e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home తెలంగాణ కట్టడి చట్టం లేకనే..

కట్టడి చట్టం లేకనే..

యథేచ్ఛగా సోషల్‌మీడియాలో విష ప్రచారం
తోచింది రాసేస్తున్న ఆకతాయి చిల్లరగాళ్లు
నేరాలపై పర్యవేక్షణను పట్టించుకోని సంస్థలు
యూజర్ల డాటా అమ్ముకొంటూ ప్రైవసీ డ్రామా
దర్యాప్తులో పోలీసులకు అందని సహకారం
సంస్థల నియంత్రణకు కొరవడిన కఠిన చట్టాలు

జేబులో నుంచి టక్కున ఫోన్‌ తీసి ఒకడు ఫేస్‌బుక్‌లోనో.. ట్విట్టర్‌లోనో టకటకా తోచిన రాతలు రాస్తాడు. అవి ఎవరిని బాధించినా వాడికి లెక్కలేదు. సంస్థకు ఓ యాక్టివ్‌ యూజర్‌ ఉన్నాడు.. వాడు ఏం రాసినా, ఏం చేసినా సంస్థకు పట్టింపు లేదు.. ప్రస్తుతం సోషల్‌మీడియా పరిస్థితి ఇది. సోషల్‌మీడియాలో విద్వేష ప్రచారం, ఆర్థికనేరాలు, లైంగిక వేధింపులు, వ్యక్తిత్వ విధ్వంస ప్రచారాలు ఏటికేడు పెరిగిపోతున్నా.. అటు ఆ సంస్థలుగానీ.. ఇటు యూజర్లుగానీ జవాబుదారీతనాన్ని చూపటంలేదు. సోషల్‌మీడియాలో పోస్టుల కారణంగా ఏదైనా నేరం జరిగితే పోలీసుల దర్యాప్తునకు కూడా ఆ సంస్థలు సహకరించటంలేదు. దేశంలో ఈ తరహా నేరాలకు కఠిన శిక్షలు విధించేలా, సంస్థలను జవాబుదారీ చేసేలా ప్రత్యేక చట్టాలు లేకపోవటమే ఇందుకు కారణమన్నది నిపుణల విమర్శ.

కట్టడి చట్టం లేకనే..

హైదరాబాద్‌ సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): సోషల్‌మీడియాలో పెరుగుతున్న నేరాల కట్టడికి దేశంలో పటిష్టమైన చట్టం లేకపోవటమే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. సైబర్‌ నేరాలను కట్టడికి కేంద్రం 2000 సంవత్సరంలోనే ఐటీ యాక్ట్‌ రూపొందించింది. కొన్ని రాజకీయ ప్రతిబంధకాలతో అది మూలనపడింది. దానికి పలు సవరణలు చేసి 2009లో అమల్లోకి తెచ్చారు. అందులోని సెక్షన్‌ 66(ఏ) సోషల్‌ మీడియాలో జరిగే నేరాలను కట్టడిచేసేందుకు కీలకంగా ఉండేది. కంప్యూటర్‌, ఫోన్‌, ట్యాబ్లెట్‌ తదితర సమాచార సాంకేతిక పరికరాలను దుర్వినియోగం చేసి ఇతరులను ఇబ్బంది పెడితే ఈ సెక్షన్‌ ప్రకారం మూడేండ్ల వరకు జైలు శిక్షతోపాటు జరిమానా విధించేవారు. కానీ రాజ్యాంగం ఆర్టికల్‌ 19(ఏ) ప్రకారం పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు ఈ సెక్షన్‌ భంగం కల్గించేలా ఉన్నదంటూ 2015లో శ్రేయా సింగాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో ఫేక్‌న్యూస్‌, సామాజిక మాధ్యమాల వేదికగా జరిగే నేరాల కట్టడికి ప్రత్యేక చట్టమంటూ లేకుండా పోయింది. గత్యంతరం లేక ఇలాంటి నేరాలపై ఐపీసీ సెక్షన్‌ 124-ఏను ప్రయోగిస్తున్నారు.
జవాబుదారీతనం గాలికి..
సామాజిక మాధ్యమాల్లో ఖాతా తెరవడం సులువు కావడంతో చాలామంది నకిలీ చిరునామాలతో పదులు, వందల సంఖ్యలో ఖాతాలను నిర్వహిస్తూ ఇష్టానుసారంగా తప్పుడు వార్తలు ప్రచారంలో పెడుతున్నారు. యూజర్లను పెంచుకోవటమే లక్ష్యంగా పెట్టుకొన్న సోషల్‌మీడియా సంస్థలు.. వారు నిజమైనవారా? లేక నకిలీలా? అనేది పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. భారత్‌కు ఇప్పటివరకు పటిష్టమైన ఇంటర్మీడియరీస్‌ (మధ్యవర్తిత్వం) చట్టం లేకపోవటంతో సామాజిక మాధ్యమాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఆయా సంస్థలను బాధ్యులను చేయలేకపోతున్నామని నిపుణులు చెప్తున్నారు. ఆ దిశగా కేంద్రం సరైన చర్యలు చేపట్టకపోవడంతో సామాజిక మాధ్యమాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని అంటున్నారు.
ప్రైవసీపై డబుల్‌ గేమ్
వ్యక్తిగత గోప్యతపై కేంద్రం ఇప్పటివరకు సరైన చట్టం తేలేదు. వినియోగదారుల నుంచి వ్యక్తిగత సమాచారాలు తీసుకొని అమ్ముకొంటున్న సామాజిక మాధ్యమాలు.. నేర దర్యాప్తునకు మాత్రం ‘యూజర్‌ ప్రైవసీ’ అంటూ సమాచారం ఇవ్వటంలేదు. అభ్యంతరకర పోస్టులపై ఫిర్యాదులొస్తే వాటిని ఎవరు పెట్టారో తెలిపేందుకు ఆయా సంస్థలు పోలీసులకు సహకరించటంలేదనే విమర్శలున్నాయి. ఫేస్‌బుక్‌ ద్వారా ఒక మహిళ నుంచి 13 లక్షలు దోచుకున్న సైబర్‌ నేరగాడి ఐపీ అడ్రస్‌ ఇవ్వడానికి ఆ సంస్థ ఆరునెలలు తీసుకొన్నది. ఇటీవల కొందరు చైనీయులు కలర్‌ ప్రిడిక్షన్‌ గేమ్‌ పేరుతో రూ.1,600 కోట్లు, అప్పుల యాప్‌ల పేరుతో రూ.25 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడటానికీ మన బలహీన చట్టాలే కారణమనే వాదన వినిపిస్తున్నది.
పెద్దవాళ్లకే దిక్కు లేదు..
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారానికి బాధితులుగా మారిన న్యాయవాదులు, ప్రముఖులు కేసులు పెడితేనే దర్యాప్తు సరిగా జరుగడం లేదు. ఇక సామాన్యులు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. ఫేక్‌ అడ్రస్‌లు, ఫేక్‌ ఐడీలతో సోషల్‌ మీడియాలో నేరాలు చేసేవారిని కనిపెట్టడం, పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారుతున్నది. బాధితుకు సరైన న్యాయం జరుగడం లేదు.

తూడి అరుణ కుమారి, న్యాయవాది కఠిన చట్టాలు రావాలి
సామాజిక మాధ్యమాలే సాధనంగా కొందరు అసత్య ప్రచారాలకు తెరతీస్తున్నారు. ఇలాంటివారిని అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిబంధనలను తేవాలి. కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (సీఈఆర్టీ) వంటి కేంద్ర ఏజెన్సీలకు ఫిర్యాదు చేసే శక్తి లేని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ఫిర్యాదుల వ్యవస్థ రావాలి. ఇందుకు మరింత పకడ్బందీగా చట్టాలు చేయాలి.
-రామారావు ఇమ్మినేని, న్యాయవాది

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కట్టడి చట్టం లేకనే..

ట్రెండింగ్‌

Advertisement