Gandhi Statue : మూసీ ప్రాజెక్టులో భాగంగా రూ.5,000 కోట్లతో నిర్మించ తలపెట్టిన గాంధీ విగ్రహం (Gandhi Statue) నిర్మాణానికి అవసరమైన భూ సేకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. భూ సేకరణపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో గత్యంతరం లేక రేవంత్ సర్కార్ తోకముడిచింది. రేపు బండ్లగుడా జాగిర్ వార్డ్ ఆఫీసులో జరగాల్సిన భూసేకరణ సమావేశాన్ని వాయిదా పడింది. అయితే.. ప్రజాగ్రహం దృష్ట్యా తాత్కాలికంగానే భూ సేకరణను ప్రభుత్వం వాయిదా వేసినట్టు సమాచారం.
బ్రేకింగ్ న్యూస్
తీవ్ర ప్రజా వ్యతిరేకత రావడంతో మూసీ ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించ తలపెట్టిన గాంధీ విగ్రహం కోసం భూసేకరణ విషయంలో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన రేవంత్ ప్రభుత్వం.
రేపు బండ్లగుడా జాగిర్ వార్డ్ ఆఫీసులో జరగాల్సిన భూసేకరణ సమావేశం తాత్కాలికంగా వాయిదా. https://t.co/IGlkjeIiRG
— Telugu Scribe (@TeluguScribe) February 20, 2026
మూసీ సుందరీకరణ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేయడాన్ని, వేలాదిమందిని నిరాశ్రయులను చేయడాన్ని ప్రతిపక్షాలు ఖండిస్తున్నాయి. ఇదిలా ఉండగానే రూ.5000 కోట్లతో మూసీ నది ఒడ్డున భారీ గాంధీ విగ్రహం పెట్టేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. అయితే.. ప్రజలు, ప్రజా సంఘాలు, పర్యావరణవేత్తలు, రాజకీయ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయినా సరే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో ముందుకే పోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారు.
అందుకని డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు కాకున్నా.. ఏషియన్ డెవలప్మెంట్ ప్రాజెక్టు రుణం మంజూరు చేయకున్నా హడావిడిగా గాంధీ విగ్రహం ఏర్పాటుకు రేవంత్ సిద్ధమవుతున్నారు. మూసీ నది ఒడ్డున రూ. 5000 కోట్లతో దేశంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం నిర్మాణానికి ఫిబ్రవరి నెలలోనే శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. గాంధీ విగ్రహం కోసం.. ఈసీ, మూసీ నదుల సంగమంలోని10 ఎకరాల భూసేకరణకు ఫిబ్రవరి 19 గురువారం తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం 3,279 ఎకరాలు, 10,017 ఇండ్లు, షాపులు సేకరించనున్నారు. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన భూమిలో మధు పార్క్ రిడ్జ్ అపార్టుమెంట్ కాంప్లెక్స్ ఉంది. ఇందులో నివసించే సుమారు 500 కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. అసలు ప్రజలకు ఏమాత్రం పనికిరాని ఒక విగ్రహం కోసం రూ.5,000 కోట్లతో రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేయడమే తప్పు. రెక్కల కష్టంతో అపార్ట్మెంట్ కొనుక్కున్న 500 కుటుంబాలను అధిష్టానం మెప్పుకోసం రేవంత్ రోడ్డున పడేయడం దుర్మార్గమైన చర్య.
రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలుకు, అభివృద్ధి పనులకు డబ్బులు లేవంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కృత్రిమ బీచ్, మిస్ వరల్డ్ పోటీలు, గ్లోబల్ సమ్మిట్ వంటి పనికిరాని పనులకు వందల వేల కోట్లు తగలేస్తుండడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైతుబంధు కోసం డబ్బు లేదంటున్న ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి గాంధీ విగ్రహం కోసం రూ.5000 కోట్లు తగలెయ్యడం అవసరమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.