Gold Rates | అమెరికా డాలర్ పతనం కావడంతో మంగళవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒకశాతం పెరిగింది. మంగళవారం ఉదయం బులియన్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.9 శాతం పెరిగి 1636.30 డాలర్లు పలికింది. 2020 ఏప్రిల్లో ఔన్స్ బంగారం ధర 1620.20 డాలర్లుగా నమోదైంది. దాదాపు రెండున్నరేండ్ల తర్వాత బంగారం ధర ఆ స్థాయికి చేరుకోవడం గమనార్హం. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 0.7 శాతం పెరిగి 1644.60 డాలర్ల వద్ద స్థిర పడింది.
బంగారం ధర పెరుగుదల తాత్కాలికమేనని ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ కమొడిటీ రీసెర్చ్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ వందనా భారతి చెప్పారు. పెట్టుబడులకు స్వర్గధామం అన్న పేరును బంగారం కోల్పోతున్నదన్నారు. మున్ముందు అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు పెంచితే బంగారం ధర మరింత తగ్గుతుందని వ్యాఖ్యానించారు.
గత మార్చిలో ఔన్స్ బంగారం ధర కీలక స్థాయిలో 2000 డాలర్లు పలికింది. ఇప్పుడు పుత్తడి ధరలు 20 శాతం తగ్గుముఖం పట్టడం గమనార్హం. స్పాట్ వెండి ఔన్స్ ధర 1.7 శాతం పెరిగి 18.65 డాలర్ల వద్ద నిలిచింది. ప్లాటినం 0.9 శాతం వృద్ధితో 859.53 డాలర్లు, పల్లాదియం ఔన్స్ ధర 0.4 శాతం తగ్గి 2037.91 డాలర్లకు చేరుకున్నది.