క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరును తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం చేశాం. అన్ని పోలీసుస్టేషన్ల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. ఒకటి రెండు స్టేషన్లలో సరైన స్పందన లేదు.
నగర ఠాణాల్లో పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తున్నారు? సామాన్యులకు ఏ మాత్రం మర్యాదనిస్తున్నారు? ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఎంత త్వరగా రంగంలోకి దిగుతున్నారు? పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారిని నొప్పిస్తున్నారా? .. ఇలాంటి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం ఓ ప్రయోగం చేశారు. సోమవారమే విధుల్లో చేరిన 162 మంది ప్రొబేషనరీ ఎస్సైలతో 52 బృందాలను ఏర్పాటు చేసి నగర కమిషనరేట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్స్టేషన్లకు ఫిర్యాదు దారులుగా పంపించారు. దారిదోపిడీ, బెదిరింపు వంటి ఫిర్యాదులు ఇచ్చి ఠాణాల్లో రిసెప్షన్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి వరకు స్పందన ఎలా ఉందో ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. అయితే, 95 శాతం పోలీస్స్టేషన్ల సిబ్బంది పనితీరు బాగుందని, ఒకట్రెండు చోట్ల బాగా లేదని తెలిసివచ్చిందని వాటిని సరిదిద్దుతామని సీపీ అంజనీకుమార్ వెల్లడించారు.
సిటీబ్యూరో/వెంగళరావునగర్, నవంబర్ 30(నమస్తే తెలంగాణ) : సిటీబ్యూరో/వెంగళరావునగర్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఇలా ఫిర్యాదులు చేసింది ఎవరో కాదు. ప్రొబేషనరీ ఎస్సైలు. హైదరాబాద్‌లోని పోలీస్స్టేషన్లలో సిబ్బంది పనితీరు ఎలా ఉంది? బాధితులు స్టేషన్‌కు రాగానే ఎలా స్పందిస్తున్నారు? పోలీసుల నుంచి సత్వర స్పందన వస్తుందా? పోలీస్ సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది? రిసెప్షన్ వ్యవస్థ ఎలా పనిచేస్తోంది? ఫిర్యాదు అందగానే సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? లాంటి విషయాలను తెలుసుకునేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వినూత్న రీతిలో డెకాయి ఆపరేషన్లు చేయించారు. కొత్తగా సోమవారం విధులలోకి చేరిన 162 ప్రొబేషనరీ ఎస్సైలతో ఆయన సమావేశమయ్యారు. వారిని 52 బృందాలను ఏర్పాటు చేశారు.
ఒక్కో బృందంలో ఇద్దరు, ముగ్గురు ఉండేలా చూశారు. సాధారణ పౌరులుగా నగరంలోని పోలీస్‌స్టేషన్లలోకి వెళ్లాలని సిబ్బందికి సూచించారు. సివిల్ దుస్తులలో వెళ్లిన పోలీసులు ఫిర్యాదులు చేయగానే పోలీసుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఫిర్యాదు తీసుకోగానే ఘటనాస్థలాన్ని పరిశీలించడం.. సెక్టార్ ఎస్సైకి కేసు బాధ్యత అప్పగించడం, ఆయా ఫిర్యాదులను ఎస్హెచ్ఓలు పరిశీలించి చర్యలు చేపట్టారు. అయితే పోలీసుల పనితీరు బాగుందని 52 బృందాలుగా ఏర్పడిన ప్రొబేషనరీ ఎస్సైలు సీపీ అంజనీకుమార్‌కు నివేదించారు.
స్పందన బాగుంది: సీపీ అంజనీకుమార్
క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరును తెలుసుకునేందుకు ఈ ప్రయత్నం చేశాం. ఒకటి రెండు పోలీస్స్టేషన్లలో సరైన స్పందన లేదు. చిన్న చిన్న కారణాలతో ప్రొబేషనరీ ఎస్సైలతో ఫిర్యాదులు చేయించాం. 95 శాతం పోలీస్స్టేషన్ల సిబ్బంది పనితీరుపై ప్రొబేషనరీ సిబ్బంది సంతృప్తికరమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. అక్కడకక్కడ చిన్న చిన్న పొరపాట్లు దొర్లాయి. వీటిని సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తాం. కొత్త ఎస్సైలకు కూడా పోలీస్స్టేషన్లలో పనితీరు ఎలా ఉంటుంది? ఎలా స్పందించాలి? సామాన్య పౌరులతో వ్యవహరించాల్సిన విషయంలో అవగాహన పొందేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడుతాయి.