కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గంలో అధికార పార్టీ కాంగ్రెస్ (Congress) మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ నియమావళిని (Election Code) ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ (BRS) నాయకులు ఆరోపిస్తున్నారు. విపక్ష పార్టీల ఆరోపణలకు బలం చేకూర్చే విధంగా కొల్లాపూర్ మండలం బోడబండ తాండ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ (Sarpanch Candidate) బరిలో ఉన్న మేనావత్ రాముడు నాయక్ ఫ్లెక్సీ (Flex Banner) దర్శనమిచ్చింది. అధికారంలో ఉన్నామని ఎన్నికల కోడ్ తమకు వర్తించదని, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టంగా తెలిపేందుకే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ మద్దతు దారులైన సర్పంచ్ అభ్యర్థులపై, సానుభూతిపరులపై కాంగ్రెస్ బెదిరింపులకు దాడులకు తెగబడుతున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
ఎన్నికల ముందు ఇచ్చిన దొంగ హామీలపై ప్రజలు ఓటు రూపంలో తిరగబడుతున్నారని స్పష్టంగా తెలియడంతోనే అధికార కాంగ్రెస్ మద్దతుదారులైన సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. బోడబండ తండా గ్రామపంచాయతీలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ‘నమస్తే తెలంగాణ’ స్థానిక ఎంపీడీవో వెంకటేశ్వరరావుకు వివరణ కోరగా.. ఫ్లెక్సీ ఏర్పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందో రాదో తెలియదని, ఉన్నతాధికారులను అడిగి తెలుసుకుంటానని తెలిపారు. ఎన్నికల ఉల్లంఘన జరిగిందని భావిస్తున్న బోడబండ తాండ గ్రామపంచాయతీకి గ్రామ కార్యదర్శిని పంపించి వివరాలు తెలుసుకుంటానని తెలిపారు. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడైన సర్పంచ్ అభ్యర్థి మేనావత్ రాముడు నాయక్‌పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని బోడ బండ తండా సర్పంచ్ అభ్యర్థి, మాజీ ఎంపీటీసీ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు.