WHO DG | ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రెయెసస్ తిరిగి ఎన్నిక కానున్నారు. ఆయన ఎన్నికను ఏ సభ్య దేశం వ్యతిరేకించలేదని డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. 2017లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. వచ్చే ఏడాది ఆగస్టులో ఆయన పదవీ కాలం ముగియనున్నది. ఈ నేపథ్యంలో సంస్థ తదుపరి డబ్ల్యూహెచ్‌వో డీజీ ఎన్నిక ప్రక్రియ చేపట్టింది. ఇందుకోసం విధించిన గడువు సెప్టెంబర్ 23తో ముగిసింది.
ఇథోపియాకు చెందిన టెడ్రోస్‌ను తిరిగి ప్రతిపాదిస్తూ 28 సభ్య దేశాలు నామినేషన్లు సమర్పించాయి. డబ్ల్యూహెచ్‌వోలో 194 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. వచ్చే ఏడాది మేలో జరిగిన సంస్థ వార్షిక సమావేశంలో డబ్ల్యూహెచ్‌వో డీజీగా టెడ్రోస్ పునః నియామకాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. యూరప్, మిడిల్ ఈస్ట్ దేశాలతోపాటు బోత్స్వానా, ర్వాండా, కెన్యా దేశాలు కూడా ఆయనను నామినేట్ చేశాయి.
అయితే, ఆయన సొంత దేశం ఇథోపియా మాత్రం టెడ్రోస్ పునఃనియామకానికి నామినేట్ చేయలేదు. దీనికి ఆ దేశ ప్రధానితో టెడ్రోస్‌కు ఉన్న విభేదాలే కారణమని తెలుస్తున్నది. టెడ్రోస్ వైద్యుడు కాకున్నా.. జీవశాస్త్ర నిపుణుడిగా పేరొందారు. ప్రజారోగ్య విభాగంలో డాక్టరేట్ అందుకున్నారు.