టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తన పీక్ ఫామ్‌లో ఉన్నాడు. అటు బంతితో, ఇటు బ్యాటుతో చెలరేగి జట్టుకు అవసరమైన విజయాలు అందిస్తున్నాడు. అతని ఆటతీరు చూస్తుంటే ఆ ఫీలింగే వేరని, అతను అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని ఆస్ట్రేలియా లెజెండ్ షేన్ వాట్సన్ చెప్పాడు.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఆడేందుకు భారత్ వచ్చిన ఈ 41 ఏళ్ల మాజీ ఆసీస్ ఆల్‌రౌండర్.. ఫాస్ట బౌలింగ్ ఆల్‌రౌండర్ పాండ్యాపై ప్రశంసల వర్షం కురిపించాడు. పాండ్యా ఫామ్ చూసిన చాలా మంది అతన్ని ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌తో పోలుస్తున్నారు. దీనిపై కూడా వాట్సన్ స్పందించాడు. ప్రస్తుతం పాండ్యా అత్యుత్తమంగా ఆడుతున్నాడని, టీ20 క్రికెట్ అంత వరకు తీసుకుంటే మాత్రం.. స్టోక్స్ కన్నా పాండ్యా చాలా మెరుగైన స్థాయిలో ఉన్నాడని తేల్చిచెప్పాడు.
కొంతకాలం క్రితం గాయం కారణంగా బౌలింగ్‌కు దూరమైన పాండ్యా.. విశ్రాంతి తీసుకొని పునరాగమనంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా కూడా ప్రతిభ కనబరిచి తన జట్టుకు ట్రోఫీ అందించాడు. ఈ క్రమంలోనే మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేశాడు. అంతేకాదు, ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో జట్టుకు నాయకత్వం వహించి, జట్టును గెలిపించాడు కూడా.