Papaya | గ్రామాల్లో ప్రతీ ఇంటిలో పొప్పడి చెట్లను మనం చూస్తుంటాం. సిటీల్లోనూ అక్కడక్కడ దర్శనిమిస్తుంటాయి. బొప్పాయిగా కూడా పిలుచుకునే పొప్పడి పండు, ఆకులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఫాస్ఫరస్, కాపర్, పొటాషియం, ఐరన్, కేల్షియం, మ్యాంగనీజ్ మరియు మెగ్నీషియం వంటి పోషకాలు లభించే బొప్పాయిని నిత్యం డైట్లో భాగం చేసుకోవడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకుందాం.
బొప్పాయిలో ఫైబర్ సమృద్దిగా దొరుకుతుంది. విటమిన్ ఏ, బయో ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా లభిస్తాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటి ద్వారా వచ్చే చక్కెరను శరీరం సులభంగా గ్రహించడమే కాకుండా తక్షణ శక్తిని అందిస్తుంది. భోజనం చేశాక బొప్పాయి పండు తింటే ఆహారం సులభంగా జీర్ణమవుతుందని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు.
గొప్ప రోగనిరోధక శక్తి బూస్టర్
బొప్పాయి పండు గుజ్జులో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు తద్వారా ఇన్ఫెక్షన్స్ వృద్ధిని అరికట్టేందుకు తోడ్పడతాయి. బొప్పాయిని తరచూ తీసుకోవడం వలన జలుబు, ఫ్లూ, ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను కలిగించే బాక్టీరియా, వైరస్ల నుంచి రక్షణ పొందవచ్చు. బొప్పాయి ముక్కలను తినే ముందు కొంత నిమ్మరసం జోడించడం వలన మరింత రుచిని పొందవచ్చు. దీని ద్వారా అదనంగా సీ విటమిన్‌ను పొందవచ్చు.
వాపులను తగ్గించడంలో..
బొప్పాయిలో పపైన్, కైమోపపైన్ అనే ఎంజైమ్స్.. యాంటీ ఇంఫ్లేమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఇవి దీర్ఘకాల వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ ఎంజైమ్స్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఎడిమా వంటి ఇన్ఫ్లమేషన్లను తగ్గించడంతో తోడ్పడతాయి. మంటను తగ్గించడంలో వైద్య ప్రక్రియను వేగవంతం చేయడంలో సహకరిస్తుంది. ముఖ్యంగా కాలిన గాయాలు, గాట్లకు మంచి మందుగా పనిచేస్తుంది. బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, విటమిన్ సీ ఉండటం వల్ల అనారోగ్యాల వల్ల వచ్చే నొప్పులు, మంటలను తగ్గించడంలో సహాయపడతాయి.
సంక్లిష్ట ప్రోటీన్ల విచ్ఛిన్నం..
ప్రోటీన్ అనేది మన ఆహారంలో అవసరమైన ముఖ్యమైన స్థూల పోషకం. మనం ఎంత ప్రోటీన్ తీసుకున్నా.. అది సరిగ్గా జీర్ణమై శోషించబడకపోతే దాని నుంచి శరీరం ఎలాంటి ప్రయోజనం పొందదు. బొప్పాయిలో ఉండే పాపైన్ అనే డైజెస్టివ్ ఎంజైమ్.. కాంప్లెక్స్ ప్రొటీన్లను పెప్టైడ్స్, అమైనో యాసిడ్లుగా పిలిచే చిన్న భాగాలుగా విభజించడంలో సహాయపడుతుంది. ఇది మాక్రోన్యూట్రియెంట్‌ను గ్రహించి జీర్ణం చేసే శరీరం సామర్థ్యాన్ని సులభతరం చేస్తుంది. తద్వారా అజీర్ణం, మలబద్ధకం, ఆసిడిటీని అనుభవించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బొప్పాయిని ముక్కలను అల్పాహారంగా లేదా మధ్యాహ్న భోజనం అనంతరం తినడం వల్ల శరీరం ప్రోటీన్ వినియోగాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.
ప్రేగు కదలికల నియంత్రణలో..
బొప్పాయిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కనీస మొత్తంలో క్యాలరీలను కలిగి ఉంటుంది. ఈ సూపర్‌ఫుడ్‌లో ఉండే యాంటీకాన్సర్ లక్షణాలు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఉబ్బరం, కడుపు నొప్పి, మలబద్ధకం నివారణకు సహాయపడే జీర్ణ ఎంజైమ్లతో లోడ్ అయి ఉంటుంది.
క్రమరహిత ఋతుస్రావం సమస్య..
బొప్పాయిలో మెగ్నీషియం, పొటాషియంతో పాటు విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి గర్భాశయ కండరాలను సంకోచింపజేయడంలో సహాయపడతాయి. బొప్పాయి ఈస్ట్రోజెన్ హార్మోన్ నియంత్రణలో గొప్పగా సహాయపడుతుంది. రుతుక్రమం సక్రమంగా జరిగేలా చేస్తుంది.
అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించడంలో..
పులియబెట్టిన బొప్పాయి పొడి అల్జీమర్స్ ప్రమాదాన్ని నివారిస్తుంది. ఆక్సీకరణ ఒత్తిడి ప్రభావాలపై ఇది పోరాడుతుంది. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల వృద్ధాప్యంలో మతిమరుపు సమస్యల నుంచి దూరం కావచ్చు. అలాగే దీనిలోని సీ విటమిన్ కంటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. వీటిలోని ఫైబర్, పొటాషియం, విటమిన్ కంటెంట్ గుండె వ్యాధులను అరికడుతుంది. వీటిలోని ఫైబ్రిన్ అనే పదార్థం రక్తం గడ్డకట్టకుండా చూస్తుంది. వీటిలోని విటమిన్ సీ, ఈ అనేవి కొలాజెన్ ప్రొడక్షన్‌ను పెంపొందించి చర్మాన్ని బిగుతుగా ఉంచుతుంది. అలాగే ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు రాకుండా అరికడతాయి.
బొప్పాయి పండు తియ్యగా ఉన్నప్పటికీ.. డయాబెటిస్‌ను కంట్రోల్ చేయడానికి గ్రేట్‌గా పనిచేస్తుంది. చివరగా, బొప్పాయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.