Home Loans | మీరు సొంతింటి కోసం రుణం తీసుకుంటున్నారా.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు వడ్డీరేట్లు పెంచేస్తున్నాయి. ఇప్పటికే భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) 10 బేసిక్ పాయింట్ల ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్) పెంచేసింది. హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (హెచ్డీఎఫ్సీ) తాజాగా ఐదు బేసిక్ పాయింట్లు రిటైల్ ప్రైమ్ లెండింగ్ రేట్ (ఆర్పీఎల్ఆర్) పెంచుతున్నట్లు ఆదివారం ప్రకటించింది.
తక్షణం వడ్డీరేట్ల పెంపు అమల్లోకి వస్తుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. దీని ప్రకారం హెచ్డీఎఫ్సీ హోమ్ లోన్లపై వడ్డీరేట్లు ఆర్పీఎల్ఆర్కు అనుగుణంగా సర్దుబాటు చేస్తారు. అయినప్పటికీ సిబిల్ (క్రెడిట్) స్కోర్ 750 పాయింట్లపై చిలుకు ఉన్న కస్టమర్లకు 6.70 శాతం వడ్డీరేటుపై హెచ్డీఎఫ్సీ ఇంటి రుణాలు మంజూరు చేస్తుంది.
రూ.30 లక్షల్లోపు రుణాలపై 6.80 శాతం, రూ.30-75 లక్షల్లోపు రుణాలపై 7.05 శాతం, రూ.75 లక్షలకు పైగా రుణాలపై 7.15 శాతం వడ్డీరేటు విధించనున్నది. అన్ని సెగ్మెంట్లలో మహిళా కస్టమర్లకు ఐదు బేసిక్ పాయింట్లు వడ్డీరేటు రాయితీ కల్పిస్తుంది. ఎస్బీఐ గత నెల 15 నుంచి 10 పాయింట్ల ఎంసీఎల్ఆర్, యాక్సిస్ బ్యాంక్ ఐదు బేసిక్ పాయింట్లు, కొటక్ మహీంద్రా బ్యాంక్ ఐదు నుంచి 7.4, బ్యాంక్ ఆఫ్ బరోడా ఐదు బేసిక్ పాయింట్లు ఎంసీఎల్ఆర్ పెంచేశాయి.