HDFC Mergers HDFC Bank | దేశీయ కార్పొరేట్ రంగంలో సంచలనం చోటు చేసుకుంది. ఇటు ఆర్థిక రంగం.. అటు గృహ రుణ పరపతి సేవలందిస్తున్న రెండు కార్పొరేట్ సంస్థలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ (హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్) విలీనం కానున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం కానున్నది. ఇది దేశీయ ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. ఈ రెండు సంస్థల విలీనానికి 15-18 నెలలు పడుతుందని మీడియాకు చెప్పారు. రెండు సంస్థల విలీనానికి ఆయా సంస్థల బోర్డులు సోమవారం ఆమోదం తెలిపాయి.
తమ సంస్థల విలీనానికి నియంత్రణ సంస్థల నుంచి సాధ్యమైనంత త్వరగా ఆమోదం లభిస్తుందని దీపక్ పరేఖ్ ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో కలిసి దీపక్ పరేఖ్ మీడియాతో మాట్లాడారు. తమ సంస్థల విలీనానికి ఆర్బీఐతోపాటు బీమా నియంత్రణ అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ), కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), సెబీ ఆమోదం లభించాల్సి ఉందన్నారు.
విలీన ఒప్పందం ప్రకారం హెచ్డీఎఫ్సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీకి 41 శాతం వాటా లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీలోని ప్రతి 25 షేర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో 42 షేర్లు కేటాయిస్తారు. ఈ ఒప్పందం ప్రకారం హెచ్డీఎఫ్సీ ఇన్వెస్ట్మెంట్స్, హెచ్డీఎఫ్సీ హోల్డింగ్స్ సంస్థలు కూడా హెచ్డీఎఫ్సీ బ్యాంకులో విలీనం అవుతాయి.
తమ బ్యాంకులో హెచ్డీఎఫ్సీ విలీనం నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ లైఫ్ సంస్థలో తమ వాటా ఎంచుకోవడంలో రెండు ఆప్షన్లను ఎంచుకునేందుకు అనుమతించాలని ఆర్బీఐని హెచ్డీఎఫ్సీ బ్యాంకు కోరింది. హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో 47.82 శాతం వాటా కలిగి ఉండటానికి గానీ, మార్కెట్ ద్వారా అదనపు వాటా కొనుగోలు చేయడానికి గానీ అనుమతించాలని అభ్యర్థించింది. ఏదైనా బ్యాంకు తమ అనుబంధ బీమా సంస్థలో 50 శాతానికి ఎక్కువ గానీ, 30 శాతం వాటా కానీ కలిగి ఉండాల్సి ఉంటుందని ఆర్బీఐ నిబంధనలు చెబుతున్నాయి.
ఇప్పటి వరకు హెచ్డీఎఫ్సీ మొత్తం ఆస్తుల విలువ రూ.6.23 లక్షల కోట్లు. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఆస్తులు రూ.19.38 లక్షల కోట్లు. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు 6.8 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు 3000 నగరాలు, పట్టణాల్లో 6,342 శాఖలు పని చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ విలీనం వల్ల బ్యాంకు రుణ పరపతి సౌకర్యం పెరుగనున్నది.