బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా సంచలన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న సినిమా ‘గంగూభాయ్ కంతియావాడి’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుని యూ ట్యూబ్ లో దూసుకుపోతుంది. మరోవైపు అలియా భట్ నటనకు కూడా మంచి మార్కులు పడుతున్నాయి. అద్భుతంగా ఉంది టీజర్ అంటూ ట్రిపుల్ ఆర్ యూనిట్ కూడా ప్రమోషన్ చేసింది. తమ సినిమా హీరోయిన్ అలియా నటిస్తున్న సినిమా కావడంతో వాళ్లు కూడా ప్రమోట్ చేసారు. ఈ చిత్రంలో అలియా భట్ వేశ్య పాత్రలో నటిస్తుంది. ముంబైలోని కామాతిపురాలో సెక్స్ వర్కర్ అయిన గంగూభాయ్ కతియావాడి జీవితకథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు సంజయ్ లీలా భన్సాలీ. తాజాగా ఈ సినిమాపై వివాదం చెలరేగుతుంది.
ఎంఎల్ఏ అమిన్ పటేల్ ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేసాడు. కామాతిపురాను తక్కువ చేసి చూపిస్తున్నట్లుగా.. అవమానించినట్లు ఈ సినిమాను రూపొందించారు అంటూ ఆయన ఆరోపించాడు. అక్కడి వాళ్ల పరువు తీసేలా ఈ సినిమా ఉందని మండిపడ్డాడు అమిన్ పటేల్. అక్కడ్నుంచి వచ్చిన మహిళలు ఇప్పుడు సైంటిస్టులు అయ్యారని.. కానీ సినిమాలో మాత్రం ఇప్పటికీ అది సెక్స్ వర్కర్స్ అడ్డా అన్నట్లు చూపించారని ఆయన ఆరోపించాడు. వెంటనే ఆ సినిమాను అడ్డుకోవాలని.. లేదంటే దారుణాలు జరుగుతాయని హెచ్చరించాడు అమిన్. అంతేకాదు ఈ సినిమా గురించి వెంటనే ప్రభుత్వం కూడా ఆలోచించాలని.. దీనిపై వాళ్లు చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని విజ్ఙప్తి చేసాడు. గతంలోనూ సంజయ్ లీలా భన్సాలీ సినిమాలపై వివాదాలు చెలరేగాయి. ప్రతీ సినిమా సెట్స్ పై ఉన్నపుడే కాంట్రవర్సీలోకి వెళ్తుంది. తాజాగా గంగూభాయ్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మరి దీని ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చూడాలి.