దేశీయ స్టాక్ మార్కెట్ ర్యాలీకి గత వారం బ్రేక్ పడింది. భారీగా లాభాల స్వీకరణ జరగడంతో నిఫ్టీ 223.65 పాయింట్ల మేర నష్టపోయింది. ప్రధానంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో కరెక్షన్ పెద్ద ఎత్తున జరిగింది. అయినప్పటికీ బ్యాంక్ నిఫ్టీ 2.5 శాతం మేర లాభపడింది. అంతకుముందు కేవలం పది రోజుల్లోనే 1,150 పాయింట్లు పెరిగిన నిఫ్టీలో లాభాల స్వీకరణ సహజం. నిజానికి పాజిటివ్ ట్రెండ్‌తో ప్రారంభమైన నిఫ్టీ మొదటి రెండు రోజుల్లోనూ కొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేసింది. ఈ క్రమంలో ఊహించినట్టుగానే మార్కెట్ కరెక్షన్ వచ్చి 18,197, 18,098 మద్దతు స్థాయిలను తాకింది. వీక్లీ చార్ట్‌లో బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ డార్క్ క్లౌడ్ కవర్ ఏర్పడింది. దీంతో ఈ వారం 18,034 స్థాయికి దిగువన ముగిస్తే మార్కెట్లో కరెక్షన్ కొనసాగవచ్చు.
ప్రస్తుతం 20 రోజుల చలన సగటు 17,952 వద్ద ఉన్నది. ఒకవేళ ఈ స్థాయిని దిగి ముగిస్తే 17,892 వద్ద నిఫ్టీకి పటిష్టమైన మద్దతు స్థాయి ఉన్నది. కానీ 18,318 స్థాయికి ఎగువన ముగిస్తే.. అప్‌ట్రెండ్ తిరిగి ప్రారంభమవుతుందని చెప్పవచ్చు. 18,385, 18,480 స్థాయిల్లో రెసిస్టెన్స్‌లు ఉన్నాయి. వీటికి ఎగువన మార్కెట్ మళ్లీ కొత్త గరిష్ఠాలను నమోదు చేయడానికి అవకాశాలున్నాయి.
రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ అంచనాలకు తగినట్టుగా ఉన్నందున మార్కెట్ కరెక్షన్ ఈ వారం పరిమితంగానే ఉండవచ్చు. దీపావళి (సంవత్) సమీపిస్తున్నందున కొత్త కొనుగోళ్లకు అవకాశాలెక్కువ. గత 18 నెలల్లో మార్కెట్ కరెక్షన్లన్నీ 8 శాతానికిలోపే ఉన్నాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లో 25 శాతం ర్యాలీ తర్వాత 5 శాతం కరెక్షన్ సహజమైనదే. ఈ వారం బ్యాంకింగ్, ఫైనాన్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటో, రియల్టీ షేర్లలో పాజిటివ్ ధోరణి కనిపించవచ్చు.