చెన్నై: సీనియర్ డీఎంకే నేత ఈవీ వేలూ ఇంట్లో ఇవాళ ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. మరోవైపు ఆ నేత తరపున డీఎంకే చీఫ్ స్టాలిన్ ఇవాళ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వేలూ ఇంటి నుంచి భారీ మొత్తంలో నగదు బయటకు వెళ్తున్నట్లు సమాచారం రావడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. స్వంత ఊరితో పాటు చెన్నైలోనూ తనిఖీలు జరుగుతున్నట్లు ఓ అధికారి చెప్పారు. తిరువన్నమళ్లై నియోజకవర్గంలో ఉన్న వేలూ ఇంటితో పాటు మొత్తం 10 చోట్ల సోదాలు జరిగాయి. స్టాలిన్ కాసేపు గడిపిన రూమ్లో సోదాలు చేయడం వారి ఉద్దేశాన్ని తెలుపుతుందని, కానీ అక్కడ ఏమీ దొరకలేదని, వాళ్లు మా విజయాన్ని అడ్డుకోలేరని డీఎంకే జనరల్ సెక్రటరీ దురైమురగన్ తెలిపారు. ఏప్రిల్ 6వ తేదీన తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.