దసరాకు మూడు రోజుల ముందుగానే గట్టుప్పల్ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. తమ చిరకాల వాంఛ అయిన గట్టుప్పల్ మండల కల నెరవేరుతున్న వేళ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్న మహాత్మా గాంధీ జయంతి రోజునే గట్టుప్పల్ కేంద్రంగా నూతన మండల పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టడం విశేషం. ఆదివారం గట్టుప్పల్ నూతన మండల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. తాసీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత తెలుపుతూ మండల పరిధిలోని గ్రామాల నుంచి తరలివచ్చిన సుమారు 10 వేల మంది ప్రజలతో గట్టుప్పల్ జనసందోహాన్ని తలపించింది. బ్యాండ్ మేళాలు, డప్పు చప్పుళ్ల మధ్య కోలాటాలు, నృత్యాలు, బోనాలతో సందడిగా మారింది. జై టీఆర్ఎస్.. జై కేసీఆర్.. జై గట్టుప్పల్ నినాదాలు మార్మోగాయి.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్ 2(నమస్తే తెలంగాణ)/చండూరు : నల్లగొండ జిల్లాలో 32వ మండలంగా గట్టుప్పల్ ఆవిర్భవించింది. ఆదివారం కొత్త మండలం ఏర్పాటు కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ రెమా రాజేశ్వరి ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. అతిథులకు కొత్త మండల ప్రజలు ఘన స్వాగతం పలికారు. బోనాలు, కోలాటాలు, డప్పులు, బ్యాండు మేళాలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ ప్రజలు తమ గ్రామంలోకి వారిని తోల్కొని వచ్చారు. ముందుగా తాసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించి కొత్త తాసీల్దార్‌గా పులి సైదులుకు బాధ్యతలు అప్పగించారు. తర్వాత పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించగా అతిథుల సమక్షంలో ఎస్ఐగా ఉప్పు సురేశ్ బాధ్యతలు చేపట్టారు. కొత్త మండలాన్ని అభివృద్ధిపథంలో నడిపించాలని, ప్రజలకు పారదర్శకమైన పాలన అందించేందుకు కృషి చేయాలని సూచించారు. అనంతరం అక్కడి నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.
కృతజ్ఞత సభ సక్సెస్
కొత్త మండల ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కృతజ్ఞత సభను నిర్వహించారు. గట్టుప్పల్‌లోని చండూర్ రోడ్డులో నిర్వహించిన సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ముఖ్యంగా మహిళలు, యువకులు భారీగా తరలిరావడం విశేషం. కొత్త కార్యాలయాల నుంచి ర్యాలీగా సుమారు రెండు కిలోమీటర్ల మేర ప్రజలు నడిచి సభాస్థలికి చేరుకున్నారు. సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోగా ప్రజలు నేతల ప్రసంగాలను ఆసక్తిగా ఆలకించారు. అనంతరం సభకు వచ్చిన ప్రతి ఒక్కరికీ భోజన వసతి కల్పించారు. గట్టుప్పల్ మండలాన్ని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌కు పలుమార్లు చప్పట్లతో ప్రజలు ధన్యవాదాలు ప్రకటించారు. కృతజ్ఞత సభకు సూర్యాపేట జడ్పీ వైస్‌చైర్మన్ గోపగాని వెంకటనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గట్టుప్పల్ మండల సాధన సమితి కన్వీనర్ ఈడెం కైలాసం, స్థానిక ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ మాట్లాడారు. వీరితో పాటు నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పార్టీ ముఖ్యనేతలు వేదికపై ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా పలువురు మంత్రి జగదీశ్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
భారీ జన సందోహం
గట్టుప్పల్ మండల ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానికులతో పాటు మండల ప్రజలు పెద్ద సంఖ్యలో రాగా భారీ జనసందోహం నెలకొంది. ఉదయం పది గంటల వరకే చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. లచ్చమ్మగూడెం రోడ్డు వైపు నుంచి గ్రామ కూడలి మీదుగా చండూరు రోడ్డు వరకు వేలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలంతా ఓపెన్‌టాప్ జీప్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అగ్రభాగాన బ్యాండు మేళాలు, ఆ వెనకాలే డప్పు కళాకారుల నృత్యాలు, మహిళల కోలాటాలు, బోనాలతో ర్యాలీ ఆకట్టుకుంది. ఆరేండ్లుగా ఎదురుచూస్తున్న మండల కల నెరవేరుతున్న వేళ ర్యాలీలో పాల్గొనేందుకు స్థానికులు అమితాసక్తి కనబర్చారు. దారి పొడవునా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. జై టీఆర్ఎస్… జై కేసీఆర్… జై గట్టుప్పల్ నినాదాలు మారు మోగాయి.
సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి
పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం గట్టుప్పల్ మండలం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌కు కొత్త మండల ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, గట్టుప్పల్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇక నుంచి ఇక్కడే పాలన సాగుతుంది. కార్యాలయాలు అన్ని మండల కేంద్రంలోనే ఉండడం ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతగానో దోహద పడనుంది. విలీనగ్రామాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి పరిష్కారం కోసం కృషి చేస్తాను. ఈ ప్రాంత ప్రజలు సీఎం కేసీఆర్‌కు అండగా ఉండి ఆయన రుణం తీర్చుకోవాలి.