకున్న చర్యలను గమనిస్తే.. హరితవిప్లవం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించడానికి నిరుడు కేటాయించింది రూ.13,320 కోట్లు కాగా ఈసారి అది రూ.13,408 కోట్లు. గత సంవత్సరం కేటాయింపులో దాదాపు 25 శాతాన్ని వినియోగించలేదు. ప్రధానమంత్రి కిసాన్‌ సించాయి యోజనకు నిరుడు రూ.11,378 కోట్లు కేటాయించగా ఈసారి రూ.11,759 కోట్లు ఇచ్చారు. నిరుటి మొత్తాన్ని ఖర్చు చేయకపోవడంతో నీటిపారుదల విస్తీర్ణాన్ని పెంచడంలో, ఇతర లక్ష్యాల సాధనలో ఈ పథకం ఏ మేరకు విజయం సాధించిందనేది సందేహాస్పదంగా మారింది. స్వల్పకాలిక వ్యవసాయ రుణాలపై వడ్డీ రాయితీకి రూ.19,468 కోట్లను కేటాయించారు. ఇది నిరుటికన్నా రూ.1,707కోట్లు తక్కువ. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనకు కిందటేడాది మాదిరే రూ.16వేల కోట్లు కేటాయించారు. మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం, కనీస మద్దతు ధర పథకాలకు కేటాయింపు రూ.1,500 కోట్లు. ఇది నిరుటి బడ్జెట్‌ అంచనా (2,000 కోట్ల) కంటే చాలా తక్కువ. నిరుటి కేటాయింపుల్లో యాభై శాతం కూడా ఖర్చుపెట్టలేదు.

రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు ఆహార భద్రత పథకం కింద ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా వరి, గోధుమ, ఇతర ఆహార ధాన్యాలను సేకరిస్తుంటారు. ఈ కార్యక్రమానికి గత సంవత్సరం రూ.77,983 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది ఒకటిన్నర రెట్లు పెంచారు. అయితే 2020-21లో చిన్న మొత్తాల పొదుపు పథకం నుంచి ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అందించిన సుమారు రూ.1,36,000 కోట్లను పరిగణనలోకి తీసుకుంటే ఈ ఏడాది తక్కువ కేటాయింపు జరిగినట్లే. 

2020 మార్చి 3న అగ్రికల్చర్‌ స్టాండింగ్‌ కమిటీ పార్లమెంటుకు సమర్పించిన ఒక నివేదిక ప్రకారం.. అన్ని సంబంధిత ప్రభుత్వ శాఖలు కూడా రైతుల ఆదాయాలను రెట్టింపు చేసే దిశగా పనిచేయాలని కేంద్రప్రభుత్వం సూచించింది. ఈ ఆదేశాల ప్రకారం ఢిల్లీలోని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ రాష్ర్టాలవారీగా ఒక ప్రణాళికను సిద్ధంచేసింది. అయితే దీని అమలుకు ఎటువంటి నిధులు కేటాయించలేదు. ఈ విధమైన ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వ్యవసాయరంగాన్ని మరింత అప్పుల ఊబిలోకి, ఆర్థిక ఇ బ్బందులలోకి నెట్టే అవకాశం ఉంది. అసలే కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్‌ ఊతమివ్వకపోగా మరింత కుంటుపరుస్తుంది. స్థూలం గా చూస్తే ఈ బడ్జెట్‌ రైతుల ఆదాయాలను రెట్టిం పు చేయగలదనే హామీ ఇవ్వడంలో, భ రోసా కలిగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. నినాదాలు ఇవ్వడమే తప్ప ఈ లక్ష్యం సాధ్యపడేది కాదని ప్రభుత్వం సూచిస్తున్నదా? 

(వ్యాసకర్త: డైరెక్టర్‌, సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌, హైదరాబాద్‌ )  

రైతు ఆదాయం రెట్టింపు ఎలా?
Advertisement
రైతు ఆదాయం రెట్టింపు ఎలా?
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement