తెలంగాణ రాజకీయ చరిత్రలో డిసెంబర్ నెలది ప్రత్యేక స్థానం. ఈ నెలలోని తేదీలు క్యాలెండర్‌ను మార్చే రోజులే కాదు, ప్రజల మదిలో గాఢమైన భావోద్వేగాలను మేల్కొలిపే విశేష ఘట్టాల సంయోగ బిందువులు. 2009, నవంబర్ 29న కె.చంద్రశేఖర్‌రావు ఆరంభించిన ఆమరణ దీక్ష, ఆ తర్వాతి పది రోజుల్లో తెలంగాణ ఆగ్రహం ఉప్పొంగి వీధులన్నీ ఒకే డిమాండ్‌తో మార్మోగిన నినాదాలు, డిసెంబర్ 9న నాటి కేంద్రమంత్రి పి.చిదంబరం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై చేసిన చరిత్రాత్మక ప్రకటన.. ఇలా మరిచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మేళవించిన మాసమే డిసెంబర్. ఈ కాలమే తెలంగాణ రాష్ట్ర భావనకు శక్తినిచ్చింది. ఈ నెలే ఆ ఉద్యమాన్ని యుద్ధప్రాంగణంగా మార్చింది.
తెలంగాణ మలిదశ ఉద్యమం పుట్టి పెరిగింది ఈ నేలపైనే కాదు, ఈ నెలలో కూడా. 2009 డిసెంబర్లో ఉప్పొంగిన ఆరాటం వల్లే 2014 జూన్‌లో తెలంగాణ వాస్తవరూపం దాల్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని 2009, డిసెంబర్ 9న నాటి కేంద్రమంత్రిగా చిదంబరం ప్రకటించిన రాత్రిని తెలంగాణ ప్రజలు మరో స్వాతంత్య్రోత్సవంలా జరుపుకొన్నారు. తెలంగాణ ఏర్పాటుతో ముడిపడిన అన్ని కీల క ఘట్టాలకు వేదిక ఈ డిసెంబర్ మాసం. కాబట్టి, ప్రజామదిలో ఈ మాసం విప్లవ సంకేతం, ఉద్యమ చిహ్నం, ఆత్మగౌరవ వేదమని చెప్పవచ్చు.
ప్రస్తుతం నడుస్తున్న డిసెంబర్‌లోనూ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరుగనున్నాయి. పరిస్థితులు భిన్న మైనవే అయినప్పటికీ, నేపథ్యం మాత్రం ఆ సెంటిమెం ట్‌తో నిండిపోయి ఉన్నది. ‘ఉద్యమం-సంఘర్షణ-ఆత్మగౌరవం’ అనే మూడు కీలక ఆయుధాలతోనే బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తున్నది. గత ఎన్నికల్లో ఎదురైన ప్రతికూలతను భావోద్వేగంతో అధిగమించాలని గులాబీ పార్టీ చూస్తున్నది. రేవంత్ ప్రభుత్వం గద్దెనెక్కి రెండేండ్లు కావస్తున్నది. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అవాంఛిత తీవ్ర జాప్యం, ఆరు గ్యారెంటీల అమలులో వైఫల్యం, పథకాల అమల్లో లోపాలు, ఆర్థిక పరిస్థితి క్షీణించడం, బడ్జెట్ లోటు రూ.65,000 కోట్లకు చేరుకోవడం, విద్య-ఆరోగ్య రంగాలపై విమర్శలు తదితర అంశాలు ప్రజల్లో మిశ్రమ అభిప్రాయాలను కలిగించాయి. గ్రామీణ స్థాయిలో పంచాయతీల సమస్యలు, బాకీలు, కుంటుపడిన అభివృద్ధి, సర్కార్ పనితీరుపై ఉన్న అసంతృప్తి పాలకులపై ఒత్తిడిని పెంచుతున్నది.
ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ ఉద్యమ వారసత్వాన్ని ప్రజలకు మరోసారి గుర్తుచేస్తున్నది. ‘ఇప్పటి తెలంగాణ – అప్పటి తెలంగాణ’ అనే పోలికను బలంగా ఆవిష్కరిస్తున్నది. కేసీఆర్ ఆమరణ దీక్షను ప్రచారంలో ప్రధానాంశంగా ముందుకు తీసుకువెళ్తున్నది. 2009 ఉద్యమకాలంలో కేసీఆర్‌పై విద్యార్థుల నమ్మకం ఎంత ఉండేదో, ఆ మహా సంగ్రామంలో ప్రజలు ఆయన వెంట ఎలా నడిచారో వివరిస్తున్నది.
కాకతాళీయంగా 2025 పంచాయతీ ఎన్నికలు కూడా డిసెంబర్ నెలలోనే జరుగనున్నాయి. ప్రజల రాజకీయ మేధస్సులో పాత జ్ఞాపకాల తలుపులు తెరవడానికి, తిరిగి ఉవ్వెత్తున ఉద్యమాన్ని సృష్టించడానికి ఈ నెల దోహదపడుతుంది. చరిత్రలో ఎంతో ప్రాముఖ్యం ఉన్న నెలలో ఎన్నికలు రావడమంటే ఓటరు మైండ్‌సెట్‌లో ఆ కాలపు ప్రతిధ్వని మౌన ప్రవాహంలా ప్రవహించడమే. ఆ ప్రవాహాన్ని రాష్ట్ర మేలు కోసం ఉపయోగించుకునే అవకాశం బీఆర్ఎస్కు వచ్చింది.
ప్రజాస్వామ్యంలో అభివృద్ధి-సంక్షేమం-ప్రయోజనం మూడు అక్షాలుగా ఉంటే, భావోద్వేగం ఒక్కటే ఎన్నికను పూర్తిగా మలచగలదనే నిజం గతంలో రుజువైంది. డిసెంబర్ నెల తెలంగాణ ప్రజల్లో రాష్ట్ర సాధన-ఆత్మగౌరవ గాథగా గుర్తింపు పొందినందున.. ఈ సెంటిమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నది.
ఓటరు మనసులో భావోద్వేగం నేపథ్య సంగీతంలా పనిచేస్తుంది. స్థానిక అభివృద్ధి, నీటి సమస్య, రహదారి, చెరువు, వ్యవసాయం, విద్యుత్తు, ఉద్యోగం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అందుబాటు.. ఇవన్నీ ప్రత్యక్ష సమస్యలు. డిసెంబర్ అంటే తెలంగాణ పుట్టుక జ్ఞాపకమనే మానసిక సంఘర్షణ మాటున కదిలే గుండె చప్పుడు కూడా ఓటరు మైండ్‌సెట్‌లో ప్రభావం చూపుతుంది. ఓటరు మైండ్‌లో బలంగా నాటుకుపోయిన 2009 డిసెంబర్లో జరిగిన సంఘటనలు ఒక్కసారిగా తట్టిలేపుతాయి. డిసెంబర్ అంటే ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి న తరంగం కావడంతో ఆ జ్ఞాపకం సత్వరమే మేల్కొంటుంది. అంటే పంచాయతీ ఎన్నికలు ఈ నెలలో జరగడం ఆ భావోద్వేగాన్ని యాదృచ్ఛికంగా పునరుజ్జీవింపజేస్తుందని చెప్పవచ్చు.
తెలంగాణ రాజకీయ చైతన్యం భారత రాష్ర్టాలన్నింటిలో అత్యధిక భావోద్వేగభరితంగా నిలుస్తుంది. ఒక వ్యక్తి తెలంగాణ జెండాను ఎత్తిపట్టినా, పాట పాడి నా, చరిత్ర చెప్పినా.. దానికి ఓటరును తక్షణం ఆకర్షించే సామర్థ్యం ఉంటుంది. తెలంగాణలో సుమారు 64 శాతం ఓటర్లు ఉద్యమ అనుసంధానిత వ్యక్తిత్వ ఆకర్షణను గుర్తించి, ఎన్నికల్లో ఏదో ఒక రూపంలో పరిగణనలోకి తీసుకుంటారని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇందులో బీఆర్ఎస్కు చారిత్రక ప్రయోజన రేఖ ఉంది. కేసీఆర్ ఆమరణ దీక్ష- ఆ చిత్రం, ఆ జ్ఞాపకాలు, ఆ నినాదాలు, ఆ రాత్రి చిదంబరం ప్రకటన.. ఇవన్నీ ఉద్యమం కాలంలో విశ్వసనీయతకు ప్రతీకలుగా నిలుస్తాయి. 2025లో ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నేతలు ఇదే అంశాన్ని ప్రచారంలో విస్తృతంగా వినియోగిస్తే, ముఖ్యంగా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న తరానికి, తదుపరి తరానికి ప్రేరణగా మారే అవకాశముంది. గ్రామాల్లో వేలమంది మన కండ్ల ముందే తెలంగాణ వచ్చిందని గుర్తుచేసుకుంటారు. ఆ జ్ఞాపకం డిసెంబర్లో తిరిగి సజీవమవుతుంది. కాబట్టి, ఈసారి పంచాయతీ ఎన్నికలు భావోద్వేగాలు-అభివృద్ధి-స్థానిక అసంతృప్తులు-రాష్ట్రవ్యాప్త రాజకీయ ప్రవాహాలు అన్నీ కలిసే ఒక యుద్ధరంగంగా ఉంటాయి. ఒకవైపు డిసెంబర్ ఉద్యమపు అగ్నిజ్వాలలను మళ్లీ వెలిగించాలనే బీఆర్ఎస్ ప్రయత్నం, మరోవైపు ప్రస్తుత పాలకుల పనితీరును ప్రజలకు వివరించాలనే కాంగ్రెస్ సంకల్పం- ఈ రెండింటి మధ్య గ్రామీణ ఓటరు నిర్ణయం మలుపుతిప్పే శక్తిగా నిలుస్తుంది. ఈ తరుణంలో పంచాయతీ ఎన్నికలు స్థానిక ఎన్నికలు మాత్రమే కాదు; తెలంగాణ ఉద్యమ చరిత్రతో, సంఘర్షణ స్మృతులతో, నేటి పాలనా నేపథ్యంతో అన్యోన్య సంబంధం కలిగిన రాజకీయ పోరాటమని చెప్పవచ్చు.