లగాన్ సినిమాలో బ్రిటిష్ వాడు పన్ను పెంచితే రైతుల జీవితాలు అతలాకుతలం కావడం గురించి చూపించారు. లగాన్ అంటే పన్ను లేదా సుంకం అని అర్థం. అసలే అంతంత మాత్రం దిగుబడితో ఈడ్చుకువస్తున్న రైతుకు అది దెబ్బ మీద దెబ్బ లాంటిది. ఆ భారం తగ్గించుకొనేందుకు బ్రిటిష్ వాళ్లను వాళ్లకిష్టమైన ఆటలోనే.. అంటే క్రికెట్లో ఓడించినట్టు ఓ కల్పిత కథ అల్లారు. కానీ గోఖలే నిజంగానే బ్రిటిషర్ల గుట్టువిప్పారు.
క్రికెట్లాగే బ్రిటిష్ పాలకులకు ఇష్టమైన ఆట మరోటుండేది. అదే మెకాలే రూపొందించిన ప్రణాళిక ప్రకారం.. చదువుకున్న గుమాస్తాలను తయారు చేయడం. కానీ ఆ గుమాస్తా చదువులు చదువుకున్న కొందరు తర్వాతి కాలంలో తెలివి తెచ్చుకొని బ్రిటిష్ వాడిపై తిరగబడ్డారు. అలా ముందుకు వచ్చిన తొలితరం నాయకుల్లో గోపాలకృష్ణ గోఖలే ఒకరు. బ్రిటిష్ వాడు భారతీయులపై పన్ను వేయడమంటే పట్టపగలు బాజాప్తా దోచుకోవడం తప్ప మరోటి కాదు. 1905లో బ్రిటిష్ సర్కారు వసూలు చేస్తున్న పన్నుపై 1905లో జరిగిన కలకత్తా కాంగ్రెస్లో గోఖలే చెప్పిన లెక్కలు దేశాన్ని దిమ్మెర పోయేలా చేశాయి. అవన్నీ సర్కారు అధికారికంగా ఇచ్చిన లెక్కలే. అప్పటికి తెల్లదొరలు మనదేశంలో ఏటా 4.4 కోట్ల పౌండ్లు పన్ను రూపంలో వసూలు చేస్తున్నారు. అది ప్రస్తుత రూపాయి విలువలో చాలా చాలా పెద్ద మొత్తమే అవుతుంది. అందులో సగం బ్రిటిష్ సైన్యంపై ఖర్చు చేస్తున్నారు.
మూడోవంతు పెన్షన్లు, వడ్డీ వగైరాల పేరిట బ్రిటన్ కు తరలించుకుపోతున్నారు. భారత్లో పనిచేస్తున్న బ్రిటిష్ అధికారులకు 30 లక్షల పౌండ్లు జీతంగా చెల్లిస్తున్నారు. ఇందులో చాలావరకు నిధులు చివరకు బ్రిటన్ చేరేవే. కేవలం 70 లక్షల పౌండ్లు మాత్రమే యావత్తు భారత్ దేశంపై ఖర్చు పెడుతున్నారు. ఏడున్నర లక్షలు మాత్రమే చదువుపై ఖర్చు పెడుతున్నారు అని గోఖలే వెల్లడించారు. భారతీయులకు చదువు, నాగరికత నేర్పామని జబ్బలు చరుచుకునే బ్రిటిష్ పాలకుల ఘనత ఇదని గుట్టువిప్పారు.