e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు

రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు

  • 5 వేల కోట్ల పెట్టుబడితో ఏడాదిలో లావాదేవీలు  
  • కరోనా కష్టకాలంలో ప్రజల నిలువు దోపిడీ
  • ఢిల్లీలో ఒకే చిరునామాతో 102 డొల్ల కంపెనీలు  
  • తీగ లాగితే చైనాలో కదిలిన డొంక 
  • గుట్టుచప్పుడు కాకుండా భారత్‌దాటిన వేలకోట్లు
  • తెలంగాణ పోలీసుల దర్యాప్తు అంతర్జాతీయంగా సంచలనం
  • ఆరాతీసిన న్యూయార్క్‌ టైమ్స్‌, డిస్కవరీ చానల్‌
రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు

రూ.5 వేల కోట్ల పెట్టుబడితో 20 వేల కోట్ల రాబడి. కరోనా కష్టకాలంలో ఆర్థిక అవసరాలే ఆసరాగా రుణయాప్‌లు ప్రజలను పీల్చిపిప్పి చేసిన దోపిడీ. ఏడాది కాలంలోనే గుట్టుచప్పుడు కాకుండా భారత్‌ నుంచి దాటించిన సొమ్ము. ఒకే చిరునామాతో వందలకొద్ది డొల్ల కంపెనీలు.. తప్పుడు చిరునామాలతో బ్యాంకు ఖాతాలు.. చైనాలో ఉండే యాప్‌ల ఆపరేషన్‌ వంటి వివరాలెన్నో తెలంగాణ సైబర్‌ క్రైం పోలీసుల విచారణలో వెల్లడైంది. సంచలనం సృష్టించిన రుణయాప్‌ల దందాపై అంతర్జాతీయ మీడియా సంస్థలు సమాచారం సేక రించగా.. అమెరికా కాన్సులేట్‌ వాకబు చేసింది.

హైదరాబాద్‌ సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ఆర్థిక అవసరాలు సాకుగా ప్రజలను ప్రలోభపెట్టి రుణయాప్‌లు సాగించిన దందా ఏడాదిలో అక్షరాలా రూ.20వేల కోట్లు అని ప్రాథమికంగా తేలింది. నిర్వాహకుల వేధింపులతో బలవన్మరణాలు, వెల్లువలా ఫిర్యాదులతో హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులు.. 197 రుణయాప్‌లపై 27 కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన సైబర్‌ క్రైం పోలీసులు వాటి డొంకను కదిలించగలిగారు. యాప్‌లకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడికి వెళ్తున్నాయి? ఎక్కడినుంచి ఆపరేట్‌ చేస్తున్నారు? ఇలా ఒక్కో అంశాన్ని ఛేదించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇప్పటివరకు దాదాపు వెయ్యికి పైగా బ్యాంకు ఖాతాలను విశ్లేషించిన పోలీసులు.. ఏకంగా రూ.25 వేల కోట్ల లావాదేవీలకు సంబంధించిన వివరాలను గుర్తించారు. ఇందులో రుణయాప్‌ల పెట్టుబడి రూ.5 వేల కోట్లు ఉండగా.. రూ.20 వేల రాబడి ఉన్నట్టు తేలింది. 

అమెరికా సంస్థ సహకారంతో..

ఈ కేసుల విచారణలో సైబర్‌ క్రైం పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఆమెరికాకు చెందిన ఓ సంస్థ సహకారంతో ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను తయారుచేయించారు. దీనిద్వారా రుణయాప్‌ల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వెయ్యికి పైగా ఖాతాలను 14 అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని విశ్లేషిస్తున్నారు. ఒకే చిరునామాతో 102 కంపెనీలు ఉన్నట్టు, ఒకే చిరునామాతో ఒకేబ్యాంకులో 30 ఖాతాలు తీసినట్టు గుర్తించారు. రూ.5 వేల కోట్ల పెట్టుబడి ఏడాది కాలంలో రూ.20 వేల కోట్ల రాబడితో రూ.25వేల కోట్ల లావాదేవీలు జరిగినట్టు తేల్చారు. అత్యధికంగా 20 ఖాతాల ద్వారానే రూ.8వేల కోట్ల లావాదేవీలు జరిగాయి. బ్యాంకు ఖాతాలకు సంబంధించి సగానికిపైగా కేవైసీలు లేకపోవడంతో వాటి వివరాలు తెలియడం లేదు. బ్యాంక్‌ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కన్పిస్తున్నదని అధికారులు పేర్కొంటున్నారు.  చట్టాల్లోని లోపాలను ఆసరాగా చేసుకొని చైనా సంస్థలు భారత ఆర్ధిక వ్యవస్థను దెబ్బకొడుతున్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగ్‌ విహార్‌ చిరునామాతో..

ఉద్యోగ్‌ విహార్‌, ఫేస్‌ -4, గురుగావ్‌ చిరునామాతో 102 కంపెనీలు రిజిస్ట్రేషన్‌ అయ్యాయి. ఈ డాటాను రిజిస్టార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) నుంచి సేకరించారు. ఈ కంపెనీలపై ఉన్న బ్యాంకు ఖాతాల ఆపరేటింగ్‌తోపాటు కంపెనీల నిర్వహణ అంతా చైనా నుంచే జరుగుతున్నట్టు నిర్ధారణ అయింది. ఈ షెల్‌ కంపెనీలతో బ్యాంకు ఖాతాలు తెరిచి.. ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు.. అక్కడి నుంచి ఇంకో ఖాతాకు… పక్కా ప్లాన్‌ ప్రకారం బదిలీ చేసినట్టు తేలింది. బెట్టింగ్‌ యాప్‌ల కేసు దర్యాప్తులో ఒకే చిరునామాతో హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో 30 ఖాతా లు తెరిచినట్టు వెల్లడయింది.రుణ యాప్‌ల మూలాలు చైనాలో ఉన్నట్టు తేలడంతో అంతర్జాతీయంగా చర్చ మొదలైంది. తెలంగాణ పోలీసులు వెలుగులోకి తెస్తున్న విషయాలపై అమెరికా సంస్థలు కూడా వాకబుచేస్తున్నాయి. 

దర్యాప్తులో ఎస్‌ఐదే కీలకపాత్ర

సైబర్‌క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన బెట్టింగ్‌, రుణయాప్‌లకు సంబంధించిన రెండుకేసుల దర్యాప్తులో ఎస్‌ఐ మదన్‌గౌడ్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. స్వతహాగా సాఫ్ట్‌వేర్‌పై పట్టున్న ఆయన.. బెట్టింగ్‌ యాప్‌లో రూ.2వేల కోట్ల వరకు లావాదేవీలు జరగడంపై సూక్ష్మంగా పరిశీలించారు. అమెరికాకు చెందిన కంపెనీ సహాయంతో దర్యాప్తునకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి కేసును కొలిక్కి తెచ్చారు. ప్రస్తు తం రుణయాప్‌ కేసును ఛేదించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి సారథ్యంలో కేసుల దర్యాప్తును కొనసాగిస్తున్నారు.  

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రుణ యాప్‌ల దోపిడీ 20 వేల కోట్లు

ట్రెండింగ్‌

Advertisement