వాషింగ్టన్, మే 17: పెండింగ్‌లో ఉన్న గ్రీన్ కార్డు దరఖాస్తుల అనుమతి ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేసేలా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు సిఫారసు చేయాలని ఆయన సలహా కమిషన్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని బైడెన్ ఆమోదిస్తే వేలాది మంది ఇండో అమెరికన్లకు లబ్ధి చేకూరనున్నది. భారత్ నుంచి హెచ్1 బీ వీసా మీద వెళ్లిన వేలాది మంది టెకీలు అమెరికాలో శాశ్వత పౌరసత్వం కోసం గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకొన్నారు.
దశాబ్దాలుగా ఈ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. గ్రీన్ కార్డు జారీ ప్రక్రియలో సంక్లిష్టత, ఒక దేశం నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ఏడు శాతం మందికి మాత్రమే గ్రీన్ కార్డులు ఇవ్వాలన్న నిబంధనే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియను పునఃసమీక్షించుకోవాల్సిందిగా కమిషన్ యూఎస్సీఐఎస్కు సూచించింది.