e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home News మేమున్నామని! మీకేం కాదని!!

మేమున్నామని! మీకేం కాదని!!

మేమున్నామని! మీకేం కాదని!!
  • వయో వృద్ధులకు అండగా సైబరాబాద్‌ పోలీసులు
  • ‘కమ్యూనిటీ పోలీసింగ్‌ ఫర్‌ సీనియర్‌ సిటిజన్స్‌’తో పూర్తి భద్రత
  • విశ్రాంత జీవితం ఆనందంగా గడిపేలా..
  • భద్రత కల్పిస్తూ.. సేవలందిస్తున్న రాయదుర్గం పోలీసులు
  • త్వరలోనే అన్ని పోలీస్‌స్టేషన్లకు విస్తరణ
  • ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న 280మంది వృద్ధ దంపతులు
  • ఒక ఫోన్‌ కాల్‌తో కావాల్సిన సేవలు
  • ఆపద వస్తే డయల్‌ 100 లేదా 8331013199, 7901119619

ఒంటరిగా ఉంటున్న వృద్ధులకు సైబరాబాద్‌ పోలీసులు అండగా నిలుస్తున్నారు. వారిని కలిసి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. విశ్రాంత జీవితాన్ని ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పైలట్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. మొదటగా రాయదుర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్‌ ఫర్‌ సీనియర్‌ సిటిజన్స్‌ కింద వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వారికి పోలీసులు సేవలు అందజేస్తున్నారు. దాదాపు 280 మంది వృద్ధులు, వృద్ధ దంపతులు తమ పేర్లను నమోదు చేసుకుని పోలీసు భద్రతను అవసరమైనప్పుడు పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. 

ప్రతి రోజూ కలుస్తూ… అవగాహన కల్పిస్తారు..!

పేర్లు నమోదుచేసుకున్న సీనియర్‌ సిటిజన్స్‌ను పోలీసులు అవకాశాన్ని బట్టి కలుస్తారు. అనేక అంశాలపై అవగాహన కల్పిస్తారు. సైబర్‌ నేరాల గురించి వివరిస్తారు. ‘గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసినప్పుడు వారితో మాట్లాడవద్దు. వారు అడిగే వివరాలకు సమాధానం చెప్పొద్దు. ఎవరైన గుర్తు తెలియని వ్యక్తులు మధ్యాహ్నం, సాయంత్రం, అర్ధరాత్రి సమయాల్లో అనుమానాస్పదంగా వచ్చేందుకు ప్రయత్నిస్తే ఆ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయడానికి ఏదైనా అలారం సిస్టమ్‌, లేదా ఫోన్‌ స్పీడ్‌ డయల్‌ కింద పోలీసు నంబరును పెట్టి ఆ నంబరు ప్రెస్‌ చేయగానే వెంటనే పోలీసులకు రింగ్‌ అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలి’ అని వివరిస్తున్నారు. 

మా తల్లిదండ్రులను  చూసుకున్నట్లు ఉంది

కమ్యూనిటీ పోలీసింగ్‌ ఫర్‌ సీనియర్‌ సిటిజన్స్‌ కింద వృద్ధులకు సేవలు చేస్తుంటే మా తల్లిదండ్రులకు సేవ చేసినట్లు ఉంది. చాలా మంది వృద్ధులు ఒంటరిగా ఉంటున్నారు. పిల్లలు విదేశాల్లో ఉండటం, వివాహం జరిగిన తర్వాత వేరుగా ఉండటం, ఇలా కుటుంబ నేపథ్యానికి సంబంధించిన కారణాలతో వృద్ధులు ఒంటరిగా నివసిస్తున్నట్లు తెలిసింది. వారి దగ్గరకు వెళ్లినప్పుడు వారు ఆప్యాయంగా పలకరించడం వారి అనుభవాలను చెప్పటం, టీ, కాఫీ తాగమని అడగడం మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. వారు వేగంగా పోలీసు సేవలు పొందేందుకు కావాల్సిన విషయాలను కరపత్రాల ద్వారా అందిస్తున్నామని ఈ ప్రాజెక్ట్‌ కింద పనిచేస్తున్న రాయదుర్గం పీఎస్‌కు చెందిన పీసీలు ప్రవీణ్‌కుమార్‌, కృష్ణ, అశ్విని, వినోద, మంజుల తెలిపారు. 

పార్కింగ్‌ గొడవ.. 10 నిమిషాల్లో పరిష్కారం

రాయదుర్గం పీఎస్‌ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో 67 సంవత్సరాల వృద్ధ దంపతులు నివాసముంటున్నారు. ఇటీవల అపార్ట్‌మెంట్‌లోని పార్కింగ్‌ విషయంలో గొడవ జరిగింది. దీంతో అవతలి వ్యక్తి యువకుడు కావడంతో వృద్ధుడిపై దాడికి యత్నించాడు. వెంటనే ఆ వృద్ధుడు కమ్యూనిటీ పోలీసింగ్‌ ఫర్‌ సీనియర్‌ సిటిజన్స్‌ హెల్ప్‌ డెస్క్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చాడు. 10నిమిషాల్లో అక్కడికి చేరుకుని వివాదాన్ని పరిష్కరించారు. మరోసారి సీనియర్‌ సిటిజన్స్‌తో దురుసుగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

కోడలు బెదిరిస్తుంది

‘మా కోడలు సరిగా చూడటం లేదు. సమయానికి భోజనం పెట్టడం లేదు. నన్ను చూడగానే సూటిపోటి మాటలు మాట్లాడుతుంది. ఏం మాట్లాడినా తప్పుగా అర్థం చేసుకుని గొడవకు దిగుతుంది. దీంతో ఇక బతకడం వృథా అనుకుంటున్నాను. ఏదైనా సహాయం చేయగలరా’ అని ఓ వయస్సు మీద పడిన వ్యక్తి హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఇంటికి వెళ్లి కోడలు, కొడుకు, వృద్ధుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. వయస్సు మీద పడిన వారిని కించపర్చవద్దని, వారిని గౌరవంగా చూసుకోవాలని తెలిపారు.  లేదంటే చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. త్వరలో ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ను సైబరాబాద్‌ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లకు విస్తరించి వృద్ధుల భద్రతను పోలీసులు పర్యవేక్షించనున్నారు.

ప్రతి వృద్ధుడి ఇంటికి నంబరు

ఇలా రిజిస్టర్‌ చేసుకున్న వృద్ధులకు సైబరాబాద్‌ పోలీసులు ఓ రిజిస్టర్‌ నంబర్‌ ఇస్తున్నారు. ఈ రిజిస్టర్‌ నంబరులో వృద్ధులకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాల వివరాలు, ఫోన్‌ నంబర్లు, సంతానానికి సంబంధించిన వారి ఫోన్‌ నంబర్లు, బంధువుల ఫోన్‌ నంబర్లు, విదేశాల్లో ఉండే కొడుకు, కుమార్తెల ఫోన్‌ నంబర్లు, ఇంకా వారికి ఆరోగ్యపరంగా ఉన్న అంశాలు, వారు తీసుకుంటున్న వైద్యుడి ఫోన్‌ నంబర్లు, ట్రీట్‌మెంట్‌ వివరాలు ఇతర సమాచారాన్ని పోలీసులు వారి ట్యాబ్‌లలో పొందుపర్చుకుంటున్నారు. దీంతో ఎవరికైన ఆపద వచ్చినప్పుడు డయల్‌ 100లేదా స్థానిక పోలీసు, సీనియర్‌ సిటిజన్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లు-8331013199, 7901119619 ఫోన్‌ చేసి వారి రిజిస్టర్‌ నంబరు చెప్పితే చాలు పోలీసులు వారి దగ్గర నమోదైన డాటా ఆధారంగా పరిశీలించి వెంటనే సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

Advertisement
మేమున్నామని! మీకేం కాదని!!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement