మా మాట మా పాట మా యాస మా బాస బతుకమ్మగా మారి బతికించునని ఆశ… మా నోట పలికిన మా ప్రభుత్వపు మాట.. అధికార భాషవై అలరించు ప్రతి చోట…బతుకమ్మా.. ఓ బతుకమ్మ … వీరుల త్యాగాల ప్రతిరూపమైన పోరుగడ్డ పైన పుట్టినావమ్మ… బృహదమ్మవట ఆనాడు నీవు బతుకమ్మ వైనావు నేడు.. ఏటేటా వొచ్చేవు తెలుగింటి బిడ్డవై యెలుగుల్లు నింపేవు తెలగాణ గడ్డపై.. ఉయ్యాల పాటవై ఊగేవు తుమ్మెదల ఆటవై తూగేవు.. పూలతేరు పైన పుప్పొళ్ళ గంధాలు పసుపు గుంకుమలతో పారాణి అందాలు.. కలబోసి తెచ్చేవు కలికి ఒయ్యారాలు.. తులతూగి విరులతో తొమ్మిది దివసాలు..
తెలంగాణ అంటేనే పల్లె జీవితం. తెలంగాణ మాతృక తెలంగాణ ప్రాంత మృత్తిక. కొండలెంబటి, గట్లెంబటి తిరిగి తిరిగి ఏరుకొచ్చిన తంగేడు, గునుగు, గుల్మాల, రుద్రాక్ష, బంతి, చామంతి, బొడ్డుమల్లె, కట్ల, బీర, కాకర పూలతోని ‘బతుకమ్మ’ ను పేర్చి, పసుపుతోని గౌరమ్మగా చేసి అగ్రస్థానాన నిలిపి పూజించే సమాజం మనది. మన తెలంగాణలో మానవ సంబంధాలన్నీ ప్రకృతి సంబంధాలే. ఆ ప్రకృతి మాతను నెత్తిన పెట్టుకొని పూజించే సంప్రదాయం మనది. బతుకమ్మను బతికించుకోవడానికి మన చెరువులను, అడవులను, వాగులను, వంకలను, బావులను కాపాడుకోవాలి.
అమరులైన వీరులార.. తెలంగాణకై అసువుల ధారవోసిన ధీరులార.. తంగేడు, తామరలు, రాఖీ, రుద్రాక్ష , మందారాలు, చామంతులు, బంతి, గునుగు, బీర, సీత జడలు, గుమ్మడి, కట్లపూలు. బతుకమ్మను పేర్చుకునే పలురకాల పువ్వులుగా ఆడబిడ్డలకు చేతులకందించగ వచ్చినార…అన్నలార..తమ్ములార. తల్లి ఋణం తీర్చుకోను తరలివచ్చినార. అక్కచెల్లెళ్ళతోడ ఆడుకొనగ వచ్చినా ర..మీ స్ఫూర్తి మాకు బలం… మీ కీర్తి మాకు వరం.. పునర్జన్మనెత్తి పుష్పాలై భువికి చేరి, బతుకమ్మల రూపు దాల్చి పరికించగ రండి.
తమకోసం కాకుండా ఇతరుల కోసమే జీవించి… ఇతరుల కోసమే ప్రాణాలర్పించిన మహనీయులు మన నేలపై కోకొల్లలు. ఈ మట్టిలోనే ఉంది త్యాగాల చిరునామా.. సామాజిక మార్పుకోసం అనన్య త్యాగాలు చేసిన యుద్ధభూమి ఇది. సమ్మక్క సారలక్కల నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుదాకా నెత్తురోడని రోజులేదు. ఇక్కడ ఇంటింటా ఒక వీరుడు ఒరిగిన కథ ఉన్నది. ఇక్కడి నేల, గాలి, చెట్టు, చేమా దేనిని అడిగినా వీరుల కథను వినిపిస్తాయి. తమకోసం అమరులైన వీరులను తెలంగాణ గడ్డ ఎన్నటికీ మరిచిపోదు. ఎక్కడ ఉన్నారో అమరవీరులారా ఈ నింగి నేల తొంగి చూసే చుక్కల్లున్నారా ఈ నేల మీద మొలుస్తున్న మొక్కల్లున్నారా తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మల్లున్నారా‘ అంటూ నిరంతరం అమరులను స్మరిస్తుంది. మనం చేసే శ్రమలో, చిందే స్వేదంలో, ఎత్తిన కొడవల్లలో, తినే అన్నంలో అమరులున్నారు.. మనం ఆడే ఆటలో, పాడే పాటల్లో, బతుకమ్మలో పేర్చిన పువ్వుల్లో, ఆడే బొడ్డెమ్మల్లో వీరులు ఉన్నారు. వలసపాలనలో ధ్వంసమైన మన సంస్కృతీ సంప్రదాయ పునరుద్ధరణలో అమరులు చిరునవ్వులు చిందిస్తున్నారు. ఇక్కడి ప్రజల నిత్య జీవితంలో త్యాగధనులు పెనవేసుకున్నారు, అమరులను తలుచుకోకుండా ఏ పని చేయని గొప్ప సంప్రదాయం తెలంగాణలో ఉంది.. నన్నుకన్న నా తెలంగాణ మట్టికి వందనం. తెలంగాణ అమరులకు నా వందనం.
అనుక్షణం మీ త్యాగం, ఆవిరైన మీ ప్రాణం, మాకూ మన నాయకునికి కండ్లు చెమ్మగిల్ల జేసే కర్తవ్యబోధ చేసి.. ఉద్యమాన్ని ఉరికించి సాధించిన మన రాష్ట్రం మూడు పూలు, ఆరుకాయలు. ఆరుగాలం రైతు క్షేమం.. ఇంటింటా శుభోదయం.. అలుగులుబోసే చెరువులు, నిలువెత్తున పంట చేలు.. ప్రగతి పథంపై ముందుకు పరుగెడుతున్నది రథం.. బాపు కేసీఆర్ పేరు మారు మోగుతున్నది నిజం… ఆనాటి అగచాట్లు పోయి ఆనంద బాష్పాలు నేడు. మరువము మీ బలిదానం మా ఆఖరి శ్వాస వరకు.. వెలుగుతున్న దీపాల్లో వీక్షిస్తాం మిమ్ములను. ప్రతి పువ్వు మీరే అని బతుకమ్మలు పేరుస్తం. అమర దీపాలైనా, అఖండ జ్యోతులైనా అన్నదమ్ములైన మిమ్మల్ని ఆరాధిస్తం నిరంతరం..
తాగబోతే నీళ్ళు లేక తుమ్మెదాలో తడిగొంతులారిపాయే తుమ్మెదాలో రాకరాక నల్లలొచ్చె ఒకబిందె నిండదాయె దొంగలెక్క కరెంటేమో వచ్చే పోతే తెల్వదాయె…. అని ఒకప్పుడు మనం పాడుకున్నం. బతుకమ్మ తన బతుకును చూసి మురిసిపోయేటట్టు మిషన్ కాకతీయ తోటి చెరువులు నిండినయి. ఒకప్పుడు బతుకమ్మను నిమజ్జనం చేయాల్సిన చెరువులు, కుంటల దగ్గర సర్కారు తుమ్మలు పెరిగి నీళ్లే విషతుల్యమైనయి. ఈ రోజు మా తెలంగాణకు బతుకునీయమ్మ అని గంగమ్మను, కృష్ణమ్మను తెచ్చిన అపరభగీరథుడు ‘బాపు కేసీఆర్’.
బోధించు, సమీకరించు, పోరాడు, సాధించు అని నినదించిన బాబాసాహెబ్ బాటలో నడిచిన ఉద్యమ కెరటం ‘బాపు కేసీఆర్”. అదే ఉద్యమ బాటలో తండ్రికి తగ్గ తనయగా మహిళల్లో చైతన్యం నింపి బతుకమ్మ సంబురాలతో ఉద్యమానికి ఊపిరులూదింది కల్వకుంట్ల కవిత. జనజీవన సంస్కృతినే సాంస్కృతిక ప్రతీకగా మార్చిన మా పూలమ్మ కవితమ్మ. గోల్కొండ ఖిల్లా నుంచి బుర్జ్ ఖలీఫా దాకా బతుకమ్మ వేడుకను తీసుకపోయిన ఘనత, తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ మా పూలమ్మ కవితమ్మదే. ఇది తెలంగాణ ఆడబిడ్డ సాధించిన ఘన విజయం.ఇప్పుడు తెలంగాణలో త్యాగాలే పచ్చటి తోరణాలై, వాకిండ్లన్నీ బంగారు తంగేడు లోగిండ్లవుతున్న వేళ పచ్చని పంటలపై మిడుతల దండు పడినట్లు, మూగజీవాల పై తోడేళ్ళ గుంపు దాడిచేసినట్లు కార్పొరేటు దళారుల దాడి మొదలైంది. పారాహుషార్ తెలంగాణ అమ్మా… మా బతుకమ్మ.
పంచభూతాల సాక్షిగా, ప్రకృతి సాక్షిగా, ప్రపంచమంతా సాక్షిగా, ప్రతి హృదయం సాక్షిగా ఎత్తుండ్రి బతుకమ్మను అమరవీరుల సాక్షిగా…
(వ్యాసకర్త: రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు)
-మంత్రి శ్రీదేవి