e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్‌ సెంటర్లు: ఈటల

జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్‌ సెంటర్లు: ఈటల


హైదరాబాద్‌, మార్చి 25, (నమస్తే తెలంగాణ): జబ్బులను ఆదిలోనే గుర్తించేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఈ కేంద్రాల్లో 60 రకాల పరీక్షలు చేయనున్నామని చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌, సిద్దిపేటలోఅందుబాటులో ఉన్నాయని, నారాయణగూడలో రూ.12 కోట్లతో అధునాతన ల్యాబ్‌ ఏర్పాటుచేశామని, ఏప్రిల్‌ నాటికి 18 సెంటర్లు ప్రారంభమవుతాయన్నారు.

శిక్షణ కేంద్రాలుగా రైతు వేదికలు: నిరంజన్‌రెడ్డి
వ్యవసాయం, అనుబంధశాఖల ద్వారా ఆధునిక వ్యవసాయ సమాచారం, అవగాహన కల్పించేందుకు, నైపుణ్య శిక్షణ కేంద్రాలుగా రైతు వేదికలు ఉపయోగపడుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 2,596 రైతు వేదికలను నిర్మించామన్నారు. పలువురు ప్రజాప్రతినిధులు రైతు వేదికల నిర్మాణానికి సహకారం అందించారని వివరించారు. నర్సంపేటలో మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని తెలిపారు.

24,543 గ్రామాలకు భగీరథ నీళ్లు: ఎర్రబెల్లి
మిషన్‌ భగీరథ పథకం కింద రాష్ట్రంలో 24,543 గ్రామాలకు తాగునీరందుతున్నదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. 74 ఆదివాసీ శివారు గ్రామాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌ నుంచి వలసవచ్చిన ఆదివాసీ గ్రామాలకు కూడా ఈ పథకం కింద నీరందిస్తున్నట్టు చెప్పారు. మిషన్‌ భగీరథకు సీఎం కేసీఆరే ఇంజినీర్‌అని, ఈ పథకానికి కేంద్రం ఎన్నో అవార్డులు ఇచ్చిందని.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.

పోడు భూములపై కమిటీ లేదు: సత్యవతి
పోడు భూముల వ్యవహారాలపై ప్రభుత్వం ఎలాంటి కమిటీలను వేయలేదని మంత్రి సత్యవతి రాథోడ్‌ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ అంశంలో స్వయంగా హామీఇచ్చారని తెలిపారు. సమస్య అతి త్వరలోనే పరిష్కారమవుతుందని పేర్కొన్నారు.

‘పవర్‌’ఫుల్‌గా తయారయ్యాం: జగదీశ్‌రెడ్డి
స్వరాష్ట్రంలో విద్యుత్తు రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ వీటి ఫలాలు చేరాయని చెప్పారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 2,071 యూనిట్లుగా ఉండగా.. అదేసమయంలో దేశ సగటు 1,208 యూనిట్లుగా ఉన్నదని తెలిపారు. జాతీయ సగటుతో పోల్చితే రాష్ట్రంలో వినియోగం 71 శాతం ఎక్కువని చెప్పారు. తెలంగాణలో పీక్‌ డిమాండ్‌ 13,562 మెగావాట్లు అని, సమైక్య రాష్ట్రంలో 23 జిల్లాలకు కలిపి ఇది 13,162 మెగావాట్లుగా మాత్రమే ఉండేదని చెప్పారు. ఇంత డిమాండ్‌లోనూ నాణ్యమైన, నిరంతర విద్యుత్తును అందిస్తున్నామని చెప్పారు. 17 వేల మెగావాట్ల డిమాండ్‌ వచ్చినా సరఫరా చేయగలిగేలా ఏర్పాట్లు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇండ్లమీది నుంచి వెళ్లే వైర్లను తొలగించడంపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

డిగ్రీ కళాశాలల బలోపేతం: సబితా ఇంద్రారెడ్డి
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధనే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీల కళాలలను బలోపేతం చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 106 కళాశాలలకు సొంత భవనాలు ఉన్నాయని, మిగిలిన భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటిలో ఇప్పటికే 21 పూర్తయ్యాయని, మిగిలిన 12 వివిధ దశల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. షాద్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు వచ్చే విద్యాసంవత్సరం వరకు పూర్తి చేస్తామని తెలిపారు.

సీఎం కేసీఆర్‌ ప్రధాని కావాలి: మల్లారెడ్డి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరున్నరేండ్లలోనే తెలంగాణ రూపురేఖలను మార్చేశారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రం అన్నిరంగాల్లో అద్భుత ప్రగతి సాధిస్తున్నదని కొనియాడారు. సీఎం కేసీఆర్‌ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తద్వారా అన్ని రాష్ర్టా లు, అన్ని గ్రామాలు బాగుపడుతాయని విశ్వాసం వ్యక్తంచేశారు. ఆయన చరిత్ర సృష్టిస్తారని పేర్కొన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై జరిగిన చర్చలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. దేశంలోని 15 రాష్ర్టాలకు చెందిన కూలీలు ఉపాధి కోసం తెలంగాణకు వస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు చేపట్టిందని తెలిపారు. గ్యాస్‌ సిలిండర్‌ డెలివరీ బాయ్స్‌ కు, దుకాణాల్లో పనిచేసేవారికి కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు ఇప్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే భవన నిర్మాణ కార్మికులకు గుర్తింపుకార్డు అందిస్తామని, దీంతో వారికి సదుపాయాలు అందుతాయని పేర్కొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జిల్లా కేంద్రాల్లో డయాగ్నస్టిక్‌ సెంటర్లు: ఈటల

ట్రెండింగ్‌

Advertisement