న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అమెరికా ప్లేయర్ ఫ్రాన్సెస్ టియాఫో అదరగొట్టాడు. సొంతగడ్డపై సత్తాచాటుతూ టైటిల్ రేసులో ముందడుగు వేశాడు. రెండున్నర గంటల పాటు నువ్వానేనా అన్నట్లు హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో టియాఫో 7-6(3), 7-6(0), 6-4తో ఆండ్రీ రుబ్లెవ్(రష్యా)ను మట్టికరిపించాడు. తద్వారా యూఎస్ ఓపెన్‌లో అమెరికా ఆశలు నీరుగారకుండా టియాఫో అడ్డుకున్నాడు. ఇప్పటికే స్టార్ ప్లేయర్లు సెరెనా విలియమ్స్, కొకో గాఫ్ నిష్క్రమించిన వేళ టియాఫో..అమెరికాను టైటిల్ రేసులో నిలిపాడు. 2003లో ఆండీ ర్యాడిక్క తర్వాత యూఎస్ ఓపెన్ ట్రోఫీ అమెరికాకు అందని ద్రాక్షగానే మారిపోయింది.
అయిదు గంటలకుపైగా సాగిన మరో క్వార్టర్ఫైనల్లో మూడోసీడ్ కార్లోస్ అల్కారజ్ 6-3, 6-7(7), 6-7(0), 7-5, 6-3 స్కోరుతో జానిక్ సిన్నర్‌పై ఉత్కంఠ విజయాన్నందుకున్నాడు. సర్వీసులతో అదరగొడుతూ ఇరువురూ కొదమసింహాల్లా హోరాహోరీ పోరాడిన మ్యాచ్‌లో అల్కారజ్ బ్యాక్‌హ్యాండ్ షాట్లలో మెరుగైన ప్రదర్శనతో విజయాన్నందుకున్నాడు. .మహిళల విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ఇగా స్వియాటెక్, బెలారస్‌కు చెందిన అరినా సబలెంక సెమీస్ పోరుకు సిద్ధమయ్యారు.