వాష్ బేసిన్ దగ్గర.. సబ్బు ఉండాల్సిన చోట.. నోరూరించే కప్ కేక్ కనిపిస్తే? ఏం చేస్తాం? మొహం కడుక్కునే మహత్కార్యాన్ని పక్కనపెట్టి, గప్‌చుప్‌గా కప్ కేక్ లాగించాలనుకుంటాం. అయితే, అలాంటి ఆశలేం పెట్టుకోకండి. అది కేక్ కానే కాదు.. ముమ్మాటికీ మొహం కడుక్కునే సబ్బే!
సబ్బును కష్టపడి రుద్దుకోకండి, ఇష్టపడి రాసుకోండి.. అంటారు సాక్షి! తను ఐఐటీ పట్టభద్రురాలు. కాలేజీ రోజుల నుంచీ ఆమె మనసంతా.. సౌందర్య సాధనాల మీదే. సబ్బుల తయారీలో వాడే రసాయనాలు, పారబాయిన్స్ వల్ల వచ్చే సమస్యలు తనను ఆలోచింపజేశాయి. వాటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసి.. ప్రకృతి ప్రసాదించిన ఔషధ గుణాలను అందించేలా ‘స్కిన్మష్’ అనే బ్రాండ్‌తో క్రీమ్ సోప్స్‌తోపాటు షాంపూలు, హెయిర్ కండిషనర్లు, మాయిశ్చరైజర్లు .. ఇలా అరవైకి పైగా ఉత్పత్తులను అందిస్తున్నారు. అందులోనూ, హైదరాబాదీలకు క్రీమ్ సబ్బులు పరిచయం చేసింది తానేనని సగర్వంగా ప్రకటిస్తున్నారు సాక్షి. ఆమె నేతృత్వంలోని స్కిన్మష్ సంస్థ ఆయుర్వేద మూలికల నుంచి క్రీమ్ సోప్స్‌ను తయారు చేస్తున్నది. ఆ ప్రక్రియలో అనేక రకాల పండ్లనూ వాడతారు. ఆ ప్రభావం వల్ల చర్మంపై ఉండే జిడ్డు, మలినాలు తొలగిపోతాయని హామీ ఇస్తున్నారు. ఎన్నిరకాలు ఉన్నా.. మామిడి, కాఫీ ఫ్లేవర్ క్రీమ్ సోప్స్‌ను చాలామంది ఇష్టపడుతున్నారట.