సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ : క్యాన్సర్.. ప్రాణాంతక వ్యాధే. కానీ ముందే గుర్తించి సరైన చికిత్స అందిస్తే కోలుకోవచ్చు. అలా క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన ధీరులు ఎందరో ఉన్నారు. వారంతా క్యాన్సర్‌ను జయించినందుకు సంతోషంగా ఉన్నా.. అద్దంలో చూసుకున్నప్పుడు మాత్రం కాసింత బాధపడుతుంటారు. కారణం కీమోథెరఫీ కారణంగా వారు జుట్టును కోల్పోతారు. అలా జుట్టును కోల్పోయిన వారి ముఖాల్లో చిరునవ్వులు అందించడానికి హైదరాబాద్ హెయిర్ డొనేషన్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ సంస్థ ఓ యజ్ఞాన్ని ప్రారంభించింది. అదే కేశదానం.
క్యాన్సర్ బారిన పడిన చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వారి మోములో సంతోషం చూడటానికి విగ్గులను అందించాలని సంకల్పించారు. అందుకోసం ఒకే ఒక్క కాల్ చేస్తే చాలు… డోనర్స్ దగ్గరకు ఆ సంస్థ సభ్యులు వచ్చి జుట్టు తీసుకెళుతారు. అలా సేకరించిన కేశాలను విగ్గులుగా మలిచి అవసరమైన క్యాన్సర్ బాధితులకు ఉచితంగా అందిస్తారు. ఈ యజ్ఞానికి బీజం వేసిన మూల పురుషుడు పంజాగుట్టకు చెందిన హెయిర్ సెలూనిస్ట్ శివకుమార్. జుట్టు ఊడిపోయి చింతిస్తున్న క్యాన్సర్ పేషెంట్లకు ఆత్మీయ అతిథి. వారి కోసం ఎంత దూరమైనా వెళ్లే మంచి మనసున్న మనిషి. హైదరాబాద్ నుంచి మొదలైన కేశదానం ఉద్యమం దేశంలోని నలుమూలలకు చేరింది. మూడేండ్ల నుంచి కేశదాన ఉద్యమం నడిపిస్తున్న అతడు ఇప్పటి వరకు 145 మందికి విగ్గులు అందించాడు. ఫిబ్రవరి 4న అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కేశదాన డ్రైవ్ చేపట్టాడు. అందులో భాగంగా తమిళనాడు, కేరళ, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని అన్నీ జిల్లాలు పర్యటిస్తున్నాడు.
ఏడుగురి జుట్టు.. ఒక్క విగ్గు
ఒక్క విగ్గు తయారీకి ఏడుగురు మనుషులు జుట్టు ఇవ్వాల్సి ఉంటుంది. 7 పోనిటైర్లతో ఒక్క విగ్గు తయారవుతుంది. మార్కెట్లో ఒక్క విగ్గు పొందాలంటే రూ. 20 వేల నుంచి ఆపైమాటే. అట్లాంటి ఖరీదైన విగ్గులను కేవలం రూ. 4వేల ఖర్చుతో సొంతంగా భరించి ఉచితంగా అందిస్తున్నాడు శివ. తొలుత తన సెలూన్లో సేకరించిన జుట్టును ఇతర సంస్థలకు అందించేవాడు. ఆ తర్వాత క్యాన్సర్ పేషెంట్లను చూశాక సామాజిక సేవ చేయాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం ఇద్దరు విగ్ మేకర్స్‌ను నియమించుకున్నాడు. తనకు సెలూన్ ద్వారా వచ్చే ఆదాయంలో నుంచే వారికి జీతాలు ఇచ్చి.. సొంత ఖర్చులతో కేశదాతల వద్దకు వెళ్లి జుట్టును సేకరిస్తున్నాడు.
విద్యార్థులకు అవగాహన..
కేశదానం కోసం అనేక కళాశాలలు, పాఠశాలలకు వెళ్లి క్యాన్సర్ బాధితుల కష్టాలు.. కీమోథెరపీ ప్రభావం తదితర విషయాలపై ప్రసంగించి విద్యార్థుల్లో చైతన్యం నింపుతారు. వారి నుంచి కేశాలు సేకరించి విగ్గులుగా తయారు చేస్తాడు. వీరి సేవను గుర్తించి సినీ సెలబ్రెటీలు, సామాజిక సేవకులు, విద్యార్థులు, గృహిణీలు ఇలా అందరూ తమ కేశాలను అందించడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే నగరం నుంచి 70 మందికి పైగా తమ జుట్టును అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు రిజిస్ట్రేషన్ చేసుకోవడం విశేషం.
ఫోన్ చేస్తే ఇంటికే వస్తాం
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రతి నలుగురిలో ఒక్కరూ కేన్సర్ బారినపడుతున్నారు. మన దేశంలో ప్రతి ఏడాది పది లక్షల మంది బాధితులు ఉండగా, అందులో హైదరాబాద్ నుంచి పది వేల మంది ఉంటున్నారు. చికిత్సలో భాగంగా కీమోథెరపీ కారణంగా బాధితులు జుట్టును కోల్పోతున్నారు. జీవితాంతం జుట్టు రాదనే బాధతో నరకం చూస్తున్నారు. అలాంటి వారికి అండగా నిలవాలనేదే మా లక్ష్యం. అందుకోసం మేం జుట్టును సేకరించి విగ్గుగా తయారు చేసి ఉచితంగా అందిస్తున్నాం. మీరు కేశాలు దానం చేయాలనుకుంటే 9666406586 నెంబర్‌కు ఫోన్ చేస్తే చాలు.. మేమే మీ ఇంటికి వస్తాం.
-శివకుమార్, సెలూనిస్టు, హైదరాబాద్ హెయిర్ డొనేషన్స్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్ ఫౌండర్