e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home News Huzurabad | ఈటల సెంటిమెంట్ డైలాగులకు పడిపోవద్దు : హరీశ్‌ రావు

Huzurabad | ఈటల సెంటిమెంట్ డైలాగులకు పడిపోవద్దు : హరీశ్‌ రావు

హుజురాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ సెంటిమెంట్ డైలాగులతో ప్రజలను బోల్తా కొట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటి డైలాగులతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని అభివృద్ధి సంక్షేమం టీఆర్ఎస్‌ పార్టీ తోనే సాధ్యం అవుతుందని ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌ రావు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి ప్రతాప సాయి రెడ్డి గార్డెన్ లో జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. 2001లో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాం అని చెప్తే ఎవరూ నమ్మలేదని.. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో.. కేసీఆర్ శవయాత్ర.. లేకుంటే తెలంగాణ జైత్రయాత్ర అని కేసీఆర్ ధైర్యంగా ప్రకటించారని హరీశ్‌ రావు ఉద్వేగంగా అన్నారు. అంతకు ముందు చాలామంది తెలంగాణ తెస్తామని ప్రజలను మోసం చేశారని, ఉద్యమాన్ని తమ అవకాశవాదానికి వాడుకున్నారని, కానీ పట్టుదలతో చిత్తశుద్ధితో రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని అన్నారు. కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని అసెంబ్లీలో ప్రకటిస్తే జానారెడ్డి లాంటి వాళ్లు కూడా నమ్మలేదని, కానీ 9నెలల్లోనే విద్యుత్ సమస్యను కేసీఆర్ పరిష్కరించారని గుర్తు చేశారు.

- Advertisement -

రెండు వందలు ఉన్న పింఛను వెయ్యి చేసి.. నేడు 2016 ఇస్తున్నారని.. కల్యాణ లక్ష్మి పథకాన్ని ఎన్నికల్లో చెప్ప లేదని.. కుల మతాలకు అతీతంగా ప్రారంభంలో 50,000 ఇచ్చి దాన్ని 75వేలు చేసి నేడు లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నామని హరీశ్‌ రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి అవుతుందా అనే అపోహలు చాలామందికి ఉండేవని.. భూ సేకరణ సమయంలో భూములు ప్రైవేటు కంపెనీలకు అమ్ముతామని కూడా ప్రచారం చేశారని అడ్డం పొడుగు మాట్లాడాలని ఆయన అన్నారు.

రాత్రింబవళ్లు పనిచేసి రెండున్నర సంవత్సరాల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి చూపించామని నేడు కాలువలు చెరువులు కుంటలు మత్తళ్ళు దునుకుతున్నాయని.. గత ప్రభుత్వాల హయాంలో కాలువలకు మోటర్లు పెడితే తహసీల్దార్లు వీఆర్ఏలు తీసుకు పోయి పోలీస్ స్టేషన్లలో తహసిల్దార్ కార్యాలయాలలో పెట్టేవారని కానీ నేడు ఆ పరిస్థితి లేదన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. కాలువలకు మోటర్లు పెట్టకుండా నాడు అధికారులు కావలి కాసే వారిని.. ఈ రెండు పరిస్థితులకు వీఆర్ఏ లే ప్రత్యక్షసాక్షులు అని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. ఒక్కొక్కటిగా ప్రభుత్వం సమస్యలను పరిష్కరిస్తూ వస్తోందని తెలిపారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా 930 గురుకుల పాఠశాలను బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థుల కోసం స్థాపించి 4 లక్షల 60 వేల మంది విద్యార్థులకు కు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తున్న ఘనత టీఆర్ఎస్‌ పార్టీ ప్రభుత్వానిదే అని సీఎం కేసీఆర్ దని మంత్రి తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు కలగా ఉండేదని మంచిర్యాల సిద్దిపేట జగిత్యాల జిల్లాల కోసం అక్కడి ప్రజలు వేచి చూశారని.. టీఆర్ఎస్ ప్రభుత్వమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని కొత్త మండలాలు రెవిన్యూ డివిజన్ లో గ్రామ పంచాయతీలు చేసిందని గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తు చేశారు.

కొత్త జిల్లాల ఏర్పాటుతో అధికారులతో ప్రమోషన్లు వచ్చాయని కొత్త ఉద్యోగాలు కూడా వచ్చాయని అన్నారు. రైతాంగా నికి రుణమాఫీ గతంలో చేశామని ప్రస్తుతం 50000 రుణమాఫీ చేసి మార్చి తర్వాత లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. కరోనా సమయంలో రాష్ట్రం అతలాకుతలమైనా.. ఆదాయం పడిపోయి ఖర్చులు పెరిగినా ప్రజలను బ్రతికించు ఉన్నామని.. ఎక్కడెక్కడి నుండో వచ్చి పని చేస్తున్న కూలీలను సొంత రాష్ట్రాలకు సొంత గ్రామాలకు పంపామని వివరించారు. హుజురాబాద్ అభివృద్ధి జరగాలని ప్రజలకు లాభం చేకూరాలని.. వీఆర్ఏలు ప్రజలను నడిపించే శక్తివంతులని మంత్రి వ్యాఖ్యానించారు.

మరో రెండున్నర సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని.. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశ మే లేదని.. ఈటల గెలవడం అసాధ్యమని ఒకవేళ గెలిచినా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఆయన చేసేది ఏమీ ఉండదని అన్నారు. ఈటల తో పాటు పనిచేసిన మంత్రులు అందరూ డబుల్ బెడ్రూం ఇండ్ల‌ నిర్మాణం పూర్తి చేస్తే.. ఏడేండ్లు మంత్రి గా ఉన్న ఈటల ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా పూర్తి చేసి గృహప్రవేశం చేయించలేక పోయారని విమర్శించారు. నిజంగా ఈటలకు పేదలపై ప్రేమే ఉంటే డబల్ బెడ్రూం ఇండ్లు పూర్తి చేసేవారు కదా.. అని అన్నారు. బీజేపీ పెద్ద నోట్లను రద్దు చేసిందని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తామని ప్రచారం చేశారని కానీ ఏం జరిగిందని మంత్రి ప్రశ్నించారు.

బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ తేలేక పోయారని, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుకు అమ్మేశారని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కూడా తేలేదని, గిరిజన యూనివర్సిటీని కూడా కేంద్రం నుండి తీసుకు రాలేదని, పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచి సామాన్యులపై పేద వారిపై భారం మోపారని మంత్రి దుయ్య బట్టారు. వీటి గురించి ఈటల ఎక్కడ కూడా ప్రస్తావించరని.. ఉత్త సెంటిమెంట్ డైలాగులతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రకటించగలరా? అని అని ప్రశ్నించారు.

బీజేపీ ప్రభుత్వానికి కోతలు వాతలు పెట్టడమే తెలుసని.. ధరలు పెంచి సబ్సిడీలు తగ్గించారని.. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మి వేస్తున్నారని వీటివల్ల ఎస్సీ ఎస్టీ నిరుపేదలకు వచ్చే ఉద్యోగాలు కోల్పోతున్నారని.. అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు కోల్పోయే పరిస్థితి దాపురించిందని.. భవిష్యత్ అంధకారం అయ్యే పరిస్థితి ఏర్పడిందని మంత్రి హరీష్ రావు అన్నారు. వీఆర్ఏలు గ్రామాలకు వెళ్లి మంచి చెడు పై చర్చ పెట్టాలని.. రైతుబంధు రైతు బీమా దళిత బంధు.. ముఖ్యమా లేక బొట్టు బిల్లలు గ్రైండర్లు మిక్సీలు మేకపోతులు కోడి పెట్టలు.. ముఖ్యమా.. అన్నది ప్రజలకు వివరించాలని కోరారు.

దళిత బంధు పది లక్షలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినప్పుడు 50 లక్షలు ఇవ్వాలని బండి సంజయ్ అన్నారని.. రాష్ట్ర ప్రభుత్వం పది లక్షలు ఇస్తోంది కేంద్రం నుండి నిధులు తీసుకు రాగలరా అని మంత్రి ప్రశ్నించారు. మీరు కేంద్రం నుండి ప్రతి కుటుంబానికి 40 లక్షలు తీసుకువస్తే నేనే మీ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తాను.. అని మంత్రి సవాల్ చేశారు. గతంలో ఉన్న పల్లెలకు నేటి పల్లెలకు వీఆర్ఏలు ప్రత్యక్షసాక్షులు అని ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయని, ఎల్ఈడీ లైట్లు వెలుగులో పల్లెలు మెరిసిపోతున్నాయి అన్నారు.

ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంప్ యార్డ్, నర్సరీ వంటివి ఏర్పాటు చేశారని ప్రతి గ్రామంలో ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్ వచ్చాయని.. ప్రతి గ్రామపంచాయతీలో ఈ సౌకర్యాలు ఉన్నాయని.. దేశంలోనే ఎక్కడా ఇవి లేవని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. చేసే వాడికి పని విలువ తెలుస్తుందని మోసేవాడికి బరువు తెలుస్తుందని.. కేసీఆర్ ను తిట్టడం మాత్రమే ప్రతిపక్షాలకు తెలుసని, ప్రతిపక్షాల ఒక్కమాటలో నిజాయితీ లేదని మంత్రి అన్నారు.

వీఆర్ఏల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తా

వీఆర్ఏల సమస్యలు ప్రభుత్వం దృష్టికి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని, తప్పకుండా తన సహాయ సహకారాలు ఉంటాయని మంత్రి హరీశ్‌ రావు హామీ ఇచ్చారు. వీఆర్ఏలకు గతంలో 6500 ఉన్నా జీవితాన్ని పది వేల ఐదు వందలు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దని, పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని ఆశీర్వదించాలని.. ఆయన కోరారు.

గ్రామాలను మార్చే శక్తి వీఆర్ఏలకు ఉందని, హుజురాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మరింత అభివృద్ధి జరుగుతుందని.. పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడని.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జైలుకు వెళ్లడం క్రమశిక్షణతో చిత్తశుద్ధితో అంకితభావంతో పని చేయడమే ఆయన ఆస్తి అని.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపున‌కు కృషి చేయాలని మంత్రి కోరారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టిఆర్ఎస్ యువనేత పాడి కౌశిక్ రెడ్డి, వీఆర్ఏల సంఘం నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement