ఆధునిక యుగంలో మానవాళి రాకెట్ వేగంతో దూసుకుపోతున్నది. రోజురోజుకూ సరికొత్త సాంకేతికత అందివస్తున్నది. అయినా మానవాళికి అంతు చిక్కని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. వాటిలో ‘క్యాన్సర్’ ఒక సవాల్ లాంటిది. ‘ఈ కణాలకు ఎప్పుడు సమాధానం చెబుదామా?’ అని నిరంతర పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి. చికిత్సల్లోనూ విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. క్యాన్సర్ చికిత్సల్లో వస్తున్న సరికొత్త సాంకేతికతతో అంతుచిక్కని కణం మీద విజయం సాధించే దిశగా అడుగులు పడుతున్నాయి. అంతు చిక్కకుండా, అంతేలేకుండా విస్తరించే క్యాన్సర్ కణాలకు ఈ ఆధునిక చికిత్సలతో అడ్డుకట్ట వేయడం, చికిత్సను త్వరగా పూర్తి చేయడం, దుష్ఫలితాలను తగ్గించడం కూడా ఈ సాంకేతికత ముఖ్య లక్ష్యం. అటువంటి లక్ష్యాలతో క్యాన్సర్‌కు రేడియేషన్ థెరపీతో సమాధానం చెప్పడానికి వచ్చిందే.. ‘సైబర్ నైఫ్’.
‘క్యాన్సర్ కణానికి కత్తి తగిలితే మరింత ఎక్కువ వేగంతో విస్తరిస్తుంది’ అనే అపోహలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయి. అది కేవలం అపోహ మాత్రమే! అని నిస్సందేహంగా చెప్పవచ్చు. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తించినప్పుడు క్యాన్సర్ కణాలు ఉన్న భాగాన్ని, చుట్టూ ఉన్న టిష్యూలను, లింఫ్ నోడ్స్ను తీసివేయడం ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. కొన్ని సందర్భాలలో కత్తి కూడా లేకుండా సర్జరీ చేయగలగడం ఒక గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. మెదడు, వెన్నెముక, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, ప్యాంక్రియాస్ వంటి భాగాలలో కణుతులు వచ్చినప్పుడు, సర్జరీ కష్టసాధ్యంగా ఉన్నప్పుడు, చాలా చిన్న కణుతులను తొలగించాల్సి వచ్చినప్పుడు.. కోత లేకుండా కేవలం కణితిని మాత్రమే ‘మిస్సైల్ టెక్నాలజీ’తో మటుమాయం చేయగలిగే రేడియేషన్ పద్ధతిని రోబోటిక్ రేడియో సర్జరీ అంటారు. మనిషి సూచనలతో క్యాన్సర్ కణాలే లక్ష్యంగా, శరీరంలో ఏ భాగాన్నయినా చేరగలిగి, కచ్చితమైన చికిత్స అందించే ఈ రేడియేషన్‌ను ‘సైబర్ నైఫ్’ అనీ అంటారు.
1896 నుంచి క్యాన్సర్ చికిత్సకు రేడియేషన్‌ను ఉపయోగిస్తున్నారు. శతాబ్ద కాలంలో ఈ థెరపీలో ఊహించని మార్పులు, ఎన్నో కొత్త పద్ధతులు చోటు చేసుకుంటున్నాయి. అయితే రేడియేషన్‌ను తగిన మోతాదులో ఇవ్వకపోవడం వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతూ ఉంటాయి. వీటిలో కొన్ని తాత్కాలికం అయితే, మరికొన్ని శాశ్వతంగా ప్రభావం చూపిస్తాయి. రేడియేషన్ ఇచ్చిన అవయవం మీద ఆధారపడి వాంతులు, వికారం, వాపు, చర్మం కమిలిపోవడం, సాగే గుణం కోల్పోవడం, నోటిలో పుళ్లు, జుట్టు రాలిపోవడం, సంతానలేమి సమస్యలు.. అనేక సమస్యలు తలెత్తుతాయి.
కత్తి లేకుండానే రేడియేషన్‌తో రేడియో సర్జరీ చేసి, కణితిని తొలగించగలగడం ఇప్పుడు పెన్సిల్ బీమ్‌తో.. అంటే పాయింటెడ్ రోబోట్లతో మనిషి ఇచ్చే సూచనల సహాయంతో చేయగలుగుతున్నాం.
సైబర్ నైఫ్గా పిలిచే ఈ రోబోటిక్ రేడియో సర్జరీతో కలిగే ఉపయోగాలు..
ఐదు లేక ఆరు వారాలలో ఇచ్చే రేడియో థెరపీని, సైబర్ నైఫ్ సహాయంతో ఒకటి లేక ఐదు రోజులలోనే పూర్తి చేయవచ్చు. ఈ విధానంలో నొప్పి అస్సలు ఉండదు. మత్తుమందు, రేడియేషన్ ఇచ్చేటప్పుడు ఫ్రేమ్స్, ఊపిరి బిగపట్టాల్సిన అవసరం లేదు. రేడియేషన్ ప్రభావం క్యాన్సర్ కణాల మీద మాత్రమే ఉంటుంది. చికిత్స తర్వాత రోగి ఎలాంటి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం లేదు. శరీరంలో ఎంత చిన్న కణతి, ఎక్కడ ఉన్నా కచ్చితమైన రేడియేషన్‌ను అందిస్తుంది. ముఖ్యంగా సర్జరీ అంటే భయపడే వారికి నిమిషాలలో, కోత లేకుండా కణితిని తొలగిస్తుంది. క్యాన్సర్ కాని మెనింజియోమాస్, పిట్యూటరీ గ్రంథిలోని కణుతులు, మెదడు లోపల, బయట ఉండే కణుతులు, వెన్నెముక మీద వచ్చే కణుతులనూ సమర్థంగా తొలగిస్తుంది. రేడియేషన్ దుష్ఫలితాలను గణనీయంగా తగ్గిస్తుంది. రోగి వయస్సు, క్యాన్సర్ దశ, కణితి గ్రేడింగ్, క్యాన్సర్ కణితి ఉన్న అవయవం మొదలైన అంశాలను బట్టి క్యాన్సర్ చికిత్స కోసం రోబోటిక్ రేడియో సర్జరీని నిర్ణయిస్తారు. కొన్నిసార్లు క్యాన్సర్ తిరగబెట్టిన అవయవానికి లేదా వాల్యుమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ (Volumetric Modulated Arc Therapy / VMAT) ఇంకా ఇతర రేడియేషన్ పద్ధతులతోపాటు ఈ సైబర్ నైఫ్ చికిత్స అవసరం ఉండవచ్చు.
– డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్
98480 11421