Heart Disease Precautions | సరిహద్దులకు సైనికుడు ఎంతో, మనిషికి గుండె అంత! ఆ పిడికెడంత వ్యవస్థ మనల్ని అనేక అవస్థల నుంచి రక్షిస్తుంది. రెప్పపాటు సమయం కూడా విశ్రాంతి తీసుకోకుండా కంటికి రెప్పలా కాచుకుంటుంది. ఆ విశ్వసనీయ సేవకుడి మీద మరింత భారం వేయడం సరికాదు. అపసవ్య జీవనశైలితో, అనారోగ్యకర ఆహారంతో, అర్థంలేని ఆలోచనలతో గుండెను గండాల పాలు చేస్తున్నాం. గత ఏడాది, ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కోటి మంది గుండె సంబంధమైన వ్యాధులతో మరణించారు. వీరిలో 60 లక్షల మంది 30 నుంచి 70 ఏండ్ల వయసు వారే. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుంచి అయినా గుండెకు అండ ( Heart Health )గా నిలుద్దాం!
షూ పట్ల మరింత శ్రద్ధ
గుండె కనుక రక్తాన్ని సరిగ్గా సరఫరా చేయకపోతే, రక్తం పేరుకుపోయి వాపు లాంటి సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా పాదాలు, కాళ్లలో ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తాయి. అందువల్ల బిగుతుగా ఉండే షూ, సాక్స్ వేసుకోవద్దు.
రసాయనాలతో జాగ్రత్త
ఇండ్లలో నేలను తుడిచేందుకు వాడే ఉత్పత్తుల్లో పర్యావరణానికి హాని కలిగించేవే ఎక్కువ. గుండెపోటు, అధిక రక్త పోటుకు కారణమయ్యే హానికర రసాయనాలనూ ఇవి కలిగి ఉంటాయి. కాబట్టి వీలైతే ఇంటిని వైట్ వెనిగర్, నిమ్మకాయ, వంటసోడా, కార్న్‌స్టార్చ్ లాంటి వంటింటి పదార్థాలతో శుభ్రంచేస్తే మంచిది.
ఆధునిక పరికరాలతో..
ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న హృద్రోగాల్లో 40 శాతం భారత్‌లోనే ఉన్నాయి. శరీరానికి సరఫరా అయ్యే రక్తం, ఆక్సిజన్‌ను సక్రమంగా పంప్ చేయని బలహీనమైన గుండెలు మన దగ్గరే ఎక్కువన్నమాట. ఇలాంటివారు కాలర్‌బోన్ కింద అమర్చే ‘బారోస్టిమ్ నియో సిస్టమ్’ సాయంతో హృద్రోగ ప్రభావాన్ని తగ్గించుకొని జీవన నాణ్యతను పెంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఉప్పుతో ముప్పు
వయసు పెరిగే కొద్దీ రక్తపోటు పెరిగే ఆస్కారం ఉంది. కాబట్టి, అధిక రక్తపోటు లేనివారు కూడా ఉప్పు వాడకం తగ్గించాలి. దీని వల్ల ఒక్క రక్తపోటు మాత్రమే కాదు.. సోడియంను ఎక్కువగా వినియోగించడం వల్ల వచ్చే కిడ్నీ వ్యాధుల ముప్పునూ తగ్గించుకోవచ్చు.
ఒకే బిళ్ల.. అనేక ప్రయోజనాలు
టైప్-2 మధుమేహం ఉన్న వయోధికులు హృద్రోగాలతో మరణించే ఆస్కారం నాలుగు రెట్లు ఎక్కువని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించింది. కాబట్టి మధుమేహం ఉన్నవాళ్లు గుండెను కూడా సురక్షితంగా ఉంచే డయాబెటిస్ మందులను సూచించమని వైద్యులను అడగాలి. వీటివల్ల గుండెపోటు, పక్షవాతం, కిడ్నీ వ్యాధుల ముప్పు ఉండదు.
మితంగా విందులు
పని రోజుల్లో వేళ ప్రకారమే ఆహారం తీసుకుంటారు. అదే వారాంతాల్లో నిద్ర ఎక్కువ అవుతుంది.. ఆలస్యంగా తింటారు. మితి మీరి తినే అవకాశాలూ ఉన్నాయి. దీనివల్ల రక్తపోటు పెరగడం, నడుము పరిమాణం పెరగడం, బాడీ మాస్ ఇండెక్స్‌లో తేడాలు ఏర్పడతాయని.. కొలంబియా విశ్వవిద్యాలయ అధ్యయనంలో తేలింది. వీటి కారణంగా గుండె పనితీరు కూడా దెబ్బతింటుందట. అందువల్ల వారాంతాల్లో తిండి, నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
ముందస్తు ప్రసవాలు
నెదర్లాండ్స్‌లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. ముందస్తు ప్రసవం (37 వారాలకు ముందు) జరిగే అవకాశం ఉన్న మహిళలకు గుండె వ్యాధుల ముప్పు ఎక్కువ. వీరిలో ధమని దెబ్బతినే ఆస్కారం 38 శాతం అధికం. గుండెపోటు వచ్చే అవకాశం 71 శాతం. అంతేకాదు.. గుండె ఆరోగ్యానికి సహకరించే శరీర వ్యవస్థల నిర్వహణకు ఈస్ట్రోజెన్ అత్యవసరం. అయితే మహిళల్లో మెనోపాజ్ మొదలయ్యే సరికి ఈస్ట్రోజెన్ స్థాయులు గణనీయంగా పడిపోతాయి. దీనివల్ల హృద్రోగాలు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం లాంటివి వచ్చే ప్రమాదం ఉంది. నలభైలలోనే మెనోపాజ్ దశలోకి అడుగుపెట్టే మహిళలకైతే గుండెపోటు ముప్పు రెండు రెట్లు ఎక్కువ. కాబట్టి, మెనోపాజ్ దశలోకి ముందే అడుగుపెట్టే మహిళలు మరిన్ని పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.
పోషకాహారం
మంచి ఆహారంతోనే గుండె పరిపూర్ణ ఆరోగ్యం సాధ్యం. తాజా పళ్లు, కూరగాయలు, పాలిష్ ఎక్కువగా పట్టని ధాన్యాలు, పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవాలి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్, శాచురేటెడ్ కొవ్వులు ఉన్న ఆహారాన్ని తగ్గించుకోవాలి. యోగర్ట్, జీలకర్ర, పుట్టగొడుగులు, విటమిన్-సి ఇచ్చే పళ్లు, చాక్లెట్ల లాంటివి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
గట్టిపడనీయకండి
యాభై ఏండ్లు వచ్చేసరికి మనిషి గుండె కండరాలు గట్టిపడటం మొదలవుతుంది. దాంతో శరీరం అంతటికీ రక్తం సమర్థంగా సరఫరా చేయడం కష్టమైపోతుంది. దీనిని వైద్యపరంగా ‘డయాస్టోలిక్ డిస్ ఫంక్షన్’ అంటారు. అంటే గుండె కొట్టుకున్న ప్రతిసారీ కండరాలు రిలాక్స్ కాలేవన్నమాట. ఇక మహిళలకైతే హార్మోన్ల మార్పులతో పరిస్థితులు మరింత విషమిస్తాయి. క్రమం తప్పని వ్యాయామం, మంచి ఆహారం దీనికి పరిష్కారాలు. శ్వాస తగ్గడం, అలసట, గుండె కొట్టుకునే వేగం ఎక్కువ కావడం, తెరలు తెరలుగా గులాబీరంగు కఫంతో కూడిన దగ్గు, కాళ్లు, మడమలు, పాదాల్లో వాపు లాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుణ్ని సంప్రదించాలి.
కిటికీలను తెరిచే ఉంచండి
చాలా సందర్భాల్లో కార్ఖానాల కంటే ఇండ్లలోనే కాలుష్యం ఎక్కువ. హెయిర్ స్ప్రేలు, కొవ్వొత్తులు, నాన్‌స్టిక్ పాత్రల వేడి, పొగలు.. నాలుగు గోడల మధ్య గాలి కాలుష్యానికి కారణాలు అనేకం. దీనిని కొంతమేర భరించవచ్చు. ఎక్కువైతే మాత్రం కళ్లు మండుతాయి, రక్తపోటు పెరుగుతుంది, ధమనులు గట్టిపడతాయి. ఇవన్నీ ప్రమాద సంకేతాలే. కాబట్టి ఇంట్లో కిటికీలను తెరిచి ఉంచండి. గాలి ప్రసారానికి ఫ్యాన్ వేసుకోండి. అయితే ప్రయాణంలో మాత్రం, కారు అద్దాలను మూసే ఉంచండి. దీనివల్ల గాలిలోని కాలుష్య కారకాలను నిరోధించవచ్చు. గుండెను, ఊపిరితిత్తులను కాపాడుకోవచ్చు.
ప్రకృతి విపత్తులతో జాగ్రత్త
తుఫాన్లు, భూకంపాలు.. ప్రకృతి విపత్తు ఏదైనా కూడా ప్రజలను మానసికంగా, భావోద్వేగపరంగానే కాకుండా శారీరకంగా కూడా ఆందోళనకు గురిచేస్తుంది. 2005లో అమెరికాలో సంభవించిన హరికేన్ కత్రినాకు ముందుతో పోలిస్తే, ఆ తర్వాత గుండెపోట్లలో మూడురెట్ల పెరుగుదల నమోదైంది. దాంతోపాటే అధిక రక్తపోటు, ధమనికి సంబంధించిన వ్యాధులు, మధుమేహం ముప్పు పెరిగింది. ప్రకృతి విపత్తులను మనం అడ్డుకోలేం. కానీ, ఆ బీభత్సాన్ని తట్టుకునేంత బలంగా గుండెను తయారు చేసుకోవచ్చు.
క్రమబద్ధమైన నిద్ర
మంచి నిద్ర గుండె ఆరోగ్యానికి మంచిది. వయసు పెరిగే కొద్దీ మెదడు, న్యూరాన్లలో మార్పులు వస్తాయి. ఇది నిద్ర విషయంలోనూ ప్రభావం చూపుతుంది. అంటే నిద్రలో గాఢత లోపించడం, తరచూ మెలకువ రావడం తదితర చికాకుల వల్ల శారీరక విశ్రాంతి లోపిస్తుంది. ఇంకా అనేకానేక కారణాలు తోడై ధమనులు బిగుసుకుపోతాయి. కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. కాబట్టి మధ్యాహ్నం కునుకు తీయకపోవడం, పడుకోవడానికి ఆరు గంటల ముందు వరకు కెఫెయిన్ ఉన్న పదార్థాలు సేవించకపోవడం, సెల్ ఫోన్‌ను పక్కన ఉంచేయడం.. సుఖనిద్రకు సోపానాలు. మంచి అత్తర్లు, పుస్తకం, సంగీతం.. నిద్రను ప్రేరేపిస్తాయి.
ప్లాస్టిక్ కంటెయినర్లు వద్దు
ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు, ఫుడ్ కంటెయినర్లలో బైస్ఫినాల్-ఎ (బీపీఏ), థాలేట్స్ లాంటి రసాయనాలు ఉంటాయి. ఇవి క్రమంగా డబ్బాల్లోని పదార్థాల్లో ఇంకిపోతాయి. గుండె కవాటాలకు సంబంధించిన వ్యాధులకు థాలేట్సే కారణమని వైద్య పరిశోధనలు పేర్కొన్నాయి. కాబట్టి గాజు, పింగాణి, స్టీలు పాత్రల్ని ఉపయోగించడమే మంచిది. వాడకం తప్పనిసరి అయినప్పుడు, ప్లాస్టిక్ డబ్బాలపై ఉన్న రీసైక్లింగ్ కోడ్‌ను పరిశీలించండి. థాలేట్లు లేని ప్లాస్టిక్ వస్తువులు వాడండి.
ఉగ్గబట్టుకోవద్దు
మూత్రాశయం నిండిపోవడానికి, గుండె వేగం పెరగడానికి ప్రత్యక్ష సంబంధం ఉంది. దీనివల్ల గుండె ధమనులపై ఒత్తిడి ఎక్కువై హఠాత్తుగా సంకోచిస్తాయి. బలహీనమైన గుండెకు.. గుండెపోటు ప్రమాదం అధికం.
శాకాహారులూ పారాహుషార్!
జంతు సంబంధమైన ఆహారంతో పోలిస్తే.. మొక్కల నుంచి లభించే ప్రొటీన్లు, కొవ్వులు తినడం వల్ల గుండె వ్యాధుల ముప్పు తక్కువన్నది వైద్యుల మాట. అయితే, శాకాహారమే ఇతర ఆహారాల కంటే అత్యుత్తమమని మాత్రం అనుకోకూడదు. మాంసం తినకపోయినా బాగా పాలిష్ పట్టిన ధాన్యాలు, రిఫైన్డ్ పిండి, స్టార్చ్ ఎక్కువగా ఉన్న పిండిపదార్థాలు, చక్కెర పానీయాలు, పాల పదార్థాలు కుంభాలకొద్దీ లాగిస్తే హృద్రోగాలు సహా వివిధ వ్యాధులను కొనితెచ్చుకున్నట్టే.
చురుకుదనం.. మంచితనం
ఒకే దగ్గర ఎక్కువసేపు అతుక్కుపోయేవారికి జీవక్రియలకు సంబంధించిన వ్యాధి (మెటబాలిక్ సిండ్రోమ్) వృద్ధిచెందే అవకాశం 73 శాతం ఎక్కువ. దీనివల్ల గుండె సంబంధమైన వ్యాధులూ రావచ్చు. ఏరోబిక్ వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి మంచివని వైద్యులు సలహా ఇస్తున్నారు. కాబట్టి బ్రిస్క్ వాకింగ్, రన్నింగ్, ఈత, సైక్లింగ్, టెన్నిస్, స్కిప్పింగ్ లాంటి వాటిని రోజుకు 30 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజులు చేస్తే మంచిది! ఇక డబ్బును దుబారాలకు ఖర్చు చేసేవారి కంటే దానధర్మాలకు వెచ్చించే వారిలోనే రక్తపోటు సమస్య తక్కువని ఒక అధ్యయనంలో తేలింది. అందువల్ల.. ఆస్తిపాస్తులను పెంచుకోవడం కంటే, నలుగురితో పంచుకోవడం మీదే దృష్టిపెట్టాలి. అనవసరమైన ఆరాటం.. జీవితాన్ని నరకప్రాయం చేస్తుంది.
ముందే మేలుకో..
పద్దెనిమిదేండ్లు నిండిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా అధిక రక్తపోటు (హైబీపీ) పరీక్ష చేయించుకోవాలి. వయోజనులైన భారతీయుల్లో.. ప్రతి ముగ్గురిలో ఒకరికి అధిక రక్తపోటు సమస్య ఉందని కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అధ్యయనం వెల్లడించింది. చాలా సందర్భాల్లో అధిక రక్తపోటు బాధితుల్లో పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఇదో నిశ్శబ్ద సునామీ! తగిన సమయంలో చికిత్స తీసుకోకపోతే అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్… హృద్రోగాలు, గుండెపోటు, రక్తనాళాల వాపునకు దారితీసే ప్రమాదం ఉంది.
ఒత్తిడికి దూరంగా
అధిక శాతం (దాదాపు 77 %) ఆరోగ్య సమస్యల విషయంలో ఒత్తిడిదే కీలకపాత్ర. మనిషి ఒక వయసుకు వచ్చేసరికి శరీరంలో మార్పులు మొదలవుతాయి. వ్యవస్థ ఒకప్పటిలా పనిచేయదు. కొత్త సమస్యలు తలెత్తుతాయి. ఒత్తిడికి తావులేని ఆరోగ్యకరమైన జీవన విధానం శరీరంపై సానుకూల ప్రభావం చూపుతుంది. వృద్ధాప్య లక్షణాలనూ అదుపు చేస్తుంది.
సరైన ఖనిజ లవణాలు
మనకు అవసరమైన ఖనిజ లవణాల్లో పొటాషియం, మెగ్నీషియం ప్రధానమైనవి. గుండెపోటు ముప్పును తగ్గించడంలో, కండరాలనూ కణజాలాన్నీ బలోపేతం చేయడంలో, రక్తపోటును నియంత్రించడంలో మెగ్నీషియం పాత్ర కీలకం. కాబట్టే, గుండె లయ తప్పినట్లు అనిపించగానే వైద్యులు శరీరంలో ఖనిజాల స్థాయిని పరీక్షిస్తారు.
ఎండలోకి వెళ్లండి
శరీరంలో విటమిన్-డి లోపానికి.. హృద్రోగాలు, క్యాన్సర్, మధుమేహం, ఊబకాయం తదితర
సమస్యలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. వయసు పెరిగే కొద్దీ ఈ వ్యాధులు ముమ్మరించే ప్రమాదం ఎక్కువ. కాబట్టి శరీరంలో విటమిన్-డి తయారీని ప్రేరేపించాలంటే.. నిత్యం సూర్యకాంతిలో గడపాలి. ఆహారం, విటమిన్ సప్లిమెంట్ల నుంచి కూడా విటమిన్-డి లభిస్తుంది.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Heart Health | గుండె కోసమైనా నవ్వండి!”
చిన్న వయసులోనే గుండెపోటు ఎందుకు వస్తుంది.. హార్ట్ స్ట్రోక్ రావడానికి ముందు ఏమవుతుంది?
“ఈ మూడు సమస్యలే గుండె జబ్బులకు ముఖ్య కారణాలట..!”
మీ గుండె పదికాలాలపాటు పదిలంగా ఉండాలంటే ఇవే మీ ఆహారంలో భాగం కావాలి..!!”
“షాకింగ్ న్యూస్ ! ఇతరులకు సాయం చేస్తే గుండెజబ్బులు రావు”
Heart Attack | హృద్రోగులకు గడ్డుకాలంగా శీతకాలం.. వ్యాయామం తప్పనిసరి”