న్యూఢిల్లీ: న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ తన ఆత్మ కథ ‘బ్లాక్ అండ్ వైట్’లో సంచలన విషయాలు బయటపెట్టాడు. న్యూజిలాండ్ క్రికెట్లోనూ జాతి వివక్ష ఉందని బాంబ్ పేల్చిన టేలర్.. ఐపీఎల్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ యజమాని తనపై చేయి చేసుకున్నాడని పేర్కొన్నాడు.
2011 సీజన్లో పంజాబ్‌తో మ్యాచ్‌లో టేలర్ డకౌట్ కాగా.. ఆ రోజు రాత్రి హోటళ్లో మద్యం సేవిస్తూ రాయల్స్ ఓనర్ తన ముఖంపై నాలుగైదు సార్లు కొట్టాడని ఆత్మకథలో వెల్లడించాడు. ‘పంజాబ్‌తో మ్యాచ్‌లో 195 పరుగులు ఛేదించాల్సిన దశలో నేను ఖాతా తెరవకుండానే ఔటయ్యా.
ఆ రోజు రాత్రి బార్లో జట్టు యజమాని నాతో మాట్లాడుతూ.. “నువ్వు సున్నాలు చుట్టేందుకు నీకు మిలియన్ డాలర్లు ఇవ్వడం లేదు” అంటూ నాలుగైదు సార్లు ముఖంపై కొట్టాడు. ఆ సమయంలో అతడు నవ్వుతున్నా.. అది నాకు జోక్ చేసినట్లు అనిపించలేదు’ అని టేలర్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు.