Neha Shetty | అన్ని వర్గాల ప్రేక్షకులను డీజే టిల్లు సినిమా ఆకట్టుకుంటుందని చెబుతోంది యువ తార నేహా శెట్టి. ఆమె రాధిక పాత్రలో నటించిన డీజే టిల్లు ఈనెల 12న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు విమల్ కృష్ణ దర్శకత్వం వహించాడు. సూర్యదేవర నాగ వంశీ చిత్ర నిర్మాత. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీజే టిల్లు సినిమా విశేషాలను, చిత్రంలో నటించిన తన అనుభవాలను తెలిపింది నేహా శెట్టి. ఆమె మాట్లాడుతూ..
మీ నేపథ్యం గురించి?
బాల్యం నుంచే నటి కావాలనే కోరిక ఉండేది. హృతిక్ రోషన్ సినిమాలో డాన్సులు చూసి చిత్రరంగంపై ఇష్టాన్ని పెంచుకున్నాను. చదువు పూర్తయ్యాక మోడలింగ్ చేశాను. మలయాళంలో ముంగారమళై 2 చిత్రంలో నటించాక, తెలుగులో పూరీ జగన్నాథ్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది. మెహబూబా చిత్రంలో నటించాను. ఆ సినిమా తర్వాత కొన్నాళ్లు యూఎస్ వెళ్లి అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో నటనలో కోర్సు నేర్చుకున్నాను. అక్కడి నుంచి వచ్చాక గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ చిత్రాల్లో నటించాను. ఇప్పుడు డీజే టిల్లు సినిమా విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
డీజే టిల్లు ఒప్పుకోవడానికి కారణం?
సితార ఎంటర్ టైన్ మెంట్స్ లాంటి ప్రముఖ సంస్థలో అవకాశం వస్తే ఎలా కాదనుకుంటాం. ఈ సినిమా ఒప్పుకోవడానికి అదొక్కటే కారణం కాదు, మంచి స్క్రిప్ట్ ఉంది. సిద్ధూ, విమల్ క్రియేటివ్‌గా, ఫన్‌గా సినిమాను డిజైన్ చేశారు. మీరు ట్రైలర్లో డైలాగ్స్ వినే ఉంటారు. ఇవన్నీ కలిసిన ఒక మంచి ప్రాజెక్ట్ లో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా.
ట్రైలర్ చూస్తే పక్కా రొమాంటిక్ ఫిల్మ్‌లా అనిపిస్తుంది?
డీజే టిల్లు ట్రైలర్ చూసి రొమాంటిక్ ఫిల్మ్ అనుకుంటారు కానీ ఈ సినిమా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపిన ఒక ప్యాకేజ్ లాంటిది. ఇందులో కామెడీ, థ్రిల్, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ అన్నీ ఉన్నాయి.
మీ క్యారెక్టర్ కాస్త బోల్డ్‌గా ఉంటుంది అనుకోవచ్చా?
డీజే టిల్లు సినిమాలో రాధిక పాత్రలో నటించాను. ట్రైలర్ రిలీజ్ అయ్యాక అంతా రాధిక ఆప్టే అని పిలుస్తున్నారు. రాధిక ఈతరం అమ్మాయి, నిజాయితీగా, ఆత్మవిశ్వాసంతో ఉంటుంది, తను కరెక్ట్ అనుకున్న పనిని చేసేస్తుంది. ఎవరేం అనుకుంటారు అనే దాని గురించి ఆలోచించదు. తను తీసుకునే నిర్ణయాల గురించి పూర్తి స్పష్టతతో ఉంటుంది. రాధిక క్యారెక్టర్ ను నేను త్వరగా అర్థం చేసుకోగలిగాను. ఆ పాత్రలా మారిపోయాను. తప్పును తప్పులా ఒప్పును ఒప్పుగా చెబుతుంది. నేను రాధిక క్యారెక్టర్‌ను చాలా రిలేట్ చేసుకోగలను. ఇలాంటి పాత్రను నేను సినిమాల్లో ఇప్పటిదాకా చూడలేదు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉన్న పాత్ర అది.
ట్రైలర్ విడుదల ప్రెస్మీట్లో ట్రైలర్లో ఉన్న పుట్టుమచ్చల డైలాగ్ గురించి జరిగిన వివాదస్పద వ్యాఖ్యలపై మీ అభిప్రాయం?
ఆ మీడియా ప్రతినిధి అలా అడగటం నిజంగా బాధగా అనిపించింది. నేను ఆ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దామనుకుంటున్నాను. అది వారి విజ్ఞతకే వదిలేశాను. అతను అడిగిన ప్రశ్నను బట్టి స్త్రీలకు అతని ఆఫీసులో, ఇంట్లో, చుట్టువాళ్లకు ఆయన ఇచ్చే గౌరవమేమిటో తెలుస్తుంది.
రాధిక పాత్ర ఎలా ఉంటుంది?
రాధిక పాత్రలో నటించేప్పుడు దర్శకుడు విమల్ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నా నుంచి సహజంగా ఆ పాత్ర స్వభావం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నారు. కానీ నేను భయపడ్డాను. నేను అనుకున్నట్లు చేస్తే ఎలా వస్తుందో అని. కానీ అందరికీ రాధిక క్యారెక్టర్లో నేను నటించిన విధానం నచ్చింది. సన్నివేశాలన్నీ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో ఉంటాయి. రాధిక పాత్ర చేసేందుకు ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు. సహజంగా నాకు అనిపించినట్లు నటించాను.
మీరు తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం ఎలా అనిపించింది?
నేను తెలంగాణ యాస వినడం కొత్త. ఈ యాసలో కామెడీ చేస్తున్నప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఈ యాసలో ఇంకా సినిమాలు రావాలి. చాలా ఫ్రెష్ కామెడీ ఉంటుంది. హీరోను రాధిక కన్ఫ్యూజ్ చేసినట్లు ట్రైలర్లో చూపించాం. రాధిక ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. అదేంటి అనేది సినిమా చూసినప్పుడు తెలుస్తుంది.
సిద్ధుతో నటించడం ఎలా అనిపించింది?
సిద్ధు టాలెంటెట్ యాక్టర్. అతను యాక్ట్ చేస్తుంటే నేనే నవ్వు ఆపుకోలేకపోయాను. అతను రచయిత, గాయకుడు కూడా. సిద్ధు నుంచి నటనలో చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను, సిద్దు, విమల్, బ్రహ్మాజీ, ప్రిన్స్ మేమంతా స్నేహితుల్లా సరదాగా ఉండేవాళ్లం. పాండమిక్ వల్ల మనమంతా ఒత్తిడికి గురయ్యాం, బాధపడ్డాం, ఆ ఒత్తిడినంతా డీజే టిల్లు చూసి నవ్వుతూ మర్చిపోతారని చెప్పగలను. నేను నటించబోయే కొన్ని సినిమాలకు సంప్రదింపులు జరుగుతున్నాయి. ఖరారు కాగానే చెబుతాను. లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
“ఇండస్ట్రీలో కొత్త తరం.. అందాలతో మాయ చేస్తున్న యువ హీరోయిన్లు..”
“Neha Shetty | కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్న నేహా శెట్టి..”
ఎన్టీఆర్, బుచ్చిబాబు సినిమాకు అదిరిపోయే టైటిల్..
మూడేండ్ల తర్వాత నాగ శౌర్యకు సమాధానం చెప్పిన సాయి పల్లవి..