హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మలాజిగిరి జిల్లాలోని సూరారం గ్రామంలో సర్వే నంబర్ 105లో రెండు ప్లాట్లను స్వాధీనం చేసుకొని అకడ ఏర్పాటుచేసిన బహిరంగ నోటీసును 48 గంటల్లోగా తొలగించాలన్న ఉత్తర్వులను అమలుచేయని హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తొందరపాటు చర్యలు ఎందుకు తీసుకుంటున్నారని మండిపడింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలైన ధికరణ పిటిషన్‌పై విచారణను ముగించింది. విచారణ సందర్భంగా మంగళవారం.. హైడ్రా కమిషనర్ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రధాన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు మే 6న ఇచ్చిన ఉత్తర్వుల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా విచారణకు హాజరుకాకపోవడమే కాకుండా మినహాయింపు కోరుతూ కనీసం అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసింది.
తమ ఆదేశాలను గడువులోగా అమలు చేయకపోవడంపై హైడ్రా కమిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్ అసమగ్రంగా ఉందని ఆక్షేపించింది. కనీస పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ తప్పుపట్టారు. విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా హాజరు కాలేకపోవడానికి కారణాలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందుకోసం మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం హైడ్రా కమిషనర్ తరపు న్యాయవాది అఫిడవిట్ దాఖలు చేశారు. నోటీసును తొలగించాలంటూ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను అమలు చేసినట్టు అందులో పేరొన్నారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది జీ విద్యాసాగర్‌రావు స్పందిస్తూ.. హైకోర్టు ఆదేశాలను నిర్దేశించిన కాలంలోగా ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వలేదని చెప్పారు.
సరైన కారణం చెప్పలేదని, కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదని, దీనినిబట్టి కోర్టు ఉత్తర్వుల పట్ల హైడ్రా కమిషనర్ రంగనాథ్ వైఖరి ఏమిటో స్పష్టం అవుతున్నదని అన్నారు. వాదనలపై స్పందించిన హైకోర్టు.. అసమగ్రంగా ఉన్న అఫిడవిట్‌ను ఈసారికి మాత్రమే అనుమతిస్తున్నామని పేర్కొంది. ఇదే తీరు భవిష్యత్తులో కొనసాగితే ఉపేక్షించబోమని హెచ్చరించింది. కోర్టులకు సాయం చేయడానికి అఫిడవిట్లు దాఖలు చేస్తున్నామని భావించవద్దని తేల్చిచెప్పింది. బోర్డులు ఏర్పాటుచేసి జనాన్ని ఎందుకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని నిలదీసింది. భూములు అకడే ఉంటాయి. కదా, పిటిషనర్లు కూడాఎకడికీ వెళ్లిపోరు కదా, కోర్టులో వివాదం తేలేదాకా ఎందుకు ఓపిక పట్టలేకపోతున్నారని ప్రశ్నించింది. కొంత ఆలస్యంగానైనా కోర్టు ఉత్తర్వులను అమలు చేసిన కారణంగా ధికరణ పిటిషన్లపై విచారణను మూసేస్తున్నట్టు వెల్లడించింది.