Home Loans Costly | దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్జినల్ కాస్ట్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్) పెంచేసింది. అన్ని టెన్యూర్ల రుణాలపై ఎంసీఎల్ఆర్ 35 బేసిక్ పాయింట్లు పెంచుతున్నట్లు మంగళవారం ప్రకటించింది. మరోదఫా ఆర్బీఐ కీలక రెపోరేట్ పెంచనున్నదని వస్తున్న వార్తల నేపథ్యంలో ఎంసీఎల్ఆర్ పెంపు నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. నెల రోజుల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఎంసీఎల్ఆర్ పెంచడం ఇది రెండోసారి. గత నెల ఏడో తేదీన తొలిసారి 25 బేసిక్ పాయింట్లు ఎంసీఎల్ఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిర్ణయంతో హౌసింగ్, వెహికల్, పర్సనల్, ఇతర రుణాలు మరింత పిరం కానున్నాయి.
ఓవర్నైట్ ఎంసీఎల్ఆర్ 7.15 శాతం నుంచి 7.50 శాతం.
నెల రోజుల టెన్యూర్ రుణాలపై 7.55 శాతం.
మూడు నెలల టెన్యూర్ రుణాలపై 7.60 శాతం.
ఆరు నెలల టెన్యూర్ రుణాలపై 7.70 శాతం.
ఏడాది టెన్యూర్ రుణాలపై 7.85 శాతం.
రెండేండ్ల టెన్యూర్ రుణాలపై 7.95 శాతం
మూడేండ్ల టెన్యూర్ రుణాలపై 8.05 శాతం.
మీ రుణాల టెన్యూర్ రీసెట్ చేస్తున్నప్పుడు వడ్డీరేటు పెరిగిపోతుంది. ప్రత్యేకించి ఇండ్ల రుణ గ్రహీతల నెలసరి వాయిదా (ఈఎంఐ) పెరుగుతుంది. ఎంసీఎల్ఆర్కు ఆధారంగా ఇంటి రుణంపై వడ్డీరేటు పెరుగుతుంది. సాధారణంగా బ్యాంకులు ఇండ్ల రుణాలపై ఎంసీఎల్ఆర్ను లింక్ చేస్తాయి. ఉదాహరణకు మీ హోంలోన్ రీసెట్ తేదీ ఆగస్టులో వస్తే ఆగస్టు నుంచి మీ ఇంటి రుణంపై వడ్డీరేటు పెరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. కెనరా బ్యాంకు తాజాగా ఎంసీఎల్ఆర్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఆరు నెలలు, ఏడాది టెన్యూర్ రుణాలపై వడ్డీరేట్లు మారిపోతాయి. ఆరు నెలల టెన్యూర్ రుణాలపై 7.30 నుంచి 7.35 శాతానికి, ఏడాది టెన్యూర్ రుణాలపై వడ్డీరేటు 7.35 నుంచి 7.40 శాతానికి పెరుగుతుంది.