తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన ఘనత జానపద సాహిత్యానికి దక్కితుంది. జానపద సాహిత్యంలో బతుకమ్మ పాటలకు ప్రత్యేకత ఉన్నది. రామ రామ ఉయ్యాలో శ్రీరామ జయ రామ ఉయ్యాలో అంటూ పాట పాడినా, జనకు జనకు నింట్లో కోల్ చిన్ని జనకూ నింట్లో కోల్ అని పాడినా, తంగేడు పువుల్లో చందమామ మల్లెప్పుడు వస్తావు చందమామ అంటూ వొలలాడినా గౌరు గౌరమ్మ ఎవరాడి బిడ్డమ్మ అంటూ వాయనాలిచ్చినా, చిత్తు చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోనా అంటూ కోలాటాలాడిన, హిమవంతుని ఇంట్లో పుట్టి హిమవంతుని ఇంట్లో పెరిగి అంటూ సాగనంపుతూ పాట పాడిన బతుకమ్మ పాటలు జానపద గేయ సాహిత్యంలో ఉన్నతంగా నిలిపాయి.
అనురాగాలను ఆత్మీయతలను పండించిన కరుణ, శృంగార ప్రకాశకులు జానపదులు. పుడమితో మొదలెట్టి అంతరిక్షం దాకా ఎదిగిన మనిషి వలె ప్రకృతిని చూసి పరవశించిన జానపద స్త్రీలు తమ భావాలను నవరసాలను, పౌరాణిక, సాంస్కృతిక, సామాజిక అంశాలను బతుకమ్మ పాటల్లో కూర్చడం విశేషం .ఈ సాహిత్యమే జానపద గేయ సాహిత్యాన్ని పరిపుష్టం చేసిందనవచ్చు. జానపదులు పాండిత్యం నేర్చిన పండితులు కారు. పండితోత్తముల కుటుంబంలోపుట్టినవారు కాదు.
పచ్చని పొలాల నడుమ పరవశించే పక్షి రాజుల నడుమ స్వచ్ఛంగా కాయకష్టం చేస్తూ చినుకురాలిన మబ్బులు కదిలిన ఉరుములు ఉరిమినా తమ కోసమే అనుకునే పల్లీయుల పదం జానపదం. టపటప మంటూ రాలే చినుకు శబ్దాన్ని జుంజుం మంటూ సాగే తుమ్మెదల శబ్దాన్ని, కోకిల రాగాన్ని నిత్యం ఆస్వాదించే పల్లె జనం తమ చమట చుక్కల్ని తాళాలుగా తమ స్పందనను శృతిగా తమ జీవన అనుభవాలను పల్లవులుగా పాటలు పాడుతూ హాయిగా ఆహ్లాదంగా జీవిస్తారు. తమ ఉఛ్వాసనిచ్వాసాల్లో రాగాలను ఒడిసి పట్టుకుంటారు.అందుకే జానపదం జీవితభాష. అందుకే జానపదం జనం గుండెల్లోంచి వచ్చిన సంగీతం. జానపద స్త్రీలు పాడే బతుకమ్మ పాటలు సాహిత్య సంగీత సమ్మేళనాలుగా సమ్మోహనం చేస్తాయి.
జానపదాల సొగసు మాటల్లో సూటితనం పాటల్లో సొగసుతనం జలజల పారే సెలయేరు వంటిది. ఇలాంటివి జానపదం సంగీత సాహిత్య మేళవింపు. తెలుగు సాహిత్యానికి జానపద సాహిత్యం నిండుదనాన్ని ఇస్తే జానపదసాహిత్యానికి నిండుదనాన్ని కూర్చింది బతుకమ్మ ఆటపాట.. తెలంగాణకే మకుటమై దశ దిశల కీర్తి కెరటాలను ఎగురవేసింది బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయం.
మనిషి తల్లి గర్భంలో రూపు దాల్చే నాటి నుండి పుట్టడం పెరగడం పెళ్లి చేయడం వంటి సంబురాలన్నీ బతుకమ్మ పాటల్లో చోటు చేసుకోవడం విశేషం. స్త్రీల సహజత్వానికి నిదర్శనమైతే ఈ పాటలు జానపద గేయ సాహిత్యంలో నిండుగా కనిపిస్తూ తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశాయి .ఒకటో మాసం ఉయ్యాలో నెల అయిన నిండంగా ఉయ్యాలో ఏమి కోరింది ఉయ్యాలో అంటూ సాగే పాటలో తొమ్మిది నెలలు తల్లి గర్భంలో బిడ్డ రూపు దాల్చుకునే సన్నివేశంతో పాటు నెలతప్పిన గర్భిణి స్త్రీ ఏమేమి కోరుతుందో వివరించబడింది. జనకు జనకు నీ ఇంట్లో వలలో చిన్నజనకు ఇంట్లో వలలో పుట్టుతా సీతమ్మ వలలో ఏమి కోరింది వలలో పుట్టుతా సీతమ్మ వలలో పురుడు కోరింది వలలో.. అంటూ సాగే పాటలో సహజంగా ఆడపిల్లల ఆటపాటలతోపాటు తల్లిదండ్రుల కోరిక అర్థం అవుతుంది.
బతుకమ్మ అన్ని పండుగల్లా ఒక్కరోజుతో ఆగేది కాదు. పెత్ర అమావాస్య నుండి 9 రోజులు ఆశ్వేజ శుద్ధ పాడ్యమి నుండి నవమినాటి సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. ఈ పండగ తెలంగాణ ప్రజల మానసిక ఔన్నత్యాన్ని చాటుతుందని చెప్పవచ్చు. ఆటపాటలతో సాగే బతుకమ్మ పండుగ సంగీత సాహిత్యసమ్మేళనం.
బతుకమ్మ పండుగ నేడు రాష్ట్ర పండుగగా జరుపుకోవడం మనను మనం గౌరవించుకోవడమే కాదు మన సంస్కృతి వైశిష్టాన్ని ప్రపంచానికి చాటిన సందర్భం. ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలంగాణ వాసులు తమ సంస్కృతి ఇది అని చాటుకున్న సంబురం. బతుకమ్మ పూల గోపురం. బతుకమ్మ పూల జాత ర. ఏ దేవుడు పూజకైనా పూలను వాడుతాం.కానీ పూలనే దేవతగా చేసి మన తలపై ఎత్తుకోవడం ఇక్కడి గొప్ప ఆచారం. అందరికీ ఆదర్శనీయం.ఈ పండుగ జరుపుకునే విధానంలో, బతుకమ్మను పేర్చడంలో కళాత్మకత ఉట్టిపడుతుంది.బతుకమ్మ ను పేర్చడంలో తీరొక్క పూవులు ఉపయోగించినప్పటికీ తంగేడు పువ్వుకు ప్రత్యేకత ఉంది.తంగేడు పువ్వు( రాష్ట్ర పువ్వు) పై కూడా ఎంతో సాహిత్యం ఉంది.
పచ్చ పచ్చగా నవ్వుతుంటది,బాట వెంట బహు సక్కగుంటది, తెలంగాణ తల్లికి సిగపూవునంటది, బతుకమ్మ ఒడిలోన ఓలలాడుతాది ,తంగేడు పువ్వు తల్లి పువ్వురా తర తరాల మన కలల పంట రా అంటూ సాగే పాటలో తంగేడు విశిష్టత అర్థం అవుతుంది.
ఊరూరా ఊరేగే బతుకమ్మ నీకు వేవేలా వందనాలు మాయమ్మ ,బతుకమ్మ బతుకమ్మ మా బతుకు నీవమ్మా ….అంటూ సాగే పాటలో బతుకమ్మ విశిష్టత అర్థం అవుతుంది. పండుగ వేళ పాడే పాటలు …బతుకమ్మ ఉయ్యాల పాటలు, కోలాటం పాటలు,గౌరమ్మ పాటలు, ఓలలాడించే పాటలు, వాయినాల పాటలు.. ఇలా బతుకమ్మ పాటలు కోకొల్లలు. ఈ పాటల్లో ఎక్కువ భాగం మౌఖికమే.అందుకే జానపద మౌఖిక సాహిత్యంలో బతుకమ్మ పాటలకు ప్రాధాన్యత ఉంది.
బతుకమ్మ పాటల్లో అత్యధికం మౌఖికమే. మౌఖిక ప్రచారం జానపద సాహిత్య ప్రధాన లక్షణం.ఈ పాటలు ఇతర పాటలు వలె కాక ఒకరు చెబుతూ ఉంటే వందల మంది వంత పాడుతూ గానం చేస్తారు. ఈ పాటల్లో పల్లవులు ప్రాధాన్యం కలిగి ఉండడంతో పాటు వివిధ రూపాంతరాలను కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఉయ్యాలో ఉయ్యాలో ఉయ్యాలో అనే పల్లవి ఎక్కువ పాటల్లో కనిపిస్తుంది. కోల్, చందమామ, వలలో వంటి ఆవృతాలను కూడా ఉపయోగిస్తారు. జానపద భాష కాలగమనంలో పుట్టి గల గల పారే జీవ నది లాంటిది.తరతరాల నుండీ తెలుగు భాషకు జీవనాడి అయిన దేశ్య పదాలు, సామెతలు, జాతీయాలు, జానపద భాషలో అలరారుతుంటాయి. ఇవన్నీ బతుకమ్మ పాటల్లో కోకోల్లలు. బతుకమ్మ పాటలు కవులు పండితులు రాసినవి కావు. ఉయ్యాల పాటలుగా ప్రచారం అయినవి. పాండిత్య ప్రాకర్ష లేనప్పటికీ నవరసాలు తమ పాటల్లో వినిపించిన, వినిపిస్తున్న తెలంగాణ స్త్రీల పాండిత్యం శ్లాఘనీయం వారి కవిత్వం అజరామరం.
బతుకమ్మ పాటలు తెలుగు భాషకు అందం చేకూర్చే సామెతలు
మెండు బతికి ఉంటే నువ్వు ఉయ్యాలో బలిసాకు తిని బతుకు ఉయ్యాలో
ఇట్టి వారలైన ఉయ్యాలో పెట్టి దెబ్బగా రాదు ఉయ్యాలో.
బతుకమ్మ పాటల్లో నుడికారాలు భాషకే సౌందర్యాన్ని తెచ్చాయి.
తెల్లని గుడ్లకు ఉయ్యాలో తెచ్చెరగుతాలు ఉయ్యాలో ఎర్రని గుడ్లకు ఉయ్యాలో ఇతనే కోపాలు ఉయ్యాలో ఈ మాటల్లో వీరి రస పోషణ కనిపిస్తుంది ఇదే కాకుండా శృంగార కరుణ రస పోషణ రౌద్ర బీభత్స సన్నివేశాలు సహజత్వాన్ని కలిగించాయని చెప్పవచ్చు.
అంతేకాదు బతుకమ్మ పాటల్లోని కథాంశాలు అనంతం. పౌరాణిక కథలు, దేవతా కథలు, చారిత్రక గేయ గాథలు, గ్రామ దేవత కథలు, పేరంట్రాండ్ర కథలు, అద్భుత కథలు, భారత భాగవత రామాయణ లాంటి పురాణ కథలు, చారిత్రక అంశాలు, సాంస్కృతిక నేపథ్యం, సామాజిక అంశాలతో పాటు వాస్తవ సంఘటనలు, జీవన తత్వాలు ఉన్నాయి. ఇంకా తెలంగాణ సాయుధ పోరాటం, స్వాతంత్య్ర సంగ్రామం, వీరుల చరిత్రలను అందిపుచ్చుకొని తెలంగాణ సమాజానికి తద్వారా ప్రపంచానికి అందించాయి. ఇక బతుకమ్మ సంగీత సాహిత్య నృత్యకళా సమాహారము. ఈ నృత్యంలో పాటలో లయకూర్పుతో పాటు అడుగుల్లో క్రమం ఉంది..ఆ పరంగా కూడా సహజంగా వేసిన నాటి అడుగులను చప్పట్లను శాస్త్రీయంగా అలాగే కాపాడుకోవాల్సి ఉంది. మ్యూజిక్ పేరుతో బతుకమ్మ పాటలపై జరుగుతున్న మ్యాజిక్ ఆపవలసి ఉంది.
బతుకమ్మ పండుగ ఆటపాట ప్రతిదీ ప్రత్యేకమైనది. ఇది పూల పండుగేకాదు ప్రకృతి పండుగ. సమిష్టి పండుగ. బతుకమ్మ పూల గోపురంలోని పూలన్నింటివోలె సమాజంలో అందరం సమానంగా సమతా భావనతో సాగుతూ మమతలు పంచుకుంటే నిత్యం బతుకమ్మ పండుగే.ఇది మన బతుకమ్మ సందేశంగా భావించాలి. మన బతుకులు చల్లగా ఉండాలని బతుకమ్మ తల్లిని వేడుకుందాం. మనల్ని గెలిపించిన విజేత బతుకమ్మగా అమ్మవారిని పూజిద్దాం.
(వ్యాసకర్త: బతుకమ్మ పాటల పరిశోధకురాలు)
డాక్టర్ బండారు
సుజాత శేఖర్
98664 26640