హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : దేశంలో ఏ రాష్ట్రం చేయని దుస్సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం ఒడిగట్టిందని.. రైతు డిస్కమ్(థర్డ్ డిస్కమ్)ఏర్పాటుచేసి అన్నదాతలను కష్టాల్లోకి నెట్టుతున్నదని.. ఇది రైతుల పాలిట మరణశాసనం .. అని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. అప్పులతో పుట్టిన డిస్కమ్నుంచి రైతు సేవలు ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. తెలంగాణ ఎలక్ట్రికల్ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘రైతు డిస్కమ్-ప్రకటిత లక్ష్యాలు-ఆచరణ సవాళ్లు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి తుల్జారాంసింగ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా.. ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న రైతు డిస్కమ్ భవిష్యత్తులో రైతుల పాలిట మరణశాసనంగా మారే ప్రమాదం పొంచి ఉన్నదని, రైతు డిసమ్ ఏర్పాటుపై రైతులకు అవగాహన లేదని, దీనిపై అవగాహన కల్పించాలని సూచించారు. కొత్త డిసమ్ ఏర్పాటుకు ఈఆర్సీ అనుమతులు ఇవ్వకముందే ముఖ్యమంత్రి జూన్ 2న రైతు డిస్కమ్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించడం శోచనీయమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైతే.. కేసీఆర్, తాము అడ్డుకున్నామని, శాసనసభ ఏర్పాటుచేసి తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. దాని ఫలితంగానే కేంద్రం మనకు రావాల్సిన రూ.23వేల కోట్లను అడ్డుకున్నదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి అభిప్రాయం లేకుండానే ఏకపక్షంగా మూడో డిసమ్ ఏర్పాటుచేసి రైతులను నిర్వీర్యం చేసే కుట్రలు పన్నుతున్నదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఉద్యోగుల విభజన తీరు గమనిస్తే సుమారు 600 డీటీఆర్లను ఒక్కరు చూడటం ఎలా సాధ్యమని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. నాలుగు డీటీఆర్లు ఒకేసారి కాలిపోయినా, ఇతర సమస్యలు తలెత్తినా సదరు ఉద్యోగి పరిశీలించడానికి కనీసం నాలుగు రోజులు పడుతుందని, అంతవరకు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఎవరి అభిప్రాయాలు తీసుకున్నారని, కనీసం అసెంబ్లీలో కూడా చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడమేంటని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆగమేఘాల మీద జూన్ 2న రైతు డిసమ్ ప్రారంభించాల్సినంత అవసరం ఏమొచ్చిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో రూ.60 వేల కోట్లతో 400 కేవీ సబ్స్టేషన్లు 30, 220 కేవీ సబ్స్టేషన్లు 52, 132 కేవీ సబ్స్టేషన్లు 175కు పెంచామని, 16 వేల కిలోమీటర్లు ఉన్న లైన్‌ను 28 వేల కిలోమీటర్లకు పెంచినట్టు గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ఒక సబ్‌స్టేషన్ నిర్మాణం జరుగలేదని పేర్కొన్నారు. రైతు డిసమ్కు థర్మల్ పవర్‌ను కేటాయించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఈ నెల 29న ఈఆర్సీ బహిరంగ విచారణకు తాము వస్తామని, బలమైన వాదనలు వినిపించి రైతులపాలిట శాపంగా మారనున్న కొత్త డిసమ్ను అడ్డుకుంటామని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.
3వ డిస్కమ్ఏర్పాటు అవసరం లేదని, రెండు డిస్కమ్‌లతో గత పన్నెండేండ్లుగా వినియోగదారులకు మంచి సేవలు అందుతున్నాయని ఏపీఎస్ఈబీలో పనిచేసిన ఇంజినీర్స్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. 3వ డిసమ్తో అప్పులు పెంచడమే తప్ప, ఎలాంటి ప్రయోజనం ఉండదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. టీఈఈఏ మాజీ ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్య శెట్టి మాట్లాడుతూ.. మూడో డిస్కమ్ద్వారా ప్రభుత్వంతోపాటు ఏ వర్గానికి ఉపయోగం ఉండదని తెలిపారు. రైతు సంఘం నాయకుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రైతు డిసమ్ అంటే వ్యాపారమని, అంతా ప్రభుత్వమే చూస్తున్నప్పుడు రైతు డిపార్ట్మెంట్ అని పెట్టి ప్రభుత్వమే నిర్వహించాలని, రైతుడిస్కమ్ తో రైతులకు సేవలు అందుతాయనేది భ్రమ అని పేర్కొన్నారు. సీపీఐ(ఎం) సహకార్యదర్శి తీగల సాగర్ మాట్లాడుతూ.. కొత్త డిస్కమ్ ఏర్పాటు వెనుక కుట్ర దాగి ఉన్నదని చెప్పారు. ప్రభుత్వానికి రైతులపై నిజమైన ప్రేమ ఉంటే తకువ ఖర్చుతో వచ్చే విద్యుత్తు కేటాయించేదని, కానీ అధిక ధరతో వచ్చే థర్మల్ విద్యుత్‌ను కేటాయించడం వెనుక సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర దాగి ఉన్నదని ఆరోపించారు. ఏమాత్రం ఉపయోగపడని రైతు డిసమ్కు రూ.1,300 కోట్ల ఖర్చుతో మీటర్ల బిగింపు వృథానే అని పేర్కొన్నారు.
ఇది రైతు డిస్కమ్కాదని, పైసల్లేని డిస్కమ్అని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కోటేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. ఇది రూ. 35 వేల కోట్ల అప్పుతో పుడుతుందని పేర్కొన్నారు. ఆదాయం లేని డిస్కమ్‌కు స్మార్ట్ మీటర్లు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే రైతు డిస్కమ్ ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 1104 ట్రేడ్ యూనియన్ మాజీ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు డిసమ్ ఏర్పాటు ఏకపక్ష నిర్ణయమని, 30 శాతం స్టేక్‌హోల్డర్స్ అయిన ఉద్యోగులతో చర్చించకుండానే డిసమ్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఎనర్జీ సెక్రటరీ, రైతు డిస్కమ్ సీఎండీల ఒంటెద్దు పోకడలతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం గానీ, విద్యుత్తు సంస్థల యాజమాన్యాలు గానీ ఒక కొత్త డిస్కమ్ ఏర్పాటుచేయాలంటే ప్రజలతోపాటు ఉద్యోగులు, విద్యుత్తు నిపుణులు, రైతు సంఘం నాయకులతో చర్చించాల్సిన అవసరం ఉన్నదని టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ తన అభిప్రాయాన్ని తెలిపారు. రైతు డిసమ్ వాటా 42 శాతం ప్రకారం ప్రతిఏటా రూ.32 వేల కోట్ల విద్యుత్తు కావాలని, ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న క్రాస్ సబ్సిడీ కేవలం రూ.16 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తుల్జారాంసింగ్ మాట్లాడుతూ.. కొత్త డిస్కమ్ ఏర్పాటుతో మళ్లీ తెలంగాణలో పాతరోజులు రాబోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వెంటనే థర్డ్ డిస్కమ్ ప్రతిపాదనను విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ.. ఇది ఏకపక్ష నిర్ణయమని విమర్శించారు. సమావేశంలో సత్యనారాయణరావు(1104), జెన్కో ఏడీఈ కృష్ణ, ప్రవీణ్ కుమార్, ఎస్ఎల్ పద్మ, రాజిరెడ్డి తదితరులు మాట్లాడారు. అనంతరం రైతు డిసమ్కు లైసెన్స్ ఇవ్వొద్దంటూ సమావేశం ఐదు తీర్మానాలు చేసింది. వీటిని తెలంగాణ ఈఆర్సీకి అందజేయాలని నిర్ణయించింది.