Alien files : గ్రహాంతరవాసులు (ఏలియన్స్), యూఎఫ్ఓలు ఉన్నాయా లేదా అనే చర్చకు తెరపడే సమయం వచ్చిందా..? తాజా పరిణామాలు చూస్తే ఔననే అనిపిస్తోంది. కారణం.. వీటికి సంబంధించి తమ దగ్గర ఉన్న వీడియోలు, డాక్యుమెంట్స్ సహా సమాచారం మొత్తాన్ని విడుదల చేయాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారు. దీనికి సంబంధించిన ఫైల్స్ అన్నీ వెతికి విడుదల చేయాలని పెంటగాన్‌లోని ఫెడరల్ ఏజెన్సీలకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. వీటికి సంబంధించిన ఫైల్స్ గుర్తించి, సేకరించే ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా డిఫెన్స్ సెక్రెటరీ పీటె హెగ్సెత్కు ట్రంప్ సూచించారు.
ఈ మేరకు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇదెంతో ఆసక్తికరమైందని, ముఖ్యమైందని ట్రంప్ అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒమాబా ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఏలియన్స్ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. గ్రహాంతరవాసులు ఉండొచ్చని, కానీ, తాను వాటిని చూడలేదని ఒబామా అన్నారు. అయితే, ఇలాంటి అంశాలపై ఒబామా బహిరంగంగా మాట్లాడటం సరికాదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఒబామా పొరపాటు చేశారని ట్రంప్ అన్నారు. అమెరికా సహా ప్రపంచ దేశాల వారు ఏలియన్స్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారని, అందుకే ఆ సమాచారాన్ని ప్రజలకు తెలిపేందుకు చర్యలు తీసుకుంటున్నానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఆదేశాల మేరకు ఫెడరల్ ఏజెన్సీ ఏలియన్స్‌కు సంబంధించి తమ దగ్గర ఉన్న సమాచారాన్ని సేకరించే పనిలోపడింది.
అయితే, గ్రహాంతరవాసులు ఉన్నారనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని 2024లో ఒక నివేదిక వెల్లడైంది. అలా గుర్తించిన వాటిలో పొరపాట్లు జరిగాయని ఆ నివేదిక తెలిపింది. ఏలియన్స్ ఉనికికి సంబంధించి భిన్న వాదనలున్నాయి. కొందరు అవి ఉన్నాయని, ఇంకొందరు అవి లేవని అంటున్నారు. ఈ విషయంలో ఎక్కువగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు అమెరికానే వేలెత్తి చూపేవారు. ఈ విషయంలో అమెరికా రహస్యాల్ని దాస్తుందని విమర్శించారు. కానీ, ఇప్పుడు అమెరికా నుంచి ఈ విషయంలో అందరికీ స్పష్టత రానుంది. దీంతో ఇకపై యూఎఫ్ఓ, ఏలియన్స్ ఉనికిపై గందరగోళానికి తెరపడొచ్చు. ఇక ఇటీవలే అమెరికా విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ ప్రపంచవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టిస్తున్నాయో తెలిసిందే.