e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home News సన్నాఫ్‌ మేస్త్రి.. శ్రీకాంత్‌ డ్యాన్స్‌ మాస్టర్‌!

సన్నాఫ్‌ మేస్త్రి.. శ్రీకాంత్‌ డ్యాన్స్‌ మాస్టర్‌!


పల్లెటూర్లో పుట్టాడు. పేదరికంలో పెరిగాడు. నృత్యాన్నే ప్రాణంగా భావించాడు. పదేండ్ల వయసులో టీవీలో డ్యాన్స్‌ షోలు చూసి, తానూ డ్యాన్సర్‌ కావాలని కలలుగన్నాడు. పస్తులుండి మరీ ప్రాక్టీస్‌ చేశాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, డ్యాన్స్‌ మాస్టర్‌గా ఎదిగాడు.. కొరియోగ్రాఫర్‌ శ్రీకాంత్‌.

చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం శ్రీకాంత్‌ స్వగ్రామం. తనది నిరుపేద కుటుంబం. తండ్రి భవన నిర్మాణ మేస్త్రీ . ఆయన ఇంటి పనికిపోతేనే ఇల్లు గడిచేది. లేదంటే పస్తులే. బాల్యం నుంచీ టీవీ షోలు చూస్తూ.. డ్యాన్స్‌పై ఆసక్తి పెంచుకున్నాడు శ్రీకాంత్‌. స్నేహితులతో కలిసి నిత్యం డ్యాన్స్‌ ప్రాక్టీస్‌లో మునిగితేలేవాడు. తన ప్రతిభను తల్లిదండ్రులు గుర్తించారు, ప్రోత్సహించారు. మొదట్లో పిల్లలకు డ్యాన్స్‌ క్లాసులు తీసుకొనేవాడు. తర్వాత.. స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించే కార్యక్రమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు.

పస్తులుంటూ ప్రాక్టీస్

‌కోటి కలలతో సరిగ్గా పదేండ్ల క్రితం హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు శ్రీకాంత్‌. కృష్ణానగర్‌లో ఓ చిన్న రూమ్‌ అద్దెకు తీసుకొని ప్రయత్నాలు ప్రారంభించాడు. అడుగడుగునా కష్టాలే స్వాగతం పలికాయి. చేతిలో డబ్బులు లేకపోవడంతో తిండికి తిప్పలు పడ్డాడు. ఆశయ సాధనకోసం పొద్దున పేపర్‌బాయ్‌గా పనిచేశాడు. రాత్రిపూట బార్‌లో బార్‌బేరర్‌ అవతారం ఎత్తాడు. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా, తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదు.

జీవితాన్ని మార్చిన షో

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిర్వహించిన ‘దమ్ముంటే కాస్కో’ రియాల్టీ షో శ్రీకాంత్‌ జీవితాన్నే మార్చేసింది. ఈ కార్యక్రమానికి ఎంపికైన శ్రీకాంత్‌, తన ప్రతిభతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. అప్పుడే మాటీవీలో ‘రంగం-2’లో అవకాశం దక్కింది. ఆ తర్వాత 2014లో ఈటీవీ ‘ఢీ’ షోకు ప్రయత్నించాడు. ఇక్కడా సైడ్‌ డ్యాన్సర్‌గానే అవకాశం వచ్చినా డాన్స్‌మాస్టర్లు శ్రీను, అనిల్‌ ప్రోత్సాహంతో ప్రతిభను చాటాడు. తన టాలెంట్‌తో జడ్జీలను మెప్పించాడు. లీడ్‌ డ్యాన్సర్లకు ఏ మాత్రం తీసిపోకుండా చేస్తున్నాడన్న ప్రశంసలూ అందుకొన్నాడు. అప్పటినుంచి శ్రీకాంత్‌ వెనుదిరిగి చూసుకోలేదు. అదే జోష్‌తో 2019లో జెమినిలో నిర్వహించిన ‘రంగస్థలం’, మాటీవీలో వచ్చిన ‘కామెడీ స్టార్స్‌’ షోలలో లీడ్‌ డ్యాన్సర్‌గా అవకాశం వచ్చింది. తన ప్రదర్శనలతో కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ప్రశంసలూ అందుకున్నాడు. ఒక పక్క టీవి షోలు చేస్తూనే, పెద్ద ఈవెంట్లకు డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. ఓ ఇరవై మంది జూనియర్‌ డ్యాన్సర్లకు ఉపాధిని చూపిస్తున్నాడు.‘అవకాశాలు వెతుక్కుంటూ రావు. మనమే వాటిని వెతుక్కోవాలి’ అంటాడు శ్రీకాంత్‌.

లఘు చిత్రాల్లోనూ..

డ్యాన్సర్‌గా ప్రతిభ చూపుతున్న శ్రీకాంత్‌, నటనలోనూ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఖాళీ సమయంలో సొంత ఖర్చులతోనే సందేశాత్మక లఘుచిత్రాలను రూపొందిస్తున్నాడు. ఇప్పటికే శ్రీకాంత్‌ తీసిన ‘ఆమె నా గతం’, ‘కిడ్నాప్‌’, ‘మార్పు మనిషితోనే’ షార్ట్‌ ఫిలిమ్స్‌ మంచి పేరును తెచ్చిపెట్టాయి.

పెద్ద హీరోలతో..

చిన్నప్పటి నుంచే డ్యాన్సర్‌ కావాలని కలలుగన్నా. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ఎంతో కష్టపడ్డా. ‘దమ్ముంటే కాస్కో’ రియాల్టీ షో ఈటీవీ ‘ఢీ’ నా జీవితాన్ని మలుపు తిప్పాయి. ‘ఢీ’లో డ్యాన్స్‌ మాస్టర్లు శ్రీను, అనిల్‌ ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను. అక్కడ సైడ్‌ డ్యాన్సర్‌గా మంచి అవకాశాలు వచ్చాయి. జెమిని‘రంగస్థలం’లో, మాటీవీ ‘కామెడీ స్టార్స్‌’లో లీడ్‌ డ్యాన్సర్‌గా చేసి, అందరూ గుర్తుపట్టే స్థాయికి ఎదిగా. నాలాంటి మరికొందరికి ఉపాధిని చూపేందుకు హైద్రాబాద్‌లో ఈవెంట్‌ షోలు చేస్తున్నా. ఇక్కడితో ఆగిపోను. ఇండస్ట్రీలోని పెద్ద హీరోలకు డ్యాన్స్‌ కంపోజ్‌ చేయడమే నా లక్ష్యం. మంచి నటుడిగానూ రాణించాలనుకొంటున్నా. నిజాయతీగా కష్టపడితే మన కలల్ని నిజం చేసుకోగలమని యువత గుర్తించాలి.
శ్రీకాంత్‌, డ్యాన్స్‌ మాస్టర్‌

ఐతగోని రాఘవేంద్ర , చౌటుప్పల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సన్నాఫ్‌ మేస్త్రి.. శ్రీకాంత్‌ డ్యాన్స్‌ మాస్టర్‌!

ట్రెండింగ్‌

Advertisement