సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసుకు రంగం సిద్ధమవుతున్నది. ఇప్పటికే ట్యాంక్‌బండ్ చుట్టూ ట్రాక్ నిర్మాణ పనులను హెచ్ఎండీఏ అధికారులు ముమ్మరం చేశారు. అయితే తాజాగా ఫ్యాన్జోన్, కమర్షియల్ యాక్టివిటీ, వీఐపీ లాంజ్, క్లబ్ వంటి ఏర్పాట్లు చేస్తున్నారు.
లండన్ నుంచి ఈనెల 27న భాగ్యనగరానికి వచ్చిన ఫార్ములా-ఈ బృందం తమ మూడు రోజుల పర్యటనలో ఏర్పాట్లను పరిశీలించింది. ట్రాక్ నిర్మిస్తున్న ట్యాంక్‌బండ్, ఐ మ్యాక్స్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో బుధవారం పర్యటించింది. దీనికి తోడు ఏంఏ &యూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌తో భేటీ తర్వాత ట్రాక్ అలైన్మెంట్, రేసు ఇతర ఏర్పాట్లపై పలు సూచనలు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ట్రాక్ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను అరవింద్‌కుమార్ ఆదేశించారు.