షేక్ నజియా..నయా ఫెన్సింగ్ స్టార్. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న ఫెన్సర్. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ఓనమాలు దిద్ది అంచలంచెలుగా ఎదుగుతూ ఫెన్సింగ్‌లో పతకాలు కొల్లగొడుతున్నది. అక్కను స్ఫూర్తిగా తీసుకుంటూ ఏడవ తరగతిలో ఫెన్సింగ్ కెరీర్ ఆరంభించిన నజియా ఇక వెనుదిరిగి చూసుకోలేదు. కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులు ఎదురైనా వెరవకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసింది. తన అద్భుత నైపుణ్యంతో ప్రత్యర్థులకు సవాలు విసురుతూ పతకాలు సాధిస్తున్నది. లండన్‌లో జరిగిన కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలతో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించింది. ఇపీ ఈవెంట్లో తనకు తిరుగులేదని నిరూపిస్తున్న నజియా..
భవిష్యత్‌లో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమంటున్నది.ఆర్టీసీ డ్రైవర్ కూతురైన ఈ నల్లగొండ అమ్మాయి..ప్రోత్సాహం అందిస్తే అద్భుత ఫలితాలు సాధిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నది. ఈ నేపథ్యంలో నజియాతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ
కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో పతకాలపై మీ స్పందన?
లండన్ వేదికగా జరిగిన కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో రెండు కాంస్య పతకాలు సాధించడం మరిచిపోలేని అనుభూతి. ప్రత్యర్థుల నుంచి దీటైన పోటీ ఎదురైనా ఒత్తిడికి లోనుకాకుండా ముందంజ వేశాను. ఇపీ ఈవెంట్లో భారత్ తరఫున రెండు పతకాలు ఖాతాలో వేసుకున్నాను. పోడియంపై పతకాన్ని ముద్దాడిన తర్వాత త్రివర్ణ పతాకంతో సంబురాలు చేసుకోవడం చిరకాలం గుర్తుండి పోతుంది. రానున్న టోర్నీల్లో రాణించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నాను. నా కెరీర్లో ఇది మూడో అంతర్జాతీయ పతకం.
ఫెన్సింగ్ ఎంచుకునేందుకు ఆదర్శం ఎవరు?
మిగతా క్రీడలతో పోల్చుకుంటే ఫెన్సింగ్ ఒకింత ఖరీదైన క్రీడ. మన దేశంలో ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతున్నది. టోక్యో ఒలింపిక్స్‌లో భవానీదేవి ప్రాతినిధ్యం తర్వాత దేశంలో ఫెన్సింగ్‌కు ఆదరణ పెరిగింది. అందుకు తగ్గట్లు ఈ మధ్య కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీలు బాగా జరుగుతున్నాయి. సరిగ్గా ఏడేండ్ల క్రితం నా సోదరి ఫౌజియాను స్ఫూర్తిగా తీసుకుని ఫెన్సింగ్ క్రీడను ఎంచుకున్నాను. ఆరేండ్ల నుంచి వివిధ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ పతకాలు సాధిస్తున్నాను.
భవిష్యత్ లక్ష్యాలు ఏంటీ?
కచ్చితంగా ఏదో ఒక రోజు ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకం అందించాలన్న పట్టుదలతో ఉన్నాను. 2024 పారిస్ ఒలింపిక్స్ నాటికి కాకపోయినా..2028 లాస్ ఏంజిల్స్ విశ్వక్రీడల్లో పతకం కొట్టాలన్న ఆకాంక్ష ఉంది. అందుకోసం ఇప్పటి నుంచే మెరుగైన ప్రదర్శనతో ముందుకు సాగుతున్నాను. సౌకర్యాల పరంగా మిగతా దేశాలతో పోల్చుకుంటే మన దగ్గర తక్కువగా ఉన్నా..అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఔరంగాబాద్ సాయ్ కేంద్రంలో తుకారామ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నాను. టోర్నీ టోర్నీకి మరింత మెరుగవుతూ సత్తాచాటుతాను.
కెరీర్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి?
ఆరేండ్ల క్రితం ఫెన్సింగ్ క్రీడను ఎంచుకున్న తొలినాళ్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. మొదట్లో టోర్నీలు ఆడే అవకాశం అంతగా రాలేదు. కానీ రానురాను పరిస్థితి మారింది. స్కూల్గేమ్స్తో మొదలై జాతీయస్థాయిలో రాణించడం కెరీర్‌ను ఒక రకంగా మలుపు తిప్పింది. మర్రి రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ఫెన్సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా మార్పులు వచ్చాయి. విరివిగా టోర్నీలు ఆడే అవకాశం లభించింది. పోటీ పెరగడంతో నాణ్యమైన ఫెన్సర్లు వెలుగులోకి వస్తున్నారు.
ఫెన్సింగ్‌లో ఓనమాలు ఎక్కడా?
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో 2016 నుంచి 2020 వరకు చదివాను. అదే సమయంలో ఫెన్సింగ్ కోచ్ భవానీ ప్రసాద్ నాకు మెరుగైన శిక్షణ ఇచ్చారు. అందుబాటులో ఉన్న వనరులతో నన్ను తీర్చిదిద్దారు.
కుటుంబ నేపథ్యం ఏంటీ?
మాది నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామం. మా నాన్న షేక్ హుస్సేన్ ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మేము ముగ్గురం సంతానం. అక్క డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నది. తమ్ముడు స్కూల్ విద్య అభ్యసిస్తున్నాడు. మధ్య తరగతి కుటుంబం అయినా మా నాన్న ఎక్కడా వెనుకాడకుండా అన్ని రకాలుగా నన్ను ప్రోత్సహించారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనుకకు తగ్గకుండా టోర్నీలకు పంపించారు. నా కెరీర్ ఎదుగుదలలో కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిది. వారి మద్దతు లేకుంటే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదు.
ప్రోత్సాహం ఎలా ఉంది?
ఖరీదైన క్రీడ ఫెన్సింగ్‌లో అత్యుత్తమ శిక్షణ కోసం చాలా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో ప్రోత్సాహం లభించలేదు. లండన్‌లో కామన్వెల్త్ చాంపియన్‌షిప్ కోసం బాబుఖాన్ ట్రస్ట్ వాళ్లు ఆర్థిక సాయం చేశారు. ఇది చాలా ఉపయోగపడింది. కానీ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలంటే మద్దతు తప్పనిసరి. ఎవరైనా స్పాన్సర్లు ముందుకొస్తే మరింత మెరుగ్గా రాణించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే ఈ నంబర్ (73309 35462)లో సంప్రదించవచ్చు. ప్రస్తుతం సాయ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్నా..అంతర్జాతీయ స్థాయిలో పోటీ ఎదుర్కొవాలంటే విదేశాల్లో ట్రైనింగ్ తీసుకోవాలి. అందుకోసం స్పాన్సర్ల అవసరం ఎంతో వుంది.
తదుపరి టోర్నీ ఎక్కడ?
వచ్చే నెలలో కువైట్ వేదికగా ఆసియా యూత్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ జరుగనుంది. ఏడో తేదీ నుంచి మొదలయ్యే టోర్నీలో భారత్ నుంచి 24 మంది పోటీకి దిగుతున్నారు.
కెరీర్లో ఎన్ని పతకాలు ఉన్నాయి?
ఆరేండ్ల ఫెన్సింగ్ కెరీర్లో ఇప్పటి వరకు జాతీయస్థాయిలో ఏడు, అంతర్జాతీయ స్థాయిలో మూడు పతకాలు సాధించాను. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధిస్తానన్న ఆత్మవిశ్వాసం నాలో ఉంది.