వరంగల్, నవంబర్ 1 : పంజా విసిరిన మొంథా తుఫాన్‌కు తోడు అధికారుల నిర్లక్ష్యం గ్రేటర్ వరంగల్‌ను ముంచేసింది. రోజంతా కురిసిన వర్షంతో వచ్చిన వరద ప్రజల జీవితాల్లో అంతులేని వ్యథను మిగిల్చింది. నగరంలోని వందకు పైగా కాలనీలు నీట మునగగా.. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అనేక కాలనీలు ఇంకా నీటిలోనే మగ్గుతున్నాయి. సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలం కాగా.. అధికారులు కూడా తక్షణం సాయంగా ఏమీ చేయడం లేదు. నాలుగు రోజులైనా పలు కాలనీలను ఇంకా వరద వీడలేదు. ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించినా బాధితులకు ఎలాంటి భరోసా ఇవ్వలేదు. కనీసం వారిని ఆదుకుంటామన్న ప్రకటన కూడా చేయలేదు. ప్రకృతి ప్రకోపం.. అధికారుల పట్టింపులేనితనం ప్రజలను కోలుకోని విధంగా దెబ్బతీశాయి. ఈ పాపం ఎవరిదన్న ప్రశ్న సమాధానం దొరకనిదిగా మిగిలింది.
వరద బీభత్సంతో గ్రేటర్ వరంగల్‌లోని కాలనీల ప్రజ లు సర్వం కోల్పోయారు. కష్టపడి సంపాదించుకున్న వస్తువులు నీటి పాలయ్యాయి. టీవీ, ఫ్రిడ్జ్, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఇతర సామగ్రి నీటిలో మునిగి పాడైపోయాయి. నిత్యావసర సరుకులు, దుస్తులు వరద నీటిలో కొట్టుకుపోయి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కట్టుబట్టలు తప్ప ఏమీ మిగలలేదని బాధిత కుటుంబాలు భోరున విలపిస్తున్నాయి. కొన్ని కాలనీల్లో వంట చేసుకునే పరిస్థితులు కూడా లేవు. హంటర్‌రోడ్డులోని అనేక షాపుల్లోకి వరద నీరు చేరడంతో సరుకులు తడిసి లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రజలు పాడైపోయిన సరుకులను మున్సిపల్ చెత్త ట్రాక్టర్లో వేస్తున్నారు. తిండిగింజలతో సహా ఇంట్లో వస్తువులన్నీ వరద పాలైనా కాంగ్రెస్ సర్కార్ మాత్రం ఎ లాంటి సాయం చేయడం లేదు. తమ వద్దకు ఎవరూ రావ డం లేదని, అధికారులు కూడా పట్టించుకోవడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్భాటంగా ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి తమకు ఎలాంటి భరోసా ఇవ్వకపోవడంపై భగ్గుమంటున్నారు.
ముంపు కాలనీల్లో పారిశుధ్యం అస్తవ్యస్థంగా మారడంతో కంపు కొడుతున్నాయి. కాలనీల్లో గుట్టలు గుట్టలుగా చెత్త, రోడ్లపై బురద పేరుకుపోయి ప్రజలు ఇబ్బదులు పడుతున్నారు. వరదతో గడప దాటని ప్రజలు ప్రస్తుతం దుర్వాసన కారణంగా బయటకు రాలేకపోతున్నారు. రోగాల బారిన పడుతామేమోనన్న భయాందోళనకు గురవుతున్నారు. అయితే అధికార యంత్రాంగం కాలనీల్లో కాలనీల్లో ప్రత్యేక ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడంపై దృష్టి సారించడం లేదు. రామన్నపేట ప్రాంతంలో రెండు రోజుల పాటు వరద నీటిలో గడిపిన ఒక వృద్ధురాలు శనివారం మృతి చెందింది. ఇప్పటికైనా అధికారులు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
నగరంలోని అనేక కాలనీలు ఇంకా వరద నీటిలోనే మగ్గుతున్నాయి. వర్షం వదిలి మూడు రోజులైనా ఇంకా 20 వరకు కాలనీల్లో వరద తగ్గలేదు. వరంగల్ ప్రాంతంలోని బాలాజీనగర్ వంద ఫీట్ల రోడ్డులోని కాలనీలు, హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ నగర్, బృందావన్ కాలనీ, రామన్నపేట, శివనగర్, హనుమకొండలోని జవహర్‌కాలనీ, ద్వారకాసాయి కాలనీ, సదాశివ కాలనీ, మారుతి కాలనీ, అమరావతి తదితర అనేక కాలనీల్లోని ప్రజలు ఇంకా నీటిలోనే ఉన్నారు.
వరంగల్ చౌరస్తా : వాన మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు అరిగోస పడుతున్నం. ప్రతిసారి వచ్చి చూసిపోతున్నరే తప్ప వరద రాకుండా చేస్తలేరు. కడుపు నిండా అన్నంతిని, కంటి నిండా నిద్రపోయి నాలుగు రోజులైతాంది. ఇంట్లోని తిండి గింజల నుంచి సామాన్లు మొత్తం వరదలో కొట్టుకుపోయినయ్. కట్టుబట్టలతోనే బతుకుతున్నం. మొదటి రోజు రెండు పూటలు అన్నం పొట్లాలు పంచిపెట్టిండ్రు. మళ్లీ కంటికి కనిసిస్తలేరు. వాన పడుతాంది అంటే భయమైతాంది. ఎప్పుడు వరద వచ్చి మేం కొట్టుకుపోతమోనని భయం భయంగా బతుకుతున్నం. ఇప్పటికైనా మా గోస తీర్చాలి. సీఎం వచ్చిండు.. మునిగిన ఇండ్లను చూసిండు, పోయిండు. కనీసం మాట కూడా మాట్లాడలేదు.
– షమీమ, పోతననగర్, గృహిణి
తొర్రూరు : మేము రెండెకరాల్లో పత్తి, ఐదెకరాల్లో వరి పంట సాగు చేసినం. అప్పులు తెచ్చి పత్తిపై రూ. 70 వేలు, వరి పై రూ. 1.50 లక్షలు పెట్టుబడి పెట్టినం. చేతికొచ్చిన పంటను ఏరుకునే సమయంలో అకాల వర్షం మమ్మల్ని పూర్తిగా ముంచింది. పత్తిలో నీరు నిలిచి పంటంతా పాడైపోయింది. ఏరిన పత్తి కూడా తడిసి పనికిరాకుండా అయ్యిం ది. ఇప్పుడు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇంత నష్టం జరిగినా ఒక అధికారి కూడా మా దగ్గరకు వచ్చిన పాపాన పోలే దు. మా పరిస్థితిని అర్థం చేసుకొని ఎకరానికి కనీసం రూ. 25 వేలు నష్టపరిహారం కింద ప్రభుత్వం ఇవ్వాలి.
– గుగులోత్ లక్ష్మి, మహిళా రైతు, హచ్చుతండా, తొర్రూరు మండలం
హనుమకొండ చౌరస్తా : ఇళ్లు మొత్తం నీళ్లతో నిండి, రేషన్ బియ్యం, సామగ్రి మొత్తం కొట్టుకుపోయినయ్. మా ఇంట్లో ముగ్గురం ఉండేవాళ్లం. నా భర్త మంచానపడ్డాడు. ఇప్పటివరకు ఎవరూ వచ్చిందిలేదు. ఎలాంటి సాయం చేయలేదు. మా పకవాళ్లు ఇండ్లు విడిచివెళ్లిపోయిండ్రు. అర్ధరాత్రి ఒక్కసారిగా నీళ్లు వచ్చేసరికి భయమేసింది. దులాలను పట్టుకొని ఉన్నాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
– ఎండీ షమీమ, కాకతీయకాలనీ, హనుమకొండ
నర్సంపేట : నేను నాలుగెకరాల్లో వరి సాగు చేశా. భారీ వర్షాలకు పంటంతా నీటమునిగింది. వరికంకులు నీళ్లల్లోనే ఉన్నాయి. రెండెకరాల్లో వరిపంట చేతికి వస్తదనే ఆశ లేదు. ఇప్పటి వరకు ఎకరాకు రూ. 30 వేల చొప్పున పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం సాయం చేసి ఆదుకోవాలి.
– బానోత్ రమేశ్, బండమీదిమామిడితండా, ఖానాపురం మండలం