దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, పేమెంట్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. మారుమూల ప్రాంతాలకూ డిజిటలైజేషన్ విస్తరిస్తున్నది. ఈ క్రమంలోనే వాణిజ్య బ్యాంకులు డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నాయి.
డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు అంటే?
డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ అంటే డిజిటల్ బ్యాంకింగ్ ఉత్పత్తులు, సేవలతోపాటు ఇప్పటికే ఉన్న బ్యాంకింగ్ సేవలను, ఉత్పత్తులను కనీస మౌలిక సదుపాయాలతో అందించే చోటు. ఇందుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలనూ విడుదల చేసింది. గ్రామీణ బ్యాంకు, పేమెంట్ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులు మినహా వాణిజ్య బ్యాంకులన్నీ వీటిని ప్రారంభించుకోవచ్చు.
ఏయే సేవలు?
సేవింగ్స్-కరెంట్ అకౌంట్లు, ఫిక్స్డ్-రికరింగ్ డిపాజిట్లు, మొబైల్-ఇంటర్నెట్ బ్యాంకింగ్లు, డెబిట్-క్రెడిట్ కార్డులు, యూపీఐ క్యూఆర్ కోడ్, భీమ్ ఆధార్, పాయింట్ ఆఫ్ సేల్ వంటి సేవలను ఈ యూనిట్లు అందిస్తాయి. వివిధ పథకాల ద్వారా రుణాలను, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు నగదు పంపిణీని కూడా ఇవి నిర్వర్తిస్తాయి.