ఓ విషయాన్ని పదిమంది చెప్పినా వినకుండా.. మొండి పట్టుదలతో అర్థంలేని ప్రయత్నాలు చేయడాన్నే ‘కాకి దంత పరీక్ష/కాకి పళ్ల పరీక్ష’ అంటారు. లోకజ్ఞానం బొత్తిగాలేని ఓ అనుమానపు పెద్దమనిషికి ఓసారి కాకికి ఎన్ని పళ్లున్నాయో తెలుసుకోవాలనే కోరిక పుట్టింది. అనుకున్నదే తడవుగా కాకుల వేట ప్రారంభించాడు. ఈ విషయం తెలిసి, కొందరు పెద్ద మనుషులు ‘కాకికి పళ్లు ఉండవు. తన పదునైన ముక్కుతోనే ఆహారాన్ని చీల్చుతుంది’ అని సర్దిచెప్పారు.
ప్రయత్నాన్ని విరమించుకోమంటూ సలహా ఇచ్చారు. అయినా వినకుండా ‘కాకికి పళ్లు ఉండకపోతాయా?’ అనే అనుమానంతో ఏండ్లకు ఏండ్లు శ్రమించి ఓ కాకిని పట్టుకొన్నాడు. తీరా చూస్తే.. పళ్లు లేవనే తేలింది. అప్పటివరకూ అతను పడిన కష్టమంతా వృథా అయింది. ఇలా నలుగురూ చెప్పిన మాట వినకుండా చేసే ఏ పనైనా ‘కాకి పళ్ల పరీక్ష’ కిందికే వస్తుంది.