అతి ఎప్పుడూ అనర్థానికే దారితీస్తుంది. అందుకే ‘అతిక సవాసం మోసం’ అని జానపదులు చెబుతుంటారు. అతి అంటే ఎక్కువ అని, సోపతి/సహవాసం/సవాసం అంటే స్నేహం అని అర్థం. ఇద్దరు వ్యక్తులు మితిమీరిన స్నేహంగా ఉంటే కచ్చితంగా వారిద్దరి మధ్య స్పర్ధలు, గొడవలు వచ్చితీరతాయి.
విపరీతమైన చనువు వల్ల ఒకానొక సమయంలో లోకువ అవుతారు. రహస్యాలు తెలిసిన స్నేహితుడిని మోసగించడం కూడా సులభమే. నలుగురికీ ఆ రహస్యాలు చెప్పి చులకన చెయ్యడమూ కష్టమేం కాదు. అతిగా కలిసిమెలిసి తిరిగితే.. వారిద్దరినీ సమాజం అనుమానిస్తుంది. ఒకప్పుడు స్నేహానికి ప్రాణం ఇచ్చిన ఘటనలు కోకొల్లలు. ఇప్పుడు ‘ఏరా, పోరా, ఒరేయ్’ వంటి తిట్లతో మొదలై.. స్నేహం ముసుగులో బూతులు తిట్టుకునే స్థాయికి చేరింది నేటి యువత.