కేపీహెచ్బీ కాలనీ, జూలై 28: కేపీహెచ్బీ కాలనీలో ఇంటి ముందు పార్కింగ్ చేసిన హోండా యాక్టివాను తస్కరించేందుకు యత్నించిగా.. కుక్కల అరుపులతో స్థానికులు అప్రమత్తమై దొంగను పట్టుకున్నారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్, ఎల్ఐజీ గృహాల్లోని ఓ ఇంటి ముందు హోండా యాక్టివాను పార్కింగ్ చేశారు.
బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు యాక్టివా వద్దకు వచ్చి తాళాలు తీశారు. వాహనాన్ని తీసుకుని ముందుకు కదులుతుండగా కుక్కలు మొరగడంతో చుట్టపక్కల వారు అప్రమత్తమయ్యారు. వారిని పట్టుకునేందుకు పరుగులు తీశారు. దొంగల్లో ఇద్దరు పారిపోగా ఒక వ్యక్తి స్థానికుల చేతికి చిక్కాడు. దీంతో అతడికి దేహశుద్ధ్ది చేసి కేపీహెచ్బీ కాలనీ పోలీసులకు అప్పగించారు.