HDFC Home Loans | ఇండ్ల రుణాలు పిరం కాబోతున్నాయి. పెరిగిన ధరల ప్రభావం తగ్గించడానికి కేవలం నెల రోజుల టైంలో ఆర్బీఐ కీలక రెపోరేట్ 90 బేసిక్ పాయింట్లు పెంచేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కూడా తమ కీలక వడ్డీరేట్లు పెంచేస్తున్నాయి. ఆ బాటలోనే మార్టగేజ్ లెండర్.. హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) కూడా గురువారం తన రిటైల్ ప్రైం లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్) 50 బేసిక్ పాయింట్లు పెంచేసింది. శుక్రవారం నుంచి హెచ్డీఎఫ్సీ నిర్ణయం అమల్లోకి వచ్చేసింది.
తాజాగా పెరిగిన వడ్డీరేట్ల ప్రకారం హెచ్డీఎఫ్సీ ఇంటి రుణాలు 7.55 శాతం వడ్డీ రేటు నుంచి మొదలవుతాయి. 800 పాయింట్లకు పైగా క్రెడిట్ స్కోర్ గల రుణ గ్రహీత స్పెషల్ హౌసింగ్ లోన్ స్కీం కింద 7.55 శాతం వడ్డీపై రుణం పొందొచ్చు. నెలలో హెచ్డీఎఫ్సీ ఇంటి రుణ వడ్డీరేట్లు పెరగడం ఇది నాలుగోసారి. తొలిసారి గత నెల రెండో తేదీన ఐదు బేసిక్ పాయింట్లు, 9న 30 బేసిక్ పాయింట్లు, ఈ నెల ఒకటో తేదీన ఐదు బేసిక్ పాయింట్లు పెంచేసింది.
రూ.30 లక్షల వరకు ఇండ్ల రుణం తీసుకున్న వారికి కనిష్ఠంగా 7.70 శాతం వడ్డీరేటు వర్తింప చేస్తారు. రూ.30 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు 7.95 శాతం వడ్డీ అమలవుతుంది. రూ.75 లక్షల పై చిలుకు రుణంపై 8.05 శాతం వడ్డీరేటు అమలు చేస్తున్నది హెచ్డీఎఫ్సీ. అయితే, మహిళా రుణ గ్రహీతలకు 0.05 శాతం వడ్డీ డిస్కౌంట్ లభిస్తుంది. ఒకసారి ఆయా రుణాలపై వడ్డీరేట్లు.. పెరిగిన ఈఎంఐ భారం. తెలుసుకుందాం..
రుణం మొత్తం: రూ.30 లక్షలు
గడువు: 20 ఏండ్లు
పాత వడ్డీరేటు: 7.20 శాతం
పాత ఈఎంఐ – రూ.23,620
నూతన వడ్డీరేటు – 7.70శాతం
నూతన ఈఎంఐ – రూ.24,536
ఈఎంఐలో పెరిగిన మొత్తం – రూ. 916
రుణం మొత్తం: రూ.50 లక్షలు
గడువు: 20 ఏండ్లు
పాత వడ్డీరేటు: 7.45 శాతం
పాత ఈఎంఐ – రూ.40,127
నూతన వడ్డీరేటు – 7.95 శాతం
నూతన ఈఎంఐ – రూ.41,667
ఈఎంఐలో పెరిగిన మొత్తం – రూ. 1540
రుణం మొత్తం: రూ.80 లక్షలు
గడువు: 20 ఏండ్లు
పాత వడ్డీరేటు: 7.55 శాతం
పాత ఈఎంఐ – రూ.64,692
నూతన వడ్డీరేటు – 8.05 శాతం
నూతన ఈఎంఐ – రూ.67,164
ఈఎంఐలో పెరిగిన మొత్తం – రూ. 2472