న్యూఢిల్లీ : మానవ శరీరంలో అత్యంత కీలక అవయవమైన గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ కనబరచాలి. గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. హృదయాన్ని పదిలంగా ఉంచుకునేందుకు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవాలి.
గుండె ఆరోగ్యానికి ముఖ్యంగా బాదం, వాల్నట్స్ వంటివి నిత్యం తీసుకోవాలి. వాల్నట్స్లో ఉండే ఒమెగా-3 గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బాదం కూడా కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడంలో ఉపకరిస్తాయి. ఇక రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. వీటిలో ఉండే అత్యావశ్యక విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఇక నిత్యం వ్యాయామం చేయడం ద్వారా శారీరకంగా చురుకుగా ఉండేలా చూసుకోవాలి. హృద్రోగాలకు దూరంగా ఉండాలంటే బరువు పెరగకుండా నియంత్రించాలి. స్ధూలకాయంతో మధుమేహం, హృద్రోగాలు, ఇతర అనారోగ్యాల ముప్పు పొంచి ఉన్నందున బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. ఈ జాగ్రత్తలతో పాటు ఒత్తిడికి లోనవకుండా, కంటినిండా కునుకుతీయడం వంటి ఆరోగ్యకర జీవనశైలిని అలవరుచుకోవాలి.