ఇల్లు చిందరవందరగా ఉంటే ‘ఇది ఇల్లా… అడవా..?!’ అని అంటుంటారు. కానీ, ఇప్పుడు అడవిని తలపించేలా ఇంటిని అలంకరించడమే ట్రెండ్ అయింది. ఇంట్లో అక్కడక్కడా వన్యమృగాలు ఉన్నట్టు కనిపించడమే ఫ్యాషన్‌గా మారింది. సఫారీ హోమ్ డెకార్‌తో ఇంటికి జంగిల్ లుక్‌ను తీసుకొస్తున్నారు. జంగిల్ థీమ్‌తో ఇంట్లో ఫర్నిచర్‌ను రకరకాల జంతువుల రూపాల్లో తయారు చేస్తున్నారు. అడవిలో పరిగెడుతున్న జింకలు, కుందేళ్ల తరహా ప్రింట్లు వచ్చే కుర్చీలతో పాటు ఏనుగులు, ఖడ్గమృగాలను పోలిన ఆసనాలు ఈ తరహాలో రూపుదిద్దుకుంటున్నాయి.
చిరుతపులి, సింహంలాంటి మృగాలు నడిచి వచ్చినట్టు కనిపించే టీపాయ్లూ… కప్ప, కోడి, ఆవులాంటి జీవుల కాళ్లను పోలిన స్టూళ్లూ వీటిలో వస్తున్నాయి. అంతేకాదు విభిన్న జాతుల కోతుల ముఖాల ఆకృతుల్లో ఫ్లవర్ వేజులూ, జిరాఫీ తరహా బెడ్ ల్యాంపుల్లాంటివి కూడా ఈ తరహాలో రూపొందుతున్నాయి. ఈ ఫర్నిచర్‌కు నప్పేలా అక్కడక్కడా తీగలూ, కొమ్మలూ వేలాడదీశారంటే జంగిల్ థీమ్‌తో ఇల్లు రెడీ అన్నమాట. అప్పుడు ఎంచక్కా మా ఇల్లు అడవిలా ఉంటుంది అని చెప్పుకోవచ్చు!