హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొత్తగా పెట్టబోతున్న జాతీయ పార్టీని సీపీఐ స్వాగతిస్తున్నదని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ చెప్పారు. బీజేపీ వ్యతిరేక కూటమిని బలపరిచేలా ఆ పార్టీ ఉండాలని గురువారం ఒక ప్రకటనలో సూచించారు. మతోన్మాదాన్ని ప్రేరేపిస్తూ, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతూ, ఫెడరల్ వ్యవస్థను, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన కూటమి అవసరమన్నారు.
ఈ తరుణంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక మంది ముఖ్యమంత్రులు, కాంగ్రెస్తో సహా అన్ని జాతీయ పార్టీలు ముందుకు వస్తున్నాయని, ఇందుకు కేసీఆర్ కూడా ముందుకు రావడం సమర్థనీయమని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రకటించబోయే జాతీయ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోటీ పడాల్సి ఉన్నదని, బీజేపీ వ్యతిరేక కూటమి బలపడేలా ఆ పార్టీ అడుగులు వేస్తే మంచిదన్నారు.